రాజరాజేశ్వరిగా అమ్మవారి అభయం

ABN , First Publish Date - 2022-10-02T05:03:10+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆరోరోజు శనివారం జిల్లావ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి.

రాజరాజేశ్వరిగా అమ్మవారి అభయం
హిందూపురంలో రాజరాజేశ్వరీమాత అలంకరణ

హిందూపురం అర్బన, అక్టోబరు 1: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆరోరోజు శనివారం జిల్లావ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు ద ర్శనమిచ్చారు. హిందూపురంలోని పులమితి రోడ్డు రాజరాజేశ్వరీ ఆలయంలో అమ్మవారు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బోయకొండ గంగమ్మ ఆలయంలో లక్ష్మీ వెంకటేశ్వరస్వామిగా, జలదుర్గమ్మ ఆ లయంలో ద్రాక్ష, గోడంబిలతో స్కందమాతగా, నింకంపల్లి రోడ్డు యల్ల మ్మ ఆలయంలో ద్రాక్ష, గోడంబి, బాదామిలతో అన్నపూర్ణేశ్వరిగా, కొల్హాపురమ్మ ఆలయంలో హంసవేణిగా, వాసవీమాత శంకరీదేవిగా భక్తులకు కనువిందు చేశారు. అనంతరం పలు ఆలయాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.


లేపాక్షి: స్థానిక దుర్గావీరభద్రస్వామి ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఏడో రోజు ఆదివారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమివ్వనున్నట్లు అర్చకులు తెలిపారు. 


రొద్దం: మండలకేంద్రంలోని రుద్రపాదాశ్రమం, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, ఆర్‌ మరువపల్లిలోని కోన మల్లేశ్వరస్వామి, రేణుకా యల్లమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. రేణుకా యల్లమ్మ దేవాలయంలో శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. 


మడకశిర రూరల్‌: మండలంలోని జమ్మానిపల్లి నిడిమామిడమ్మదేవి, నీలకంఠాపురంలో పార్వతిదేవి, మెళవాయిలో చౌడేశ్వరీదేవి, కల్లుమర్రిలో వీరకేతమ్మదేవి, ఆమిదాలగొందిలో కనుమ మారెమ్మ దేవతలకు విశేష అలంకరణ చేశారు.  


సోమందేపల్లి: స్థానిక పాతవూరు చౌడేశ్వరీ ఆలయంలో చౌడమాంబదేవిని సరస్వతీ దేవి అలంకరణలో, వాసవీ కన్యకాపరమేశ్వరీ, పె ద్దమ్మ గుడి, అంబా భవానీ ఆలయాల్లో ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


పెనుకొండ: పట్టణంలోని లక్ష్మీ వెంకటరమణస్వామి ఆలయంలో స్వామివారికి గరుడ వాహన అలంకరణ, వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆ లయంలో నవధాన్యాల అలంకరణలో, కాళీమాత ఆలయంలో దుర్గాదే వి అలంకరణలో దర్శనమిచ్చారు. స్థానిక కాళీకా అమ్మవారి ఆలయంలో విశ్వహిందూపరిషత ఆధ్వర్యంలో దుర్గాష్టమి పూజలను ఘనంగా నిర్వహించారు. మహిళలు లలితా సహస్రనామ గోత్ర పూజలు నిర్వహించారు. వీహెచపీ ప్రకంఠ అధ్యక్షులు వేదవ్యాస్‌, సభ్యులు పాల్గొన్నారు. 


రొళ్ల: మండలంలోని చారిత్రాత్మక రత్నగిరి గ్రామంలో వెలిసిన కొల్లాపురమ్మ అమ్మవారికి వేప ఆకులతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకొన్నారు.

 

గోరంట్ల: పట్టణంలోని వాసవీమాతను మహాలక్ష్మీగా చౌడేశ్వరీదేవిని వారాహిగా, మల్లాలమ్మను లక్ష్మీదేవిగా, గుమ్మయ్యగారిపల్లి మారెమ్మ దే వతను రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి, అన్నదానం చేశారు.


Read more