-
-
Home » Andhra Pradesh » amaravathi Maha Padayatra Bhimavaram bbr-MRGS-AndhraPradesh
-
Padayatra: పశ్చిమలో మహా పాదయాత్రకు అపూర్వ ఆదరణ
ABN , First Publish Date - 2022-10-05T01:28:37+05:30 IST
అమరావతి (amaravathi) రాజధాని సాధన కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర (Maha Padayatra)కు పశ్చిమగోదావరి జిల్లాలో

భీమవరం: అమరావతి (amaravathi) రాజధాని సాధన కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర (Maha Padayatra)కు పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం సాదరస్వాగతం లభించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వెంకట్రామన్నగూడెం వద్ద పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించింది. తెలుగుదేశం, జనసేన, బిజెపి, వామపక్షాలు సంఘీభావం తెలిపాయి. టిడిపి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జి, జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ల నేతృత్వంలో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు అమరావతి రైతుల పాదయాత్రకు స్వాగతం పలికారు. పాదయాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా పాదయాత్రలో పూల వర్షం కురిపించారు. పెదతాడేపల్లి వద్ద వందల మంది జనం పాదయాత్రకు ఎదురేగి వచ్చారు. మద్దతు తెలిపారు. పశ్చిమలో తొలిరోజు 16 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది.
వెంకట్రామన్నగూడెం, పెదతాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం మీదుగా పెంటపాడు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఒకవైపు పోలీసులు రక్షణ కల్పిస్తేనే మరోవైపు సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు నిఘా పెట్టారు. తాడేపల్లిగూడెం పట్టణమంతా అడుగడుగునా పోలీసులు తారసపడ్డారు. సీఆర్పీ బృందాలు తరలివచ్చాయి. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పాదయాత్ర ప్రశాంతంగా సాగింది. తెలుగుదేశం నేతలు, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ, ముళ్లపూడి బాపిరాజు, బీజేపీ నాయకులు నార్ని తాతాజీ, ఈతకోట తాతాజీ తదితరులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రూరల్ గ్రామాలు, తాడేపల్లిగూడెం పట్టణం నుంచి పెద్ద సంఖ్యలో జనం యాత్రలో పాల్గొన్నారు.