ప్రాణాలు తీస్తున్న ఈత సరదా

ABN , First Publish Date - 2022-03-18T06:49:06+05:30 IST

వేసవి మొదలైంది. జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

ప్రాణాలు తీస్తున్న ఈత సరదా
లేపాక్షి మండలంలోని పులమతి చెరువులో పడి మృతి చెందిన నూర్‌మహమ్మద్‌,

నీటితో జాగ్రత్త

పిల్లలకు అవగాహన పెంచాలి

తల్లిదండ్రులు నిఘా వేయాలి

కాపాడే ప్రయత్నంలోనూ మరణాలు

అనంతపురం న్యూటౌన : వేసవి మొదలైంది. జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు  నమోదు అవుతున్నాయి. ఈ సీజనలో మొదటిసారి 40 డిగ్రీలు దాటింది. వేసవిలో చిన్నారులు ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతారు. పెద్దలు సైతం వీలు చూసుకుని ఈత కొలనులు, బావులు, వంకలకు వెళతారు. ఈత మంచి వ్యాయామం. ఆరోగ్యకరం. కానీ.. ఈత నేర్చుకోకుండా నీటిలో దిగడం ప్రమాదకరం. ఈ నెలలో ఇప్పటికే ఏకంగా ఎనిమిది మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఏటా వేసవిలో ఈ విషాదాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తగిన అవగాహన కల్పించాలి. వారి కదలికలపై నిఘా ఉంచాలి. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలవారు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

    నీటి కుంటలు, బావులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ. నగర, పట్టణ ప్రాంతలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంత చిన్నారులు ఎక్కువ స్వేచ్ఛగా బయట తిరుగుతారు. అందుకే.. పొంచి ఉన్న ప్రమాదాల గురించి చిన్నారులను హెచ్చరించాలి. నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో ఈత నేర్పించాలి. నీట మునిగేవారిని కాపాడే ప్రయత్నంలోనూ కొందరు  ఈత వచ్చినవారే ప్రాణాలు కోల్పోతున్నారు. అగ్నిమాపక, పోలీసు శాఖ, గజ ఈతగాళ్ల సహకారంతో, రక్షించే మెలకువలపై అవగాహన కల్పించాలి. అప్పుడే.. ఈత సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.


మూడే నిమిషాలు..

నీటి ప్రమాదాలు జరగకుండానే చూసుకోవాలని, నీట మునిగితే ప్రాణాలతో బయట పడటం చాలా కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయేందుకు కేవలం 3 నిమిషాలు చాలని, అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నీట మునిగినవారు ప్రతి నిమిషానికి ఒకసారి పైకి తేలే అవకాశం ఉందని, ఇలా మూడుసార్లు జరుగుతుందని, ఈ లోగా ఎవరైనా గమనించి కాపాడగలిగితేనే బయట పడతారని పేర్కొన్నారు. ఆ తరువాత పైకి తేలే అవకాశం ఉండదని, గాలించి బయటకు తీసేలోగా ప్రాణాలు నిలబడకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. 

-------

జిల్లాలో నీటి ప్రమాదాల కారణంగా సగటున ఏటా 70 మంది వరకు మృత్యువాత పడుతున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు అంటున్నారు. గత ఏడాది 30 మంది వరకు నీట మునిగినట్లు సమాచారం అందితే, కేవలం నలుగురిని కాపాడగలిగామని వారు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 130కి పైగా నీటి ప్రమాదాలు జరిగాయి. 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆ శాఖ పేర్కొంది. 


నిఘా ఉంచాలి..

- వేసవిలో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా వేయాలి. బడిలో ఉపాధ్యాయులు  అవగాహన పెంచాలి. వేసవిలో సాధారణంగా ఒంటిపూట బడులు ఉంటాయి. ఆ తరువాత సెలవులు కూడా వస్తాయి. దీంతో మధ్యాహ్న సమయంలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతారు. 

- ఈత రానికారణంగా గట్టుమీద ఉండేవారు సైతం, ఆగలేక కాసేపటికి నీటిలో దిగుతున్నారు. ఇదే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చెరువులు, వంకలు, వ్యవసాయ బోరుబావులు ప్రమాదాలకు నిలయాలు అవుతున్నాయి. ఈత నేర్పించడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. 

- ఈత వచ్చినా, చెరువులు, వంకల్లో దూకడం ద్వారా అడుగున ఉండే బురదలో చిక్కుపోయి కూడా కొందరు ప్రాణాలు వదులుతున్నారు. ఈత వచ్చినా, ఉధృతంగా పారే నీటిలో దూకడం కూడా ప్రమాదకరమే. ఈ అంశాలపై చిన్నారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉంది. 

- సాధ్యమైనంత వరకూ చెరువులు, వాగులు, వంకలు, బావుల వైపు చిన్నారులు వెళ్లకుండా చూసుకోవాలి.  

లేదంటే అనుకోని ప్రమాదాలు జీవితకాలపు విషాదాన్ని నింపుతాయి.


ఈ నెలలో విషాదాలు..

ఒక్కసారి ఈ నీటి ప్రమాదాలను చూడండి. ఈత రాకపోయినా నీటిలో దిగి కొందరు, కాపాడే ప్రయత్నంలో మరికొందరు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అవగాహన పెంచుకోవాలి. 

- ఈ నెల 1వ తేదీన లేపాక్షి మండలంలోని పులమతి చెరువులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హిందూపురం మండలం ఇస్లాంపురం గ్రామానికి చెందిన నూర్‌ మహ్మద్‌ కుటుంబ సభ్యులు పులమతి చెరువుకు చేపల వేటకు వెళ్లారు. నూర్‌ అహ్మద్‌ చేపలు పడుతుండగా, ఆయన కుమారుడు మహ్మద్‌ ముస్తఫా(10), సోదరుడు నూర్‌ అహ్మద్‌(21) చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. నూర్‌ అహమ్మద్‌ ఈత నేర్పుతుండగా ముస్తఫా లోతుగా ఉన్న గుంతలోకి జారిపడ్డారు. కాపాడేందుకు యత్నించిన నూర్‌ అహ్మద్‌ కూడా నీట మునిగాడు. 

- స్నేహితులతో కలసి సరదాగా ఈతకు వెళ్లిన సురేష్‌ (20) అనే యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ నెల 1వ తేదీన గుమ్మఘట్ట పరిధిలోని కేవీ చెరువులో ఈ ప్రమాదం జరిగింది. ఈత రానందుకు గట్టుమీద కూర్చున్న సురేష్‌, కాసేపటికి నీటిలోకి దిగాడు. మునిగిపోతుండగా ఓ స్నేహితుడు కాపాడే ప్రయత్నం చేశాడు. భయం కారణంగా తన స్నేహితుడిని సురేష్‌ గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ మునిగిపోతుండగా మిగిలినవారు ఒక్కరిని కాపాడగలిగారు. 

- బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌లోకి మాఘస్నానానికి వెళ్లిన 4వ తరగతి విద్యార్థిని కారుణ్య, ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఈ నెల రెండో తేదీన ఈ ప్రమాదం జరిగింది.  

- లేపాక్షి మండలంలోని గలిబిపల్లికి చెందిన విద్యార్థి దినేష్‌(14) ఈ నెల 4వ తేదీన ఈతకు వెళ్లి, చెరువులో మునిగి మరణించాడు. గ్రామ సమీపంలోని ఉప్పరపల్లి చెరువులో ఈత కొడుతూ, బురదలో ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకుని, గ్రామస్థులు అక్కడికి వెళ్లి గాలించి, బురదలో చిక్కుకున్న దినే్‌షను వెలికితీశారు. అప్పటికే అతడు మృతిచెందాడు. 

- జిల్లా కేంద్రంలోని బిందెలవారి కాలనీకి చెందిన కిషోర్‌ అనే బీకాం విద్యార్థి స్నేహితులతో కలిసి ఈ నెల 6వ తేదీ ఆదివారం ఈతకు వెళ్లాడు. శిల్పారామం సమీపంలోని వాటర్‌షెడ్‌ వద్ద ఉన్న నీటిలో ఈత కొడుతూ మునిగిపోయాడు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు. 

- యల్లనూరు మండలం లక్షుంపల్లి గ్రామ సమీపంలోని చిత్రావతి నదిలో ఈ నెల 6న నీట మునిగి, తాత, మనవడు గంగన్న, గౌతమ్‌ మృతి చెందారు.

- నార్పల మండలం నడిమిదొడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చైతన్య కుమార్‌, నవదీప్‌, ఈ నెల 16న బడి వదలగానే సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు ఈతకు వెళ్లారు. నవదీ్‌పకు ఈత వస్తుంది. దీంతో తను బావిలోకి దూకాడు. చైతన్యకు ఈత రాకపోయినా సరదాగా బావిలోకి దిగి మునిగిపోయాడు. కాపాడే ప్రయత్నంలో నవదీప్‌ కూడా నీట మునిగాడు. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇదే మండలంలోని నాయనపల్లి గ్రామానికి చెందిన శివ అనే విద్యార్థి సైతం బడి వదలగానే గ్రామ సమీపంలోని వంకలోకి ఈతకొట్టేందుకు వెళ్లాడు. ఈత రాకపోవడం, నీటి లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయి మృతి చెందాడు. ఒకే రోజు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.





అప్రమత్తత తప్పని సరి.. 

జిల్లాలో కుంటలు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈత రాకపోయినా కొందరు సరదాగా నీటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. నీటి వనరుల వద్దకు వెళ్లే పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. కన్నుమూసి కన్ను తెరిచేలోపు ఘోరాలు జరుగుతున్నాయి. ఈత రాకపోతే పెద్దవారు సైతం ప్రాణాలు కోల్పోతారు. వేసవిలో ఈ ప్రమాదాలు ఎక్కువ. అందుకే జాగ్రత్తగా ఉండాలి. 

- శరతబాబు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి


రక్షించేటప్పుడు  జాగ్రత్త...

నీటిలో పడిన వారిని కాపాడే సమయంలో అవగాహన లేని కారణంగా ఈత వచ్చినవారు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. హడావిడిగా నీటిలో దూకకుండా, గట్టుపై నుంచే రక్షించే ప్రయత్నం చేయాలి. అలా వీలుకానప్పుడు నీటిలో దూకాలి. మునిగి పోతున్నవారిని కింది  నుంచి పైకి లేపే ప్రయత్నం చేయాలి. కాలు లేదా చెయ్యి పట్టుకుని ఒడ్డుకు లాక్కురావాలి. తల వెంట్రుకలు పట్టుకుంటే బయటకు లాక్కురావడం సులభంగా ఉంటుంది. 

- జగన్నాథ్‌ రెడ్డి, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ


బడిలో అవగాహన కల్పించాలి.. 

ప్రమాద మృతుల్లో ఎక్కువగా పాఠశాల విద్యార్థులే ఉంటున్నారు. ఈత రాకపోయినా సరదాగా బావులు, చెరువుల్లోకి దిగుతున్నారు. నీటి లోతును అంచనా వేయలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈతపై తగిన శిక్షణ తీసుకోవాలి. పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పాలి. తద్వారా నీటి వనరుల వద్దకు పిల్లలు వెళ్లకుండా చూడవచ్చు. 

- నియతి, నేషనల్‌ స్విమ్మింగ్‌ పార్టిసిపెంట్‌


బావిలో మునిగి విద్యార్థి మృతి

హిందూపురం టౌన: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన సుధీర్‌(18) అనే విద్యార్థి బావిలో మునిగి మృతిచెందాడు. కిరెకెర వద్ద గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హిందూపురం అప్‌గ్రేడ్‌ సీఐ జీటీనాయుడు తెలిపిన మేరకు, హిందూపురం బాపూజీనగర్‌కు చెందిన నరేంద్ర, వెంకటలక్ష్మమ్మ దంపతుల పెద్దకుమారుడు సుధీర్‌ కిరెకెర ఎల్‌ఆర్‌జీ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి కిరెకెర సమీపంలోని బావి వద్దకు ఈతకు వెళ్లాడు. పై నుంచి దూకి లోతుకు వెళ్లాడు. తిరిగి బయటకు రాకపోవడంతో స్నేహితులు అక్కడ నుంచి జారుకున్నారు. పరీక్షలకు సుధీర్‌ హాజరుకాకపోవడంతో తల్లిదండులకు ప్రిన్సిపాల్‌ ఫోనచేసి తెలిపారు. సాయంత్రం అయినా సుధీర్‌ రాకపోవంతో వెంట వెళ్లిన స్నేహితులను తల్లిదండ్రులు ఆరాతీశారు.  దీంతో వారు సుధీర్‌ బావిలో మునిగిపోయిన విషయం బయటపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి 8 గంటలకు అగ్నిమాపక సిబ్బందితో కలిసి బావి వద్దకు వెళ్లారు. మృతదేహాన్ని రాత్రి 10 గంటకు వెలికితీశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Updated Date - 2022-03-18T06:49:06+05:30 IST