ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌కు రంగం సిద్ధం!

ABN , First Publish Date - 2022-05-22T15:30:42+05:30 IST

నేక ఉద్రిక్తల మధ్య వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది.

ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌కు రంగం సిద్ధం!

కాకినాడ: అనేక ఉద్రిక్తతల మధ్య వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. పెదపూడి మండలం జి.మామిడాడలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. శరీరంపై గాయాలుండడంతో పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కొట్టి చంపినట్టు తేలిందని సమాచారం. మృతుడి భార్యకు ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ కేసులో  ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా చేర్చారు. నేడు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మృతుడి కుటుంబీకుల స్టేట్‌మెంట్ ఆధారంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. అనంతబాబు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సుబ్రహ్మణ్యం మృతిపై రెండురోజులుగా నెలకొన్న సందిగ్ధత వీడింది. బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నట్టుగా ఈ హత్య చేసింది అనంతబాబే అని తేలింది. ఎక్కడున్నాడో వెదికి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హత్య వెనుక ఉదయభాస్కర్‌ పాత్ర ఉందని, ఆయనే చంపేశాడని మృతుడి భార్య, తల్లిదండ్రులు ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చారు. మృతి చెందిన డ్రైవర్‌ దళిత సామాజికవర్గం కావడంతో ఎమ్మెల్సీపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో రెండురోజులుగా వాయిదాపడుతున్న పోస్టుమార్టానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 

Read more