-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Attack on the opposition-NGTS-AndhraPradesh
-
ప్రతిపక్షాలపై కక్షసాధింపు
ABN , First Publish Date - 2022-07-18T06:59:46+05:30 IST
ప్రతిపక్ష పార్టీల నాయకులపై పోలీసులతో వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చ ర్యలకు పాల్పడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.

పోలీసు వ్యవస్థను సీఎం జగన దుర్వినియోగం చేస్తున్నాడు..
పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్ గనమెన్ల ఉపసంహరణపై ఆగ్రహం
శత్రువుల పన్నాగాలు, ఎత్తులకు ప్రభుత్వం ఊతమిస్తోంది
పరిటాల రవి హత్య వెనుక పరోక్షంగా పోలీసుల సహకారం
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు
అనంతపురం అర్బన, జూలై 17: ప్రతిపక్ష పార్టీల నాయకులపై పోలీసులతో వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చ ర్యలకు పాల్పడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. ఆదివారం స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు వ్యవస్థను సీఎం జగనమోహనరెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్ ఫోన ట్యాపింగ్ చేయడం దారుణమన్నారు. పెగాసెస్ వ్యవహారాలపై వరుసగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఉన్నఫలంగా గనమెన్లను వెనక్కి రావాలని ఆదేశించారన్నారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారన్నారు. ప్రస్తుతం కేశవ్ గనమెన్లు లేకుండానే తిరగాల్సి వస్తోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రతిపక్ష నేతల గనమెన్లను తీసేశారన్నారు. అయినప్పటికీ తాము ప్రభుత్వాన్ని విన్నవించుకోకుండా ప్రజాసమస్యలపై అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిటాల రవికి గనమెన్ల సంఖ్యను కుదించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆయన హత్యకు పరోక్షంగా పోలీసుల సహకారం అందించారని ఆరోపించారు. గనమెన సౌకర్యం కలిగిన వారి జాబితాను జిల్లా ఎస్పీ సమీక్షించాలన్నారు. ఇతరులతో ఎలాంటి ప్రాణహాని లేని వారికి, ప్రజలతో సంబంధం లేని వారికి రక్షణ కల్పిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు, అక్రమ వ్యవహారాలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలకు రక్షణ లేకుండా చేస్తూ, వారి ప్రత్యర్థుల పన్నాగాలు, ఎత్తుగడలకు ప్రభుత్వం పరోక్షంగా ఊత మిస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకుల కదలికలు ప్రత్యర్థులకు చేరవేస్తూ పాలకులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించడం అనైతికమన్నారు. ఈ తరహా సంస్కృతికి ఇప్పటికైనా పోలీసులు స్వస్తి పలికి, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతిపక్ష నాయకుల రక్షణపై అలసత్వం, అశ్రద్ధను వీడాలని డిమాండ్ చేశారు.