మహాత్ముడి బాటలో నడుస్తాం!

ABN , First Publish Date - 2022-10-03T09:34:50+05:30 IST

‘‘ఆంధ్రులంతా ఒక్కటే.. రాజధాని అమరావతి ఒక్కటే.. ఇది దండయాత్ర కాదు.. ప్రజాస్వామ్య యాత్ర.. గాంధీజీ బాటలో నడుస్తాం... అమరావతిని సాధిస్తాం’’ అని నినదిస్తూ అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగింది. ఏలూరు జిల్లా ద్వారకా..

మహాత్ముడి బాటలో నడుస్తాం!

అహింసే ఆయుధంగా అమరావతిని సాధిస్తాం 

ఇది దండయాత్ర కాదు.. ప్రజాస్వామ్య యాత్ర 

తూర్పుగోదావరి జిల్లాలోకి పాదయాత్ర 

ద్వారకా తిరుమల నుంచి దూబచర్ల వరకూ నడక 

21వ రోజు 15 కి.మీ నడిచిన అమరావతి రైతులు 


రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి)/నల్లజర్ల/ద్వారకా తిరుమల, అక్టోబరు 2: ‘‘ఆంధ్రులంతా ఒక్కటే.. రాజధాని అమరావతి ఒక్కటే.. ఇది దండయాత్ర కాదు.. ప్రజాస్వామ్య యాత్ర.. గాంధీజీ బాటలో నడుస్తాం... అమరావతిని సాధిస్తాం’’ అని నినదిస్తూ అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న సన్నిధిలో శనివారం సేదతీరిన రైతులు ఆదివారం ఉదయం 8.30 గంటలకు రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్రను ప్రారంభించారు. 21వ రోజు ద్వారకా తిరుమల, రాళ్లకుంట, తూర్పుగోదావరి జిల్లా అయ్యవరం, కొత్తగూడెం మీదుగా దూబచర్లకు దాదాపు 15 కి.మీ. మేర యాత్ర సాగింది. టీడీపీ నేతలు మాగంటి బాబు, జవహర్‌, తదితరులు రైతులతో కలసి నడిచారు. జనసేన, భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేతలు సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు ద్వారకా తిరుమల కొండ పైకి వెళ్తున్న రైతులను అడ్డుకోవడంతో జేఏసీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసు చర్యలను నిరసిస్తూ నేతలు రోడ్డుపై బైఠాయించడంతో గందరగోళం నెలకొంది.


పరిస్థితి చేజారుతుండటంతో సీఐ వెంకటేశ్వరరావు రైతులను కొండ పైకి అనుమతించారు. ద్వారకాతిరుమల నుంచి బయలుదేరిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆయ్యవరం గ్రామంలోకి ప్రవేశించింది. అయ్యవరం కొత్తగూడెం వద్ద భోజనాలు చేసిన అనంతరం నడక సాగించి సాయంత్రం 6గంటలకు దూబచర్లకు చేరింది. అక్కడ ఉన్న దత్తసాయి మందిరంలో రాత్రి బస ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి హారతులిచ్చి పాదయాత్ర చేస్తున్న వారిపై పూలవర్షం కురిపించారు. 


పాదయాత్రను ఆపగలరా?: ముళ్లపూడి 

అమరావతి రాజధాని కోసం ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రను జగన్‌రెడ్డి ఆపగలరా అని టీడీపీ సీనియర్‌ నేత ముళ్లపూడి బాపిరాజు సవాల్‌ విసిరారు. ఇంతవరకూ 99 తప్పులు చేసిన జగన్‌ హెల్త్‌వర్సిటీ పేరు మార్చి 100వ తప్పు చేశాడని, ఇక ఆయన పని అయిపోయిందని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఘంటా మురళి మాట్లాడుతూ జగన్‌ పాలనతో జనం విసిగిపోయారని, త్వరలో సరైన తీర్పు ఇచ్చి, ఆయనకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 


నవంబరు 25కు అరసవల్లి: తిరుపతిరావు 

పాదయాత్రలో భాగంగా జగన్‌ మోసాలు, అబద్ధాలు ప్రజలకు తెలియజేస్తున్నామని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు అన్నారు. పోలవరం, సీపీఎస్‌, రైల్వే జోన్‌, స్టీల్‌ ప్లాంట్‌, బందర్‌పోర్డు వ్యవహారాల్లో జగన్‌ చేసిన తప్పిదాలను ప్రజలకు వివరిస్తున్నట్టు చెప్పారు. కాగా, పాదయాత్రకు అడుగడుగునా వస్తున్న ఆదరణతో పాటు, వర్షాలు, రోడ్లు ఆధ్వానంగా ఉండటంతో 10- 12 రోజులు ఆలస్యంగా నవంబరు 25నాటికి అరసవల్లికి చేరుకునే అవకాశం ఉందన్నారు. మహాపాదయాత్ర ఇప్పటికి దాదాపు వంద గ్రామాల మీదుగా సుమారు 312 కిలోమీటర్లు సాగిందని జేఎసీ కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ తెలిపారు. 
మోసగించిన జగన్‌: పులి చిన్నా 

గుంటూరు జిల్లా యాదవ సంఘ నాయకుడు గుమ్మా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తామ నలుగురు అన్నదమ్ములం కలిసి 60 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చామని చెప్పారు. అక్కడ బీసీలు 25శాతం పైగా భూములు ఇచ్చారని పేర్కొన్నారు. ఎస్సీ నాయకుడు పులి చిన్నా మాట్లాడుతూ రాజధానికి తాము 20 ఎకరాలు ఇచ్చామన్నారు. జగన్‌ ఉద్దండరాయపాలెం వచ్చి చంద్రబాబు కంటే ఎక్కువ భూమి ఇస్తామని నమ్మించి, మొదటికే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more