యథేచ్ఛగా ఇసుక దోపిడీ

ABN , First Publish Date - 2022-01-23T06:24:32+05:30 IST

జిల్లాకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శింగనమల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.

యథేచ్ఛగా  ఇసుక దోపిడీ

చెలరేగిపోతున్న అక్రమార్కులు 

రాత్రిపూట జోరుగా రవాణా 

రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్న వైనం

బుక్కరాయసముద్రం, జనవరి 21: జిల్లాకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న  శింగనమల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రాజకీయ నాయకుల అండదండలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. సా యంత్రం 6 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు ట్రాక్టర్లతో వందలాది ట్రిప్పులు అనధికారికంగా  తరలిస్తున్నా.. పట్టించుకునే దిక్కులేదు. నిఘావ్యవస్థ నీరుగారిపోవడం ఇసుక మాఫియాకు వరంగా మారింది. గతేడాది నియోజకవర్గంలోని వాగులు, వంకల్లో భారీగా ఇసుక మేట లు వేశాయి. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. బుక్కరాయసముద్రం మండలం నుంచి రోజూ 100 ట్రాక్టర్లకుపైగా ఇసుక అనంతపురంలోని పలు అపార్టుమెంట్లు, భవనాల నిర్మాణానికి అక్రమంగా తరలిస్తున్నారు. సెబ్‌ పోలీసుస్టేషన, పోలీసుస్టేషన, మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదు టే ఈ వాహనాలు వెళ్తున్నా.. అపే ధైర్యం చేయలేక పోతున్నారు. మండలంలోని నీలంపల్లి, జంతులూరు, చెదల్ల, వడియంపేట, రేగడికొత్తూరు, గ్రామాల నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుక రూ.6 వేల నుంచి రూ.7500 వరకు విక్రయిస్తున్నారు. శింగనమల, గార్లదిన్నె, నార్పల, యల్లనూరు, పుట్లూరు మండలాల నుంచి అధికార పార్టీకి చెందిన నేతలు యథేచ్ఛగా ఇసుకను రవాణా చేసి, రోజూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన సెబ్‌ సిబ్బంది కూడా అటువైపు దృషి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


ఇసుక మాఫియాతో సిబ్బంది ములాఖత...!

ఇసుక మాఫియాతో సెబ్‌, పోలీసు విభాగంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ములాఖత అయినట్లు సమాచారం. దాడులు చేయడానికి వస్తే ముందుస్తుగా వారికి సమాచారం అందిస్తుండటంతో ఆరోజు ఇసుక రవాణా నిలుపుదల చేస్తున్నారు. ముందుస్తు సమాచారం ఇచ్చేందుకు ఇసుక మాఫియా.. కిందిస్థాయి సిబ్బందికి బాగానే ముట్టజెబుతున్నట్లు సమాచారం.


బిల్లులు లేకుండానే ఇసుకరీచ నుంచి తరలింపు

యల్లనూరు మండలంలోని లక్షుంపల్లి ఇసుక రీచ నుంచి అధికారికంగా కొన్ని టిప్పర్లు తరలిస్తుంటే... మరికొన్ని ఒక బిల్లుతోనే రోజంతా అనధికారికంగా రవాణా చేస్తున్నారు. దర్జాగా టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తుంటే తనిఖీ చేయాల్సిన అధికారులు మిన్నకుండి పోతున్నారు. దీంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది.


తరిమెల, నీలంపల్లి రీచలలో యంత్రాలతో తవ్వి రవాణా 

శింగనమల, బుక్కరాయసముద్రం మండలాల్లో రెండు గ్రామాల్లో ఇసుక రీచలలో అధికార పార్టీకి చెందిన కొంతమంది ఎక్స్‌కవేటర్‌ పెట్టి యథేచ్ఛగా ఇసుకను తవ్వి టిప్పర్లు,  ట్రాక్టర్లు ద్వారా తరలిస్తున్నారు. రాత్రి సమయాల్లో యంత్రాలు పెట్టడం, ఉదయాన్నే వాటిని కనపడకుండా చేసి ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఇంత సాగుతున్నా అధికారులు అటువైపు కన్నెతి చూడటంలేదు. దీంతో ఈ రెండు మండలాల నుంచి   రోజుకు 500 నుంచి 800 ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు.

Read more