అమరావతికి జనం జేజేలు

ABN , First Publish Date - 2022-10-04T07:11:54+05:30 IST

నవ్యాంధ్ర ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజూ అపూర్వ స్పందన కనిపించింది. సోమవారం సుమారు 30...

అమరావతికి జనం జేజేలు

తూర్పులో రెండో రోజు కదంతొక్కిన 30 వేల మంది 

దూబచర్ల నుంచి ప్రకాశరావుపాలెంకు నడక

22వ రోజు 15 కిలోమీటర్లు సాగిన యాత్ర

పసుపు నీళ్లతో రోడ్డు శుద్ధి చేస్తూ ముందుకు

వెంకట్రామన్నగూడెంలో రాత్రి బసరాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి)/నల్లజర్ల, గోపాలపురం, అక్టోబరు 3: నవ్యాంధ్ర ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజూ అపూర్వ స్పందన కనిపించింది. సోమవారం సుమారు 30 వేల మంది పాదయాత్రలో భాగస్వాములైనట్టు జేఏసీ సభ్యులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో ఉదయం సూర్య రథానికి హారతిచ్చి 22వ రోజు యాత్రను ప్రారంభించారు. మాజీ జడ్పీటీసీ కొఠారు అనంతలక్ష్మి, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, టీడీపీ మండలాధ్యక్షుడు తాతిన సత్యనారాయణ హారతిచ్చారు. అక్కడి నుంచి ప్రకాశరావుపాలెం శివారు రాజు గారి తోట వరకు 15 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. పసుపు నీళ్లతో రోడ్డును శుద్ధి చేస్తూ యాత్ర కొనసాగించారు.


వందలాది ట్రాక్టర్లు రైతు జెండాలను రెపరెపలాడిస్తు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్లజర్లలో  భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3గంటలకు తిరిగి యాత్ర ప్రారంభమై సాయత్రం 6గంటలకు ముగిసింది. రాత్రికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కమ్మ కల్యాణమండపంలో బస చేశారు. మంగళవారం ఉదయం వెంకట్రామన్నగూడెం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. జగన్‌ ఎన్ని కుట్రలు చేసినా, ప్రాంతీయ, కుల, మతాలను రెచ్చగొట్టాలని చూసినా ప్రజల మద్దతు అమరావతి రైతులకేనని, రాజధాని అమరావతే అని జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళఫూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, ఘంటా మురళీ, కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ అన్నారు. 


వైసీపీవి 3 ముక్కల భేటీలు 

రైతుల మహాపాదయాత్రకు అన్ని ప్రాంతాల నుంచి స్పందన పెరగడంతో వైసీపీ మూడు ముక్కల సమావేశాలకు తెర తీసిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. రైతుల పోరాటానికి తలవొగ్గి ప్రధాని మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారని, జగన్‌ కూడా మూడు ముక్కల విధానం మానివేయాలని హితవు పలికారు. అమరావతిపై జగన్‌ కక్ష కట్టి 3 ముక్కల బాగోతం ఆడిస్తున్నాడని కేఎస్‌ జవహర్‌ విమర్శించారు.ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదని పీతల సుజాత హెచ్చరించారు. అమరావతిని రాజధాని కాకుండా చేయాలని చూస్తే జగన్‌ తన తలకు తానే కొరివి పెట్టుకున్నట్లని చింతమనేని ప్రభాకర్‌ పేర్కొన్నారు.

 

ప్రభుత్వానికి అంతిమయాత్ర: జేఏసీ 

జగన్‌ ప్రభుత్వానికి అంతిమయాత్ర ఖాయమని అమరావతి జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి ధ్వజమెత్తారు. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో విలేకరులతో మాట్లాడుతూ కళ్లుండి చూడలేని జగన్‌ ప్రభుత్వానికి అమరావతి రైతుల పాదయాత్ర కనబడకపోవడం అత్యంత బాధాకరమన్నారు. జిల్లాకో రాజధాని అంటూ 26 రాజధానులు ఏర్పాటు చేయాలని సవాల్‌ విసిరా రు. తమ పదవులను కాపాడుకోవడం కోసమే మంత్రులు స్థాయిని మరచి విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. కెమెరాలతో ఫొటోలు తీయడం మాని అధ్వానంగా ఉన్న రహదారుల ఫొటోలు తీసి సీఎంకి పెట్టాలని పోలీసులకు సూచించారు. కాగా, మహాపాదయాత్ర విజయదశమి రోజు కూడా కొనసాగుతుందని అమరావతి జేఏసీ నాయకుడు, అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావు చెప్పారు.  


మీరు పాదయాత్ర చేస్తుంటే  మేం చూస్తూ ఊరుకోవాలా?: ధర్మాన

రాజధాని విషయం కోర్టులు నిర్ణయిస్తాయా?: బోస్‌..  కనుసైగలతో ఆపుతాం: విజయలక్ష్మి

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 3: రాష్ట్ర రాజధాని విషయంలో మంచి మోడల్‌ వస్తే మార్పులు చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. మేధావులు ఆలోచన చేయాలని కోరారు. వికేంద్రీకరణకు మద్దతుగా సోమవారం రాజమహేంద్రవరంలో రౌండుటేబుల్‌ సమావేశం నిర్వహించారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ‘అసలు రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఎందుకు? 200 నుంచి 300 ఎకరాల భూమి ఉంటే సరిపోతుంది. అమరావతి కోసం ఆ ప్రాంతం వాళ్లు పాదయాత్ర చేస్తుంటే విశాఖ వాళ్లు చూస్తూ ఊరుకోవాలా? మేం అమాయకులమా? శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ప్రకారమే ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. చంద్రబాబు ఈ కమిటీని పూర్తిగా వదిలేశారు. క్యాపిటల్‌కు సంబంధించి ప్రస్తుతం ఏ చట్టమూ అమల్లోలేదు’ అన్నారు. మరో మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ ‘పాదయాత్రలో రైతుల ముసుగులో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోంది. కవ్వింపు చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.


దసరా రోజున రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టి ఆశీస్సులు ఇవ్వాలని దేవుళ్లను కోరతాం’ అన్నారు. ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ రాజధాని ఎక్కడ కట్టుకోవాలో కోర్టులు నిర్ణయిస్తాయా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ‘రైతులు అరసవెల్లి వచ్చి ఏం చెబుతారు? మేం బాగుండాలి. మిగిలిన వారంతా నాశనమైపోవాలి అని కోరతారా?’ అన్నారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ‘పాదయాత్రలో కొంతమంది మహిళలు తొడలు కొడుతున్నారు. రాజమహేంద్రవరం రండి కనుసైగలతో మిమ్మల్ని ఆపుతాం. తిరుగుబాటు చేస్తే మీరు కనిపించరు’ అని అన్నారు.

Read more