పోలీసుల అదుపులో Amalapuram అల్లర్ల కీలక నిందితుడు

ABN , First Publish Date - 2022-05-25T22:13:20+05:30 IST

అమలాపురంలో విధ్వంసం వెనుక అమలాపురానికి చెందిన అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.

పోలీసుల అదుపులో Amalapuram అల్లర్ల కీలక నిందితుడు

అమలాపురం: అమలాపురంలో విధ్వంసం వెనుక అమలాపురానికి చెందిన అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అమలాపురం స్టేషన్కు తరలించారు. విధ్వంసంపై అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సాయిపై ఇప్పటికే రౌడీషీట్ తెరిచారు. ఈ నెల 18న ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా జిల్లా పేరును అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చుతూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఒక వర్గం సంబరాలు చేసుకోగా, మరో సామాజికవర్గం ఆందోళనలకు దిగింది. కోనసీమ జిల్లాగా మాత్రమే పేరు కొనసాగించాలంటూ ఉద్యమానికి సిద్ధమైంది.


అదే సమయంలో ఈ నెల 19న తెల్లవారుజామున అయినవిల్లి మండలం శానపల్లి లంకగ్రామంలో స్థానిక ప్రజలు, కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేసి శవయాత్ర నిర్వహించడం కలకలం రేపింది. 20వ తేదీన కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ జేఏసీ నేతలు అమలాపురం (Amalapuram) కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపిస్తే 5 వేల మంది వరకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్యం సాయి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి సాయి వైసీపీ క్రియాశీల కార్యకర్త. మంత్రి విశ్వరూ్‌పకు అనుచరుడు కూడా. ఆయనకు మంత్రి పదవి వచ్చినప్పుడు అభినందనలు తెలియజేస్తూ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు.


అంబేడ్కర్‌ (Ambedkar) పేరు మార్చాలన్న ఉద్యమంలో ఇతడు కీలక పాత్ర పోషించడం వైసీపీ నేతల పాత్రపై అనుమానాలు కలిగిస్తోంది. దీనికితోడు కోనసీమ జిల్లా పేరు కొనసాగించాలంటూ ఆందోళనలు చేసేవారిని పోలీసులు 20వ తేదీ నుంచి ఎక్కడికక్కడ అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే జేఏసీ సోమవారం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. కానీ పోలీసులు 144 సెక్షన్‌ పెట్టి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన జేఏసీ.. మళ్లీ మంగళవారం కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా పేరు మార్పునకు సంబంధించిన అభ్యంతరాలతో పెద్దఎత్తున వినతిపత్రాలివ్వాలని పిలుపిచ్చింది. దీంతో పోలీసులు అమలాపురమంతటా 144 సెక్షన్‌ విధించారు. పట్టణంలో బారికేడ్లు, ఇనుపకంచెలు వేశారు. కోనసీమలోని నేతలను గృహ నిర్బంధం చేశారు. దీంతో వారి కార్యక్రమం విఫలమైందేనని పోలీసులు భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా విధ్వంసకాండ చెలరేగింది.

Updated Date - 2022-05-25T22:13:20+05:30 IST