-
-
Home » Andhra Pradesh » amaravati farmers Padayatra bbr-MRGS-AndhraPradesh
-
రెట్టించిన ఉత్సాహంతో అమరావతి రైతులు.. వడివడిగా అడుగులు
ABN , First Publish Date - 2022-10-03T01:37:09+05:30 IST
అమరావతి (Amaravati) సాధన కోసం పాదయాత్ర (Padayatra) చేస్తూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న సన్నిధిలో

ద్వారకా తిరుమల: అమరావతి (Amaravati) సాధన కోసం పాదయాత్ర (Padayatra) చేస్తూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న సన్నిధిలో ఓ రోజు సేదతీరిన అమరావతి రైతులు ఆదివారం ఉదయం రెట్టించిన ఉత్సాహంతో వడివడిగా అడుగులేశారు. జై అమరావతి అన్న ఏకైక నినాదాన్ని నరనరాల్లో నింపుకున్న సాధకులు లక్ష్యం దిశగా 21వ రోజు పాదయాత్రగా ముందుకు కదిలారు. ఉదయం 8-30 గంటలకు జేఏసీ సభ్యులు శివారెడ్డి తదితరులు గుమ్మడి కాయలను స్వామి, అమ్మవార్లు కొలువైన రధం ముందు కొట్టి పాదయాత్రను ప్రారంభించారు. అలాగే జేఏసీ మహిళా నేతలు గుమ్మడి కాయలపై కర్పూరాన్ని వెలిగించి ఆ దేవదేవుడైన చిన్న తిరుమలేశునికి వినిపించేలా అమరావతి ఏకైక రాజధానిగా ఉండేలా చూడు స్వామీ అంటూ వేడుకున్నారు. ఆ తరువాత రథం తీన్‌మార్, డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణల నడుమ అట్టహాసంగా శ్రీవారి క్షేత్రం నుంచి తూర్పుగోదావరి జిల్లా వైపు కదలింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ జెడ్‌పి చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జవహర్, మాజీ ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు. ఘంటా మురళీ రామకృష్ణ, మొడియం శ్రీనివాసరావు పాదయాత్ర రైతులకు సంఘీభావం తెలిపి, వారితో కలసి నడిచారు. జనసేన, భారతీయ కిసాన్ సంఘ్ తదితరులు సంఘీభావం చెబుతూ పాదయాత్రతో కదిలారు. 21వ రోజు ద్వారకా తిరుమల, రాళ్లకుంట, తూర్పుగోదావరి జిల్లా అయ్యవరం, కొత్తగూడెం మీదుగా దూబచర్లకు దాదాపు 14 కిమీ మేర యాత్ర సాగింది.