యథేచ్ఛగా ఖనిజ దోపిడీ

ABN , First Publish Date - 2022-06-21T05:56:19+05:30 IST

ఉమ్మడి జిల్లాలో అక్రమ మైనింగ్‌తో యథేచ్ఛగా ఖనిజసంపదను తరలిస్తున్నారు.

యథేచ్ఛగా ఖనిజ దోపిడీ

 అక్రమ మైనింగ్‌ నియంత్రణ ఏదీ...?

 ఉమ్మడి జిల్లాలో అధికారికంగా 436 లీజులు

 గతేడాది వందలాది అక్రమ రవాణా వాహనాల సీజ్‌ 

 రూ.కోట్లలో జరిమానా వసూలు


అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 19: ఉమ్మడి జిల్లాలో అక్రమ మైనింగ్‌తో యథేచ్ఛగా ఖనిజసంపదను తరలిస్తున్నారు. జిల్లాలో ఉన్న గ్రానైట్‌, డొలమైట్‌, కంకర, ఇసుక ఇలా అన్ని ఖనిజ వనరులను  కొల్లగొడుతున్నారు. దీంతో జిల్లా ప్రజలకు అందాల్సిన ఫలితాలను ఇతరులు లాక్కెళ్తున్నారు.  ఖనిజ అక్రమ రవాణాను అరికట్టడంలో భూగర్భ గనుల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మైన్స లీజింగ్‌ విధానంతో ఖనిజ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయొచ్చు  అని భావిస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 436 లీజులు

  గ్రానైట్‌, కంకర, డొలమైట్‌, ఇసుక తదితర వాటికి సంబంధించిన లీజులు ఉమ్మడి జిల్లాలో 436 ఉన్నాయి. వీటి నుంచి అఽధికారికంగా ఖనిజసంపదను తరలిస్తున్నారు. అయితే వీటిలో సగానికిపైగా అనుమతి లేకుండా యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. ప్రతి ఏటా జిల్లాలో భూగర్భగనుల శాఖ విజిలెన్స అధికారులు అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేసి జరిమానా విధిస్తున్నారు. 

నూతన విధానంతో అక్రమాలు ఆగేనా..?

విచ్చలవిడిగా సాగుతున్న ఖనిజ అక్రమ రవాణాకు నూతన మైనింగ్‌ విధానంతో అడ్డుకట్ట పడుతుందేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇదివరకు ఉన్న గనుల తవ్వకం అనుమతికి భిన్నంగా ఆనలైన విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ఎవరు ముందు, తక్కువకు కోట్‌ చేస్తే లీజు వారికే కట్టబెట్టే పరిస్థితి ఉండేది. ఖనిజాన్ని తరలించే వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్‌ ఉండాలని నిబంధన విధించడం, మైనింగ్‌ను జియోట్యాగింగ్‌ చేయడం నూతన విధానంలో తీసుకువచ్చారు. 

గతేడాది 864 వాహనాల సీజ్‌

  2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో అక్రమంగా ఖనిజాన్ని రవాణా చేస్తున్న 864 వాహనాలను భూగర్భ గనుల శాఖ విజిలెన్స అధికారులు సీజ్‌ చేసి, కేసులు నమోదు చేశారు. రూ.2కోట్లు జరిమానాలు వసూలు చేశారు. పట్టుబడిన వాహనాల నుంచే ఈ మొత్తంలో జరిమానా విధించారంటే ఇక గుట్టుగా అధికారుల కంట పడకుండా ఏ స్థాయిలో సంపదను కొల్లగొడుతున్నారో ఊహించుకోవచ్చు. ఈ ఏడాది రెండు నెలల్లోనే ఖనిజాన్ని అక్రమ రవాణా చేస్తున్న 240 వాహనాలను సీజ్‌ చేసి రూ.40లక్షల వరకు జరిమానా, పన్నులు వసూలు చేశారు. 


 

Read more