Amaravati Padayatra: పాదయాత్రకు గోదావరి వాసుల అపూర్వ ఆదరణ

ABN , First Publish Date - 2022-09-27T02:40:26+05:30 IST

అమరావతి (Amaravati) రైతుల మహా పాదయాత్ర (Maha Padayatra) కు గోదావరి జిల్లా వాసులు నీరాజనాలు పలికారు.

Amaravati Padayatra: పాదయాత్రకు గోదావరి వాసుల అపూర్వ ఆదరణ

ఏలూరు: అమరావతి (Amaravati) రైతుల మహా పాదయాత్ర (Maha Padayatra) కు గోదావరి జిల్లా వాసులు నీరాజనాలు పలికారు. ఎదురేగి, హారతులిచ్చి, పూలవర్షం కురిపించారు. నినాదాలతో హోరెత్తించారు. అడుగడుగునా పాదయాత్రకు మద్దతు పలికారు. తెలుగుదేశంతో సహా మిగతా ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు సాదర సంఘీభావం తెలియజేయడమే కాకుండా అడుగులో అడుగు కలిపారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొణికి నుంచి 15వ రోజు పాదయాత్ర ఆరంభమైంది. అక్కడ నుంచి సత్యవోలు, నాయుడుగూడెం, పెదపాడు మీదుగా కొత్తూరు వరకు 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ముందుగా నిర్దేశించినట్లుగానే యాత్ర ఆరంభంలో వెంకటేశ్వరస్వామికి హారతులిచ్చి సూర్యరథానికి పూజలు చేశారు. నిర్విరామంగా యాత్ర కొనసాగిస్తూ మధ్యాహ్నం రెండు గంటలకు పెదపాడులో భోజన విరామం తీసుకుని అక్కడ నుంచి యాత్ర కొత్తూరు వరకు సాగింది. అమరావతి మద్దతుగా దారి పొడవునా మహిళలు, యువకులు, వయో వృద్ధులు సైతం పాదయాత్రకు ఎదురేగి స్వాగతం పలికారు. అమరావతి కావాలంటూ నినాదించారు. మీ వెంట మేమున్నామంటూ నడక యాత్రికులను ఉత్సాహాపరిచారు.  


యాత్ర ఆరంభంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, మాజీ ఎంపీ మాగంటి బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, రాజమహేంద్రవరం టీడీపీ జిల్లా అధ్యక్షులు జవహర్‌లు పాద యాత్రికులతో కలిసి నడిచారు. వీరి రాకతో మిగతా వారంతా ఇనుమడించిన ఉత్సాహంతో నినాదాలు చేశారు. యాత్రకు ముందుగా వివిధ పార్టీల ప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు ముందుకు సాగుతుండగా ఆ వెనువెంటే మహిళలు పాదయాత్రలో జై అమరావతి అని నినాదిస్తూ ముందుకు కదిలారు. కొణికి నుంచి ఆరంభమైన యాత్ర ముందుకు సాగుతుండగా కడిమికుంట గ్రామంలో మహిళలు, పిల్లలు ఎదురేగి పూలవర్షం కురిపించి, హారతులిచ్చారు. అనుకున్నది సాధిస్తారంటూ పాదయాత్రలోని మహిళలకు ధైర్యం చెప్పారు. ఒకవైపు రెట్టించిన ఉత్సాహాంతో వివిధ గ్రామాల నుంచి వచ్చినవారితో యాత్ర సాగే మార్గం జనసందోహమయ్యాయి. వలంటీర్లు ఎక్కడా యాత్రకు అవాంతరాలు ఎదురుకాకుండా సమన్వయంతో వాహనాల రాకపోకలు కొనసాగేలా జాగ్రత్తపడ్డారు. మాజీ ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ తన స్వంత నియోజకవర్గం కావడంతో పాద యాత్రికులకు చేరువగా నడక సాగించడమే కాకుండా దారి పొడవునా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చేతకాని ప్రభుత్వం పాద యాత్రికులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తారా, మంత్రులు ఇష్టానుసారం మాట్లడటమేమిటి, జనమంతా అమరావతి కావాలనుకుంటే మీ వితండవాదమేంటి, యాత్రికులపై ఇష్టానుసారం మాట్లాడతారా ? అంటూ ప్రభుత్వ తీరుపై ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆరు నూరైనా రాష్ట్ర రాజధాని అమరావతేనంటూ నినాదించారు. 

Updated Date - 2022-09-27T02:40:26+05:30 IST