-
-
Home » Andhra Pradesh » Ananthapuram » A buzz of traditions-MRGS-AndhraPradesh
-
సంప్రదాయాల సందడి
ABN , First Publish Date - 2022-10-01T05:22:09+05:30 IST
తెలుగింటి సంబరాల సమాహారం దసరా. పండుగ అంటే దేవీ నవరాత్రులు... అమ్మవారి అలంకరణలు మాత్రమే కాదు. చూడచక్కని బొమ్మలు.

బొమ్మలకొలువు ఏర్పాటు చేస్తున్న మహిళలు
ఆకట్టుకునేలా బొమ్మల కూర్పు
అనంతపురం కల్చరల్ : తెలుగింటి సంబరాల సమాహారం దసరా. పండుగ అంటే దేవీ నవరాత్రులు... అమ్మవారి అలంకరణలు మాత్రమే కాదు. చూడచక్కని బొమ్మలు. ఆ సందర్భంగా జరిగే పేరంటాలు కూడా. దసరా నవరాత్రుల్లో చల్లని సాయంత్రాన బొమ్మల కొలువులకు వెళ్లడం మహిళలకు ప్రత్యేక అనుభూతి. బొమ్మల కొలువు అంటే చిన్న, పెద్ద అందరికీ పండుగే. రంగురంగుల బొమ్మలను చూడటం పిల్లలకు ఎనలేని ఆనందాన్ని ఇస్తే వాటిని ఓ క్రమపద్ధతిలో అందంగా అమర్చడం పెద్దవాళ్లకూ అంతు లేని ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే ఈ వేడుకలో ఇంటిల్లిపాది భాగస్వాములే. కొత్తగా వచ్చిన అపార్ట్మెంట్ కల్చర్లోనూ ఇవి సామాజిక వేడుకల్లా మారాయి.
అనంతలో మూడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న మల్లిక జిల్లాలోని పలు ప్రాంతాల్లో బొమ్మల కొలువులను ఏర్పాటు చేసి నవరాత్రులను శోభాయమానంగా జరుపుకుంటున్నారు. ఈ కోవకు చెందినవారే కెనరాబ్యాంకు విశ్రాంత ఉద్యోగి కమలాకర్, మల్లిక దంపతులు. దాదాపు మూడు దశాబ్దాలుగా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ 40వేలకు పైగా బొమ్మలను సేకరించారు. గత 31 సంవత్సరాలుగా ఆర్కే నగర్లోని తమ నివాసంలో ప్రతిఏటా దసరా నవరాత్రుల్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేయడంతో పాటు బొమ్మల కొలువును తిలకించేందుకు ప్రజలను ఆహ్వానిస్తూ సంప్రదాయాన్ని అందరితో పంచుకుంటున్నారు. ఈ ఏడాది వీరి కుమారుడు నీలమేఘశ్యామ్, తేజశ్వినిలు బొమ్మల కొలువు ఏర్పాటు సంప్రదాయాన్ని భుజాన వేసుకున్నారు.