ఎలాగైనా సరే..!

ABN , First Publish Date - 2022-12-10T00:31:42+05:30 IST

ఇండియన ఆయిల్‌ కార్పొరేషన ఇంధన రవాణా టెండర్లను దక్కించుకునేందుకు ఆయిల్‌ ట్యాంకు ట్రక్కుల యజమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అడ్డదారిని ఎంచుకుంటు న్నారు. గతంలో ఉన్న ఆయిల్‌ ట్యాంకర్ల కంటే తక్కువ సంఖ్యలో ఐఓసీ టెండర్లను పిలిచింది.

ఎలాగైనా సరే..!
నక్కనదొడ్డిలోని ఐఓసీ

ఆయిల్‌ ట్రక్కు లైసెన్సుల కోసం అడ్డదారి

కొత్త చాసీలకు పాత ట్యాంకుల ఏర్పాటు

బయటివారు బిడ్‌ వేయకుండా మంతనాలు

స్థానికంగా రింగ్‌ అయ్యేందుకు యత్నాలు

ఆయిల్‌ రవాణా టెండరు దాఖలు ప్రారంభం

అద్దె వాహనాల సంఖ్యను తగ్గించిన ఐఓసీ

ఇండియన ఆయిల్‌ కార్పొరేషన ఇంధన రవాణా టెండర్లను దక్కించుకునేందుకు ఆయిల్‌ ట్యాంకు ట్రక్కుల యజమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అడ్డదారిని ఎంచుకుంటు న్నారు. గతంలో ఉన్న ఆయిల్‌ ట్యాంకర్ల కంటే తక్కువ సంఖ్యలో ఐఓసీ టెండర్లను పిలిచింది. దీంతో ట్రక్కు ఓనర్లు ఎలాగైనా కాంట్రాక్టులు దక్కించుకోవాలని చూస్తున్నారు. కొందరు ఆయిల్‌ ట్రక్కులను హుటాహుటిన కొని, అనుమతులు పొందడానికి అడ్డదారిలో ప్రయత్నిస్తున్నారు. ఆయిల్‌ ట్రాన్సపోర్టేషన టెండర్లకు శుక్రవారం నుంచి బిడ్ల దాఖలు ప్రారంభమైంది. - గుంతకల్లు

తగ్గిన ట్రక్కుల సంఖ్య

గుంతకల్లు మండలం నక్కనదొడ్డిలోని ఐఓసీ ఇంధన గిడ్డంగి సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐదేళ్ల ఆయిల్‌ ట్రాన్సపోర్టేషన కోసం ట్రక్కుల అద్దె కొనుగోలు కోసం టెండరు పిలిచింది. పాతతరం టాప్‌ ఆయిల్‌ ఫిల్లింగ్‌ ట్రక్కులను కాకుండా కొత్త టెక్నాలజీ ప్రకారం బాటం ఫిల్లింగ్‌ ట్యాంక్‌ ట్రక్కులను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. 12 కిలో లీటర్ల నుంచి 16 కి.లీ. సామర్థ్యం ఉన్న 49 ఆయిల్‌ ట్యాంకు ట్రక్కులను, 18 కి.లీ. నుంచి 40 కి.లీ. సామర్థ్యం ఉన్న 21 ట్యాంకులను అద్దెకు తీసుకునేందుకు గత నెల 25వ తేదీన టెండరు పిలిచింది. గతంలో 114 ఆయిల్‌ ట్రక్కులకు అగ్రిమెంటు చేసుకున్న ఐఓసీ, ఈసారి 44 ట్యాంకర్లను తగ్గించి, టెండరు పిలిచింది. దీంతో ఆయిల్‌ ట్రక్కుల యజమానుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఐఓసీ అగ్రిమెంటు లభించకపోతే ట్రక్కుకు నిలిపివేయాల్సి ఉంటుంది. లేదా ఇతరులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ట్రక్కుల యజమానులు బిడ్‌ వేయడానికి సిద్ధమయ్యారు. ఆయిల్‌ ట్రాన్సపోర్టేషన టెండరులో పాల్గొనడానికి కొందరు కొత్త ట్రక్కులను కొనుగోలు చేస్తున్నారు. గుంతకల్లు, గుత్తి తదితర ప్రాంతాలకు చెందినవారు, కర్నూలు జిల్లాకు చెందిన మరికొందరు ఆయిల్‌ ట్రక్కులను కొంటున్నారు. ఈ నెల 9న ఆనలైన టెండరు దాఖలు మొదలైంది. 20వ తేదీ ముగుస్తుంది. 21వ తేదీన టెండరు షెడ్యూళ్ల పరిశీలన, కాంట్రాక్టు కేటాయింపు జరుగుతుంది. సమయం తక్కువగా ఉండటంతో కొత్తగా ట్రక్కులను కొంటున్న యజమానులు గడువులోగా ట్రక్కులను సిద్ధంచేయడానికి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు.

రింగ్‌కు యత్నం

ఇంధన రవాణా టీటీల కాంట్రాక్టుల కోసం ట్యాంకర్ల యజమానులు ఎత్తుగడ వేస్తున్నారు. బయటి నుంచి వచ్చేవారికి అవకాశం ఇవ్వకూడదని, స్థానికంగా ఉన్న ఆయిల్‌ ట్రక్కుల యజమానులు వ్యూహం పన్నుతున్నారు. వాహనాల కోసం ఐఓసీ ఈ-టెండర్‌ విధానాన్ని అనుసరిస్తోంది. దీంతో ఇతర ప్రాంతాలవారు సైతం సులభంగా టెండరు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గుంతకల్లు, గుత్తి తదితర ప్రాంతాల ట్రక్కు యజమానులు ఒక్కటయ్యేందుకు మంతనాలు జరుపుకుంటున్నారు. ఒక వ్యక్తి ఐదు ట్యాంకర్లదాకా బల్క్‌ టెండరు వేసుకునేందుకు ఐఓసీ అవకాశం కల్పిస్తోంది. దీంతో ముగ్గురు, నలుగురు ట్యాంకర్ల యజమానులు ఒక బంచగా దరఖాస్తు చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి టెండరులో పాల్గొనాలని భావిస్తున్న ట్రక్కుల ఓనర్లను సంప్రదించి, వారు బిడ్‌ వేయకుండా చర్చలు జరుపుతున్నారు. ఇతర ప్రాంతాల టెండర్లకు గుంతకల్లు ప్రాంతం నుంచి షెడ్యూళ్లు వేయడం లేదని, కనుక ఇక్కడి టెండర్లలో ఇతరు రాకూడదని, వచ్చినా వాహనాలు తిరగనివ్వబోమని తెగేసి చెబుతున్నారని సమాచారం. గతంలో ఇలా ఇతర ప్రాంతాల నుంచి బిడ్‌ వేసిన వారి వాహనాలను పట్టణ శివారుల్లోనే నిలిపివేశారు.

పాత ట్యాంకులకు కొత్త పూత

విజయవాడ తదితర ప్రాంతాల్లో ట్రక్కుల చాసీలను కొన్నవారు వాటికి డ్రైవరు క్యాబినను తమిళనాడులో తయారు చేయించాలి. చత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని రాయపూర్‌లో ఆయిల్‌ ట్యాంకును తయా రు చేయించి, మోటారు వాహనాల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత విశాఖపట్టణంలో ఎక్స్‌పోజ్‌ లైసెన్సను పొందాలి. అప్పుడే ఐఓసీ ఈ-టెండర్లలో పా ల్గొనే అవకాశం ఉంటుంది. ఈ తతంగాన్ని పూర్తిచేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే అడ్డదారిని ఎంచుకుంటున్నారు. ట్రక్కు చాసీని కొని, తమిళనాడుకు వెళ్లి క్యాబినను చేయించుకుని, తాడిపత్రి ప్రాంతంలో పాతతరం టాప్‌ ఫిల్లింగ్‌ ట్యాంకు కు కొత్తగా రంగులు వేయిస్తున్నారు. దాన్ని కొత్త ట్రక్కుకు బిగించి, మోటారు వాహనాల శాఖ నుంచి టెంపరరీ రిసీట్లు (టీఆర్‌) తీసుకుంటున్నారు. మో టార్‌ వెహికల్‌ రిజిస్ట్రేషన ముగించుకుని, చాసీకి బిగించిన పాత ట్యాంకును తొలగించి రాయపూర్‌కు వెళ్లి కొత్త ట్యాంకులను ఫిట్‌ చేయించుకుంటున్నారు. కాగా ఐఓసీ గతంలో మాదిరిగా 90 అధికారికంగా, 24 ఆపద్ధర్మంగా ట్యాకర్లను అద్దెకు తీసుకుంది. ఇదే సంఖ్యలో ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటుందని భావించిన కొందరు ట్రక్కుల యజమానులు, కొత్త ఆయిల్‌ ట్యాకర్లను కొనుగోలు చేశారు. తీరా 70 ట్రక్కులకే ఐఓసీ టెండరు పిలవడంతో ఓనర్ల గుండెల్లో రాయిపడింది.

Updated Date - 2022-12-10T00:31:45+05:30 IST