మరో కౌన్సిలర్‌పై వైసీపీ వర్గీయుల దాడి

ABN , First Publish Date - 2022-09-28T05:49:12+05:30 IST

రెండురోజుల వ్యవధిలో దళితులైన ఇద్దరు టీడీపీ మున్సిపల్‌ కౌన్సిలర్లపై వైసీపీ వర్గీయులు దాడిచేయడాన్ని నిరసిస్తూ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేశారు.

మరో కౌన్సిలర్‌పై వైసీపీ వర్గీయుల దాడి
మౌన ప్రదర్శనలో పాల్గొన్న కౌన్సిలర్లు, అనుచరులు, నాయకులు

తాడిపత్రిలో టెన్షన

జేసీపీఆర్‌ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన

పట్టణ పోలీస్‌ స్టేషన ఎదుట బైఠాయింపు

బలవంతంగా పంపించిన పోలీసు అధికారులు


తాడిపత్రి, సెప్టెంబరు 27: రెండురోజుల వ్యవధిలో దళితులైన ఇద్దరు టీడీపీ మున్సిపల్‌ కౌన్సిలర్లపై వైసీపీ వర్గీయులు దాడిచేయడాన్ని నిరసిస్తూ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేశారు. జేసీ నివాసం నుంచి పారంభమైన ఈ నిరసన ప్రదర్శనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. సీబీ రోడ్డు మీదుగా టౌన పోలీ్‌సస్టేషన సర్కిల్‌కు వరకూ నిర్వహించిన ర్యాలీలో ‘సేవ్‌ తాడిపత్రి, తాడిపత్రిని మీరే కాపాడుకోవాలి’ అని జేసీపీఆర్‌ ప్రజలకు దండంపెడుతూ కనిపించారు. సర్కిల్‌లో ఉన్న గాంధీజీ విగ్రహానికి కౌన్సిలర్లు, మహిళలు పూలమాలలు వేసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అందరితో కలిసి పట్టణ పోలీస్‌స్టేషన ఎదుట జేసీ ప్రభాకర్‌ రెడ్డి బైఠాయించారు. దీంతో అరగంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. డీఎస్పీ చైతన్య, పట్టణ, రూరల్‌ సీఐలు ఆనంద్‌రావు, చిన్నపెద్దయ్య, ఎస్‌ఐలు ధరణీబాబు, గౌస్‌మహమ్మద్‌ అక్కడికి చేరుకుని.. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసుశాఖ నిర్లక్ష్యంవల్లే దాడులు జరుగుతున్నాయని వారితో జేసీపీఆర్‌ అన్నారు. దాడులకు ఎమ్మెల్యే, డీఎస్పీ కారణమని ఆరోపించారు. దీంతో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని భావించిన పోలీసులు.. జేసీపీఆర్‌ను, అనుచరులను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు.


వైసీపీ కార్యకర్తలా డీఎస్పీ: జేసీపీఆర్‌

డీఎస్పీ చైతన్య వైసీపీ కార్యకర్తలా చురుకుగా పనిచేస్తున్నారని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దారెడ్డి కూడా పార్టీ కోసం అంతగా పాకులాడడం లేదని, డీఎస్పీ మాత్రం పార్టీ తనదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. టీడీపీ కౌన్సిలర్లపై జరుగుతున్న దాడులకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ చైతన్యలే కారణమని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పెద్దారెడ్డికి పార్టీ టికెట్‌ రాదని, పార్టీకోసం పనిచేస్తున్న డీఎస్పీకి భవిష్యత్తులో ప్రమోషన్లు ఉండవని అన్నారు. తాము వేసిన కేసుల ప్రభావం డీఎస్పీకి తర్వాత తెలుస్తుందని అన్నారు. ఎమ్మెల్యేకు డీఎస్పీ హీరోలా కనిపిస్తున్నారేమో.. తనకు మాత్రం జీరోనే అని అన్నారు. ఇలా కొట్టుకుంటూపోతే ఎదురుతిరగక తప్పదని, కానీ తాడిపత్రి నాశనం అవుతుందని సైలెంట్‌గా ఉన్నామని అన్నారు. తనను, తన పదవిని మరో రెండేళ్లు ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. తనకు 70 ఏళ్లని, ఒకవేళ చంపితే చంపుతారని, దానికి భయపడే గుండె తనది కాదని అన్నారు. రాయలసీమ నాయకుల ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయో భవిష్యత్తులో తెలుస్తుందని హెచ్చరించారు. తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ, అలజడి సృష్టించేందుకు ఎమ్మెల్యే, డీఎస్పీ ప్రయత్నిస్తున్నారని, తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు వాటిని అడ్డుకుంటానని అన్నారు. గతంలో జరిగిన దాడులపై డీఎస్పీ సకాలంలో స్పందించి, కఠిన చర్యలు తీసుకుని ఉంటే, ప్రస్తుతం ఈ దాడులు జరిగేవి కావని అన్నారు. 


ఆ కాసేపు హై టెన్షన

మౌన ప్రదర్శన అనంతరం జేసీ ప్రభాకర్‌ రెడ్డి తన నివాసంలో అనుచరులతో సమావేశ మయ్యారు. ఆ సమయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన ఇంటికి ఎదురుగా కాస్త దూరంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే నివాసంవైపు నడుచు కుంటూ వెళ్లారు. ఈ రెండిళ్లకు మధ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం మాత్రమే అడ్డుగా ఉంది. మైదానం నుంచి పెద్దారెడ్డి నివాసం వైపు జేసీపీఆర్‌ వెళ్లడం, ఆయనను నాయకులు, కార్యకర్తలు అనుసరించడంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన నెలకొంది. 2020 డిసెంబరులో జరిగిన హింసాత్మక ఘటలను గుర్తు చేసుకుని, స్థానికులు భయాందోళన చెందారు. అయితే, కాస్త దూరం వెళ్లిన తర్వాత అనుచరులను జేసీపీఆర్‌ వెనక్కు పంపించారు. కొద్దిమందితో కలిసి ఎమ్మెల్యే నివాసానికి సమీపంలో ఉన్న, వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడ్డ 30వ వార్డు కౌన్సిలర్‌ మల్లికార్జున ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో కౌన్సిలర్‌పై దాడి

బైక్‌లో వెళుతుండగా  వెంటాడి..

తాడిపత్రి పట్టణంలోని పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద టీడీపీకి చెందిన 33వ వార్డు దళిత కౌన్సిలర్‌ విజయ్‌ కుమార్‌పై వైసీపీ వర్గీయులు మంగళవారం దాడి చేశారు. 30వ వార్డు దళిత కౌన్సిలర్‌ మల్లికార్జున, ఆయన కుటుంబ సభ్యులపై దాడి జరిగి 24 గంటలు గడవకనే మరో దళిత కౌన్సిలర్‌పై దాడి చేయడం గమనార్హం. పోలీసులు తెలిపిన మేరకు, పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులను కలిసిన అనంతరం బైక్‌పై కౌన్సిలర్‌ విజయ్‌కుమార్‌ ఇంటికి వెళుతుండగా నలుగురు వైసీపీ వర్గీయులు కట్టెలు, మారణాయుధాలతో బైక్‌లపై వెంబడించారు. వారి నుంచి తప్పించుకునేందుకు కౌన్సిలర్‌ ప్రయత్నించారు. కానీ యాక్సిస్‌ బ్యాంక్‌ వద్ద అడ్డుకొని, విజయ్‌ కుమార్‌ చితకబాదారు. గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనపై దాడికి వైసీపీ వర్గీయులే కారణమని కౌన్సిలర్‌ విజయ్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్‌ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ దాడుల వెనుక డీఎస్పీ హస్తం ఉందని ఆరోపించారు. డీజీపీ, ఎస్పీని కలిసి స్వయంగా తాడిపత్రి పరిస్థితులను వివరిస్తానని అన్నారు. తాడిపత్రిలో టీడీపీ వర్గీయులపై జరుగుతున్న వరుస దాడులపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు స్పందించారు. దళిత కౌన్సిలర్లే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, వరుస దాడులకు వైసీపీ అల్లరిమూకలే కారణమని వారు మండిపడ్డారు. ఈ దాడుల వెనుక డీఎస్పీ చైతన్య హస్తం ఉందని వారు ఆరోపించారు.

డీఎస్పీ చైతన్యను సస్పెండ్‌ చేయాలి

రాజకీయ దాడులకు ఆయనే ఆద్యుడు

టీడీపీ జిల్లా కో-ఆర్డినేటర్‌ బీటీ నాయుడు

అనంతపురం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): తాడిపత్రిలో టీడీపీ దళితుల నాయకులే లక్ష్యంగా అధికార వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా కో-ఆర్డినేటర్‌ బీటీ నాయుడు మండిపడ్డారు. ఈ తరహా రాజకీయ దాడులకు స్థానిక డీఎస్పీ చైతన్యనే ఆద్యుడని ఆయన ఆరోపించారు. డీఎస్పీ చైతన్యను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తాడిపత్రిలో టీడీపీ దళిత కౌన్సిలర్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసుల సహకారంతో అధికార వైసీపీ గూండాలు చెలరేగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ చైతన్య ప్రోద్బలంతోనే అధికార పార్టీ గూండాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆ క్రమంలోనే తమ పార్టీ కౌన్సిలర్లపై వరుస దాడులకు తెగబడుతున్నారని అన్నారు. డీఎస్పీ చైతన్య అధికార పార్టీకి వంతపాడుతున్నారని, తమ పార్టీ కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కౌన్సెలింగ్‌ పేరుతో తమ పార్టీ నాయకులను స్టేషనకు పిలిపించి చితకబాదుతున్నారని అన్నారు. కౌన్సిలర్‌ మల్లికార్జున, అతని కుటుంబ సభ్యులపై వైసీపీ గూండాలు దాడిచేసిన మరుసటి రోజే మరో కౌన్సిలర్‌ విజయ్‌పై దాడిచేశారని, తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణించాయనేందుకు ఇంతకంటే నిదర్శనం లేదని అన్నారు. తాడిపత్రిలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై దాడులు చేసి, భయకంపితులను చేయాలనే దుర్మార్గమైన ఆలోచనలకు వైసీపీ నాయకులు పూనుకోవడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఇలాంటివాటికి భయపడే ప్రసక్తే లేదని అన్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, తమ పార్టీ కౌన్సిలర్లపై దాడులకు తెగబడిన వైసీపీ గూండాలను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Read more