108 కష్టాలు

ABN , First Publish Date - 2022-09-26T05:40:13+05:30 IST

సీఎం జగన 108 వాహనాలు గురించి గొప్పలు చెబుతుంటారు. అయితే ఆ వాహనాలు ఎంత దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నాయో జిల్లాలో చూస్తే తెలుస్తోంది.

108 కష్టాలు
- ఈ ఫొటోలో కనిపిస్తున్న 108 వాహనం వారం క్రితం చికిత్స కోసం రోగిని జిల్లా ఆస్పత్రికి తీసుకొస్తూ ఆస్పత్రి ప్రధాన గేటు దాటగానే రాడ్‌ ఊడిపోయింది. దీంతో అక్కడే నిలిచిపోయింది. రోగిని ఆస్పత్రిలోకి చేర్చేందుకు కుటుంబ సభ్యులు అవస్థలు వర్ణనాతీతం.

ఎక్కడికక్కడ ఆగిపోతున్న వాహనాలు

కనీసం లైట్లు లేకుండా రోగుల తరలింపు

మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యం

రోగుల ప్రాణాలతో ఏజెన్సీ చెలగాటం
అనంతపురం టౌన సెప్టెంబరు 25:  సీఎం జగన 108 వాహనాలు గురించి గొప్పలు చెబుతుంటారు. అయితే ఆ వాహనాలు ఎంత దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నాయో జిల్లాలో చూస్తే తెలుస్తోంది. అన్ని ప్రాంతాలకు అత్యవసర వైద్యసేవలు అందేలా చూసేందుకు ప్రతి మండలానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంత జిల్లాలో 63 మండలాలకు 63 వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ వాహనాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించారు. గతంలో జీవీకే సంస్థ నిర్వహించేది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార పార్టీకి చెందిన కీలక నేత బంధువు అరబిందో సంస్థకు అప్పగించారు. అయితే వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 80శాతం వాహనాలు చాలా దెబ్బతిన్నట్లు సిబ్బందే బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ వాహనాలు గమ్యం చేరుతాయా, లేదా అన్న భయంతోనే సిబ్బంది నెట్టుకొస్తున్నారు. అనేక వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో సీరియస్‌ కేసులు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రాణాలు కూడా కోల్పోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


మరమ్మతులు అంతా మాయ...

 రాత్రి సమయాల్లో అత్యవసర కేసులను ఈ వాహనాల్లో ఆస్పత్రులకు తరలిస్తుంటారు. గతంలో ప్రమాద బాధితులు, గర్భిణులు మాత్రమే తీసుకొచ్చే వారు. ఇప్పుడు ఎలాంటి అనారోగ్యానికి గురై పరిస్థితి సీరియ్‌సగా ఉంటే అలాంటి వారిని కూడా తరలిస్తుంటారు. అలాంటప్పుడు వాహనాలు ఎంతో ఫిట్‌నె్‌సగా ఉండాలి. కానీ జిల్లాలో ఈ వాహనాలు పరిస్థితి ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న భయం వెంటాడుతోంది. మరమ్మతులు చేయాల్సిన ఏజెన్సీ నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాప్తాడు సమీపంలో ఈ వాహనాల మరమ్మతు కోసం ప్రత్యేక షెడ్‌ ఉన్నా రిపేరు చేయడం లేదని ఒక వేళ చేసినా తూతూమంత్రంగా చేసి పంపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 10వేల కిలోమీటర్లకు ఆయిల్‌ చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ 40 నుంచి 50వేలు కిలోమీటర్లు తిరిగినా ఆయిల్‌ చేంజ్‌ చేయడం లేదని విమర్శలున్నాయి. ఏవైన పరికరాలు పోయినా పట్టించుకోవడం లేదని షెడ్‌లో ఉన్నా వేయడం లేదని కానీ అన్నీ మరమ్మతులు చేసినట్లు చూపి సొమ్ము చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అనేక వాహనాలకు లైట్లు కూడా పనిచేయడం లేదు. రాత్రి సమయాల్లో రోగులను తీసుకొచ్చేటప్పుడు లోపల సెల్‌ లైట్స్‌ వేసుకొని తీసుకొస్తున్నారని చెబుతున్నారు. 


చిన్నచిన్న సమస్యలు వస్తుంటాయి...:  సుబ్రహ్మణ్యం, 108 జిల్లా కోఆర్డినేటర్‌

వాహనాలకు చిన్నచిన్న సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే మరమ్మతులు చేయిస్తుంటాం. కానీ వాహనాలు కదా ఏదో సమస్యతో ఆగిపోతుంటాయి. అంతేగాని వాహనాలు దెబ్బతిన్నాయని కాదు మంచిగానే జిల్లాలో నడుపుతూ సేవలందిస్తున్నాం.Read more