ఊదరగొట్టి వెళ్లిపోయారు!

ABN , First Publish Date - 2022-12-13T00:28:22+05:30 IST

జిల్లా ఇనచార్జి మంత్రి, వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలో తీవ్ర అసంతృప్తి నింపింది. నాలుగు రోజుల పాటు జిల్లాలో నియోజకవర్గాల విస్త్రృత స్థాయి సమావేశాలను నిర్వహించారు. కానీ తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని ఆ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ప్రసంగించిన ప్రతి నాయకుడూ ఒకే మాట వల్లించారు.

ఊదరగొట్టి వెళ్లిపోయారు!
తాడిపత్రిలో ఆవేదన..

మాకు మాట్లాడే అవకాశం ఏదీ..?

మూడున్నరేళ్లుగా పట్టించుకోలేదు..

మళ్లీ గెలిపించాలని ఎలా అడుగుతారు?

వైసీపీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి

పెద్దిరెడ్డి పర్యటనపై పెదవి విరుపు

అనంతపురం క్రైం, డిసెంబరు 12: జిల్లా ఇనచార్జి మంత్రి, వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలో తీవ్ర అసంతృప్తి నింపింది. నాలుగు రోజుల పాటు జిల్లాలో నియోజకవర్గాల విస్త్రృత స్థాయి సమావేశాలను నిర్వహించారు. కానీ తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని ఆ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ప్రసంగించిన ప్రతి నాయకుడూ ఒకే మాట వల్లించారు. ‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలవాలని ముఖ్యమంత్రి చెప్పారు. అది సాధిద్దాం. ప్రతి కార్యకర్త వైసీపీకి ఓటు వేసి గెలిపించండి’ అని పిలుపునిచ్చారు. కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నమాట నిజమేనని, త్వరలోనే న్యాయం చేస్తామని ముక్తాయింపు ఇచ్చారు. అనంతపురం, శింగనమల, రాప్తాడు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. పెద్దిరెడ్డి సహా.. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం జగనను పొగడ్తలతో ముంచెత్తడానికే పరిమితమయ్యారు. జిల్లా నాయకులు పెద్దిరెడ్డిని సైతం కీర్తించారు. తాము అలా చేశాం.. ఇలా చేశాం అని గొప్పలు చెప్పుకున్నారు. ఏ ఒక్క నియోజకవర్గ సమావేశంలోనూ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల గురించి, కార్యకర్తల గురించి చర్చించలేదు.

కార్యకర్తల గొంతుక ఏదీ...?

నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం అంటే వేదికపైన కూర్చునే అవకాశం ఇవ్వకపోయినా.. మాట్లాడటానికి మైక్‌ ఇస్తారని కార్యకర్తలు, నాయకులు అనుకున్నారు. కానీ సీన పూర్తిగా రివర్స్‌. ప్రజాప్రతినిధులు, నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్నవారే మాట్లాడారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల గొంతుక వినిపించలేదు. మూడున్నరేళ్ళవుతున్నా తమకు న్యాయం చేయలేదని పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో తమ సమస్యలు చెప్పుకోవాలని అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు భావించారు. కానీ వారికి మైకే ఇవ్వలేదు. దీంతో తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వేదికపైన ఉన్న వారికే దాదాపు 95 శాతం అవకాశం కల్పించారు.

- తొలుత రాయదుర్గం సర్పంచలు, ఎంపీటీసీలకు మాట్లాడే అవకాశం కల్పించారు. నిధుల్లేకపోతే పార్టీలో ఎందుకుండాలని వారు ప్రశ్నించారు. ఉపాధి హామీ బిల్లులు ఇస్తే చాలని వేడుకున్నారు. కళ్యాణదుర్గంలో చాలా తక్కువ సమయం సమావేశం నిర్వహించారు. ఉరవకొండ సమావేశంలో పార్టీలో అసమ్మతులు బయటపడ్డాయి. తాడిపత్రిలో జగదీశ్వర్‌రెడ్డి తనను మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడు, గుంతకల్లు, శింగనమల, అనంతపురంలోనూ కార్యకర్తలది అదే పరిస్థితి.

- రాయదుర్గం సమావేశం ముగిసినప్పటి నుంచి ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు కూడా మాట్లాడే అవకాశం కల్పించలేదు. తమను, అధినేతను పొగిడే వారికే అవకాశం కల్పించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నామినేటెడ్‌ పోస్టుల్లో నియామకమైన వారు మాట్లాడారు. వేదికపైనా వారే ఉన్నారు. దీనిపై స్థానిక నాయకుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.

భరోసానా..? బాధ్యతా..?

వైసీపీ కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు ప్రజాప్రతినిధులు ఓ వింత భరోసా ఇచ్చారు. అనంతపురం నియోజకవర్గ సమావేశంలో సోమవారం ఎంపీ రంగయ్య మాట్లాడారు. కార్యకర్తలు అసంతృప్తితో ఉన్న మాట నిజమేనని, రెండు, మూడు నెలల్లో బిల్లులతో సహా కార్యకర్తల అందరి సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ‘ఆ ధీమా ఆయనకు ఎవరిచ్చారో తెలియదుగాని.. ఎలా సంతృప్తి పరుస్తారో చూస్తాం..’ అని ఆ పార్టీ నాయకులు కొందరు వ్యాఖ్యానించారు. ‘మొన్న జరిగిన మీటింగ్‌లో.. కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు.. వారికి న్యాయం చేద్దాం అని సీఎం జగన సారు అన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదే...’ అని పెద్దిరెడ్డి అన్నారు. దీంతో ఆయన తమకు భరోసా ఇచ్చారా..? లేక బాధ్యతలు అప్పగించారా..? అని కార్యకర్తలు బుర్ర గోక్కున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల నేతలు కార్యకర్తలను పొగిడారు. ‘మీ కారణంగానే అధికారంలోకి వచ్చాం. మరోసారి అధికారంలోకి రావాలంటే మరోసారి గెలిపించండి. తప్పకుండా న్యాయం చేస్తాం’ అని కొందరు ఎమ్మెల్యేలు అన్నారు. కార్యకర్తలు ఉండేది నాయకులను గెలిపించేందుకేనా..? మా సమస్యల గురించి పట్టించుకోరా..? అలాంటప్పుడు ఎందుకు గెలిపించాలి..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-12-13T00:28:22+05:30 IST

Read more