తప్పంతా అధికారులదే!

ABN , First Publish Date - 2022-09-24T05:30:00+05:30 IST

నెపమంతా అధికారులపైనే! ప్రొటోకాల్‌ పాటించలేదని, సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం. ఇది శనివారం జరిగిన జడ్పీ సాధారణ సమావేశం జరిగిన తీరు. ముఖ్యంగా అనంత జిల్లా వ్యవసాయధికారి జిల్లాకు

తప్పంతా అధికారులదే!
మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి


జడ్పీ సమావేశంలో గళమెత్తిన సభ్యులు

జిల్లా వ్యవసాయాధికారిపై ధ్వజం

డీఎంహెచఓ తీరుపైనా ఆగ్రహం

స్కూళ్లలో ప్రొటోకాల్‌పై రచ్చ

జగనన్న గోరుముద్ద నాణ్యతపై పెదవి విరుపు

ఐసీడీఎస్‌ పోస్టులపై మాటల తూటాలు

 వాడీవేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం


అనంతపురం విద్య, సెప్టెంబరు 24: 

నెపమంతా అధికారులపైనే! ప్రొటోకాల్‌ పాటించలేదని, సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం. ఇది శనివారం జరిగిన జడ్పీ సాధారణ సమావేశం జరిగిన తీరు. ముఖ్యంగా అనంత జిల్లా వ్యవసాయధికారి జిల్లాకు పనికిరారంటూ పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. అంగన్వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలపై అధికా ర పార్టీ ప్రజాప్రతినిధుల మధ్యే మాటల తూటాలు పేలాయి. సుమారు నాలుగున్నర గంటలు పాటు జరిగిన సభ వాడివేడిగా సాగింది.

సమస్యల ఏకరవు...

ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ సర్వసభ్య సూవేశం శనివారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్ష తన సమావేశం నిర్వహించారు. విద్యా,వైద్య, వ్యవసాయ, ఐసీడీఎస్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలపై చర్చించారు. డీఈఓ శామ్యూల్‌ విద్యారంగ ప్రగతిని వివరించగా...సభ్యులు అనేక సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. బుక్క రాయసముద్రం, గోరంట్ల, వజ్రకరూరు, రొద్దం, ఓడీసీ, అగళి జడ్పీటీసీలు మాట్లాడుతూ...స్కూళ్లలో కోట్ల రూపాయలతో నాడు-నేడు పనులు జరుగుతున్నా తమను ఆహ్వానించడం లేదన్నారు. ప్రొటోకాల్‌ను  పాటించడం లేదన్నారు. జగనన్న గోరుముద్దలో నాణ్యత లోపించింద న్నారు. మంత్రి ఉషశ్రీ మాట్లాడుతూ రెండు జిల్లాల్లో ప్రొటోకాల్‌ పాటించేలా చూడాలని, సభ్యులకు ఆహ్వానాలు అందేలా ఆదేశాలివ్వాలంటూ కలెక్టర్లను, డీఈఓను ఆదేశించారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ ఇప్పటికే ప్రొటోకాల్‌ సమస్యపై ఆదేశాలిచ్చామని, మరోసారి కూడా చెబుతామన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో సైతం అన్నంలో పురుగులు వస్తున్నా యని, తాగునీరు కూడా సరిగా లేవన్నారు. నాణ్యమైన భోజనం పిల్లలకు అందించాలన్న సీఎం సంకల్పానికి తూట్లు పొడిస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు. కంబదూరు జడ్పీటీసీ మాట్లాడుతూ... స్కూళ్లలో  విద్యాహక్కు చట్టం అమలు నీరుగారుతోందని, 25 శాతం ఫ్రీ సీట్లు అన్నది ఎక్కడా అమలుకావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్‌ చైర్‌పర్సన్‌ నాగరత్నమ్మ మాట్లాడుతూ ఇటీవల ఓ స్కూల్‌లో విద్యార్థులు ఈవ్‌ టీజింగ్‌ సమస్యను ఎదుర్కొన్నారంటూ సభ దృష్టికి తీసుకురాగా, మంత్రి వెంటనే ఆ సమస్యను సీడబ్ల్యూసీ, జువైనల్‌ జస్టిస్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని, అక్కడ ఎలాంటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంత కుమార్‌ మాట్లాడుతూ విజిట్‌కు వెళ్లినప్పుడు స్కూళ్లలో తాను కూడా  గోరుముద్ద తింటున్నానన్నారు. కేజీబీవీల్లో చాలా బాగుందన్నారు. అయితే ప్రభుత్వం నుంచి బియ్యం సరిగా రావడం లేదని, దీనిపై ఒక కమిటీ కూడా వేశానన్నారు. తర్వాత  వైద్యశాఖ సమీక్ష సందర్భంగా ఓడీసీ,  లేపాక్షి, అగళి, గుడిబండ , శెట్టూరు జడ్పీటీసీలు పీహెచ్‌సీలలో డాక్టర్ల కొతర, విధుల్లో నిర్లక్ష్యంపై  సమస్యలు లేవనెత్తారు. 10 లేదా 15 రోజుల్లో వస్తాయని, బడ్జెట్‌ లేదంటూ డీఎంహెచ్‌ఓ సమాధానం ఇవ్వగా...అనంతపురం ఎమ్మెల్యే ఫైర్‌ అయ్యారు. మీరు ఆస్పత్రి రోగుల విషయంలో బడ్జెట్‌  లేదని ఎలా చెబుతారని, అవసరమైతే కలెక్టర్‌ నుంచి పొందాంటూ మండిపడ్డారు. 

అధికారులపై గరం.. గరం...

తర్వాత జరిగిన వ్యవసాయ సమీక్షలో ముదిగుబ్బ, బెళుగుప్ప ఎంపీపీలు పంటల బీమా రాక వందలాది మంది రైతులు నష్టపోయారన్నారు. బెళుగుప్ప మండ లంలో 1050 రైతుల ఖాతాలు తప్పు పడ్డాయన్నారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విజిట్‌ చేయడంలేదన్నారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ సమస్యలు చెబుతామంటే మీరు ఫోన్లు కూడా ఎత్తరని ఫిర్యాదుల వస్తున్నాయన్నారు. మీరు ఈ జిల్లాకు పనిరారంటూ జిల్లా వ్యవసాయాధికారిపై ఫైర్‌ అయ్యారు. ఎంపీ మాధవ్‌ మాట్లాడుతూ మడకశిర, హిందూపురం, కదిరి ప్రాంతాల్లో పట్టు రైతులు, చేనేతలు అధికంగా ఉన్నారన్నారు. రైతుల కు ఇన్‌టెన్సివ్‌లు అందజేసేలా చూడాలన్నారు. గుంతకల్లు జడ్పీటీసీ, బెళుగుప్ప ఎంపీపీల మాట్లాడుతూ... వ్యవ సాయ శాఖాధికారులు మామూళ్లు ఇవ్వకుంటేనే ఎరువుల దుకాణాలపై రైడ్‌ చేస్తారని, నాణ్యమైన ఎరువులు, విత్తనాల గురించి పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు గుప్పించారు. అగ్రికల్చర్‌  జేడీ, ఆశాఖాధికారుల పై సభ్యులు ముప్పేట దాడి చేశారు. కణేకల్లు, అమడగూరు జడ్పీటీసీ లు స్థానికంగా పనిచేసే టీచర్లు, సీడీపీఓల పనితీరుపై పెదవి విరిచారు. 

ఎమ్మెల్సీ వర్సెస్‌ మంత్రి...!

అంగన్వాడీ పోస్టులను పేదలకు ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఘాటుగా విమర్శించారు. 20 ఎకరాలు, 30 ఎకరాలున్న వారికి కాకుండా భూమి లేని వారికి, పేదలకు ఇవ్వాలంటూ కోరారు. దీంతో మంత్రి కలుగజేసుకుని నిబంధనలు పాటిస్తూనే పోస్టుల భర్తీ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఎవరికి కూడా నామినేషన్‌ పద్ధతిలో ఇవ్వడం లేదంటూ సమాధానమి చ్చారు. పేదలకు కాకుండా భూములున్నవారికి ఇస్తున్నారంటూ, తాను చూపిస్తానని ఎమ్మెల్సీ గట్టినా గళం విప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ...గైడ్‌లైన్స్‌ మేరకు జరిగేలా చూస్తామని, పారదర్శకంగా భర్తీలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత ఆర్‌డబ్ల్యూఎస్‌ సమస్యలపై చర్చించారు.

డబ్బు దొరికింది.. పార్టీ చేద్దామా! 

సభలో రూ.50 వేల కట్ట దొరకడంతో నిజాయతీగా ఓ జడ్పీటీసీ తీసుకొచ్చి జడ్పీ చైర్‌పర్సన్‌కు ఇచ్చారు. సభ్యులంతా ఏడాది పూర్తి చేసుకున్నారు. దీంతో పార్టీ చేద్దామా అంటూ నవ్వడంతో.. సభ్యులు సైతం...నవ్వారు. తర్వాత కాసేపటికి డబ్బు పోగొట్టుకున్న కంబదూరు జడ్పీటీసీ నాగరాజు రావడంతో ఆయనకు ఇచ్చేశారు. సభలో అగళి జడ్పీటీసీ, రొళ్ల ఎంపీపీలు, ఇతర జిల్లా సరిహద్దు సభ్యులతో మంత్రి కన్నడలో మాట్లాడుతూ సందడి చేశారు. సమావేశం పూర్తయిన తర్వాత పాలకవర్గం ఏర్పడి ఏడాది పూర్తికావడంతో జడ్పీ చైర్‌పర్సన్‌, ఇతర సభ్యులు, ప్రజాప్రతినిధులు నడుమ కేక్‌ కట్‌చేశారు. కార్యక్రమంలో జేసీ కేతన్‌గార్డ్‌, పలువురు చైర్‌పర్సన్లు, చైర్మన్లు, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు

 సెల్వరాజనతప్పంతా అధికారులదే! జడ్పీ సమావేశంలో గళమెత్తిన సభ్యులు జిల్లా వ్యవసాయాధికారిపై ధ్వజం డీఎంహెచఓ తీరుపైనా ఆగ్రహం స్కూళ్లలో ప్రొటోకాల్‌పై రచ్చ జగనన్న గోరుముద్ద నాణ్యతపై పెదవి విరుపు ఐసీడీఎస్‌ పోస్టులపై మాటల తూటాలు

Read more