బీఏఎస్‌ కనుమరుగు

ABN , First Publish Date - 2022-08-31T05:49:50+05:30 IST

బీఏఎస్‌..! ఎస్సీ, ఎస్టీ పేద వర్గాల విద్యార్థులకు ఒకప్పుడు ఈ పథకం వరంలాంటిది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ఎంతో మంది కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచితంగా చదువుకున్నారు.

బీఏఎస్‌ కనుమరుగు
ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల సముదాయం (పెన్నార్‌భవన)

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ చదువులు దూరం

టీడీపీ హయాంలో వేలాది మందికి ఉచిత విద్య

వైసీపీ అధికారంలోకి వచ్చాక పథకం రద్దు

కొనసాగించాలని తల్లిదండ్రుల డిమాండ్‌


బీఏఎస్‌..! ఎస్సీ, ఎస్టీ పేద వర్గాల విద్యార్థులకు ఒకప్పుడు ఈ పథకం వరంలాంటిది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ఎంతో మంది కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచితంగా చదువుకున్నారు. మెరుగైన ఫలితాలను సాధించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్కీమ్‌ను జిల్లాలో విజయ వంతంగా అమలు చేసింది. అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు పరిచింది. 2019 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఈ స్కీమ్‌ను ఎత్తేసింది. దీంతో ఆయా వర్గాల విద్యార్థులు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదవాలంటే వేలకు వేలు ఫీజలు చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా వారి ఆశలు గల్లంతయ్యాయి. అప్పటి వరకూ బీఏఎస్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. స్కీమ్‌ను ప్రభుత్వం రద్దు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై కార్పొరేట్‌ యాజమాన్యాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఫీజులు చెల్లించండి... లేదంటే మీ పిల్లల టీసీలను తీసుకెళ్లండి అని ఖరాకండిగా చెప్పేస్తున్నాయి. విధిలేని పరిస్థితుల్లో కొందరు బయటికి వచ్చేశారు. మరికొందరు అప్పు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. బీఏఎస్‌ స్కీమ్‌ రద్దుతో జిల్లాలో వందలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యకు దూరమయ్యారు. 

- అనంతపురం ప్రెస్‌క్లబ్‌


మూడేళ్లుగా దూరం

బీఏఎస్‌ ద్వారా ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివారు. అప్పటి ప్రభుత్వం ఈ స్కీమ్‌ కింద 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఒక్కో విద్యార్థికి రూ.30 వేలు చొప్పున ఆయా ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకు చెల్లించేది. 2019 వరకూ ఉమ్మడి జిల్లాలో 6 వేల మందికిపైగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు లబ్ధిపొందారు. మూడేళ్లుగా వీరందరూ ఇబ్బంది పడుతున్నారు.


అమలు చేయాల్సిందే...

జిల్లాలో ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ పేద ప్రజలు ఉన్నారు. వారి పిల్లలకు కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్య కోసం ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అమలైన బీఏఎస్‌ స్కీమ్‌ ఎంతో ఉపయోగపడేది. ఆ పథకం కింద విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. బీఏఎస్‌ పథకం రద్దు కావడంతో 2019 నుంచి ఎంతో మంది విద్యార్థులు మెరుగైన విద్యకు దూరమయ్యారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బీఏఎస్‌ పథకాన్ని అమలు చేయాలి. లేదంటే ఎస్సీ, ఎస్టీ ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. 

- సురేష్‌ యాదవ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య


ఉసురు తప్పదు..

గత ప్రభుత్వం అమలు చేసిన బీఏఎస్‌ పథకాన్ని సీఎం జగన్మోహనరెడ్డి రద్దు చేయడం దుర్మార్గమైనచర్య. కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యనందిస్తానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీరని మోసం చేశారు. సంక్షేమ పథకాలను రద్దు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యా పథకాలను రద్దు చేయడం బాధాకరం. సీఎం జగన్మోహనరెడ్డికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉసురు తగలక తప్పదు. సీఎంకు ఎస్సీ, ఎస్టీల పట్ల చిత్తశుద్ధి ఉంటే పథకాన్ని ఇప్పటికైనా అమలు చేయాలి. 

- సాకే హరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు


డబ్బు కట్టి చదివిస్తున్నా...

నా కొడుకు కళ్యాణదుర్గం వివేకానంద పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఇంతకు ముందు బీఏఎస్‌ పథకం కింద ఫ్రీగా చదువు చెప్పారు. మూడేళ్లుగా ఆ పథకం లేదని అంటున్నారు. ఏం చేస్తాం.. మేమంటే చదువుకోలేదు. నా కొడుకుని బాగా చదివించాలనుకున్నాం. గవర్నమెంట్‌ బడిలో వేస్తే చదువు సరిగా చెప్తారో లేదో తెలీదు. అందుకే కూలీనాలీ చేసుకొని వచ్చిన డబ్బును తెచ్చి ఫీజు కడుతున్నాం. ఒకప్పుడు ఫ్రీగా చదివిన స్కూల్లోనే సంవత్సరానికి రూ.20 వేలకుపైగా ఖర్చుపెట్టి చదవిస్తున్నాను. ముందు మాదిరి ఆ పథకం అమలైతే మాలాంటి పేదోళ్లకు మేలు జరుగుతుంది.

- శాంతమ్మ, కాపర్లపల్లి, కళ్యాణదుర్గం


ప్రభుత్వ బడిలో చదివిస్తున్నా...

నా కొడుకు మోహనకృష్ణను అనంతపురంలోని విజయ పబ్లిక్‌ స్కూల్లో 6వ క్లాస్‌ వరకూ చదివించాను. అప్పుడే బీఏఎస్‌ పథకం కింద ఫీజులు లేకుండా ఫ్రీగా నా బిడ్డ ప్రైవేట్‌ స్కూల్లో చదుకునేవాడు. అందరూ ఆనందపడ్డాం. అయితే ఈ జగన ప్రభుత్వం వీటికి మంగళం పాడింది. దీంతో ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు చెల్లించలేక కళ్యాణదుర్గంలోని గవర్నమెం ట్‌ స్కూల్లో చదివిస్తున్నాం. ఇప్పుడు నా కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు. 

- విద్యార్థి తల్లి భూలక్ష్మి,  దొడగట్ట, కళ్యాణదుర్గం

Updated Date - 2022-08-31T05:49:50+05:30 IST