మళ్లీ ‘గాలి’ దుమారం!

ABN , First Publish Date - 2022-08-10T07:56:32+05:30 IST

మళ్లీ ‘గాలి’ దుమారం!

మళ్లీ ‘గాలి’ దుమారం!

ఓబుళాపురంలో తవ్వకాలకు ఏపీ అంగీకారం

తమకు అభ్యంతరం లేదని సుప్రీంకు వెల్లడి

ఓఎంసీపై అక్రమాలు, అవకతవకల ఆరోపణలు

ఎప్పుడో నిర్ధారించి కేసులు పెట్టిన సీబీఐ, ఈడీ

సరిహద్దులు చెరిపేసినట్లు అభియోగాలు

మ్యాప్‌పై ఇప్పటికీ సంతకం చేయని కర్ణాటక

ఏదీ తేలకున్నా... జగన్‌ సర్కారుకు ఆరాటం

కీలక శాఖలకు తెలియకుండానే నిర్ణయం

ఉల్లంఘనలను కప్పిపెట్టడమే ఉద్దేశమా?


అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం ఇంకా తేలలేదు. అటు సరిహద్దు, ఇటు అక్రమ తవ్వకాల కేసులు అలాగే ఉన్నాయి. సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఖరారు చేసిన సరిహద్దు మ్యాపుపై కర్ణాటక సర్కారు సంతకాలు చేయలేదు. అయినా సరే... ఓబుళాపురంలో ఇనుప ఖనిజం తవ్వకాలకు ‘ఓకే’ అంటూ ఏపీ సర్కారు తన సమ్మతి తెలిపింది. ‘మాకే అభ్యంతరమూ లేదు’ అని సుప్రీం కోర్టుకు తెలిపింది. వెరసి... రాష్ట్రంలో ‘గాలి’ వ్యవహారానికి జగన్‌ సర్కారు మళ్లీ తెరలేపిందనే చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే... గనులు, అటవీ పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి విభాగాలకు తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం గాలి జనార్దన రెడ్డి కంపెనీకి అనుకూలంగా అఫిడవిట్‌ వేసినట్లు సమాచారం! ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో పైస్థాయిలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

జగన్‌ సర్కారు ‘గాలి’ దుమారానికి తెరలేపింది. గాలి జనార్దన రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీలోని  అనంతపురం - కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాల మధ్య బళ్లారి రిజర్వ్‌ ఫారెస్ట్‌  ఉంది. అనంతపురం జిల్లా డి.హీరేహల్‌ మండలం ఓబుళాపురం పరిధిలో ఆరు మైనింగ్‌ కంపెనీలు ఐరన్‌ఓర్‌ మైనింగ్‌ చేపట్టాయి. అందులో గాలి జనార్దన రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ(ఓఎంసీ)కి 133.98 హెక్టార్లలో మైనింగ్‌ లీజులు ఇచ్చారు. తన కిచ్చిన భూమితోపాటు ఇతరులకు లీజుకిచ్చిన భూమిలోనూ ఓఎంసీ ఖనిజం  తవ్వుకుంటోందని, ఏపీ-కర్ణాటక మధ్య సరిహద్దు రాళ్లను తొలగించేసి అడ్డగోలుగా మైనింగ్‌ చేసుకుంటోందని ఇతర కంపెనీలు ఆరోపించాయి. 2008లోనే  సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. సరిహద్దు వివాదంపై విచారణకు సుప్రీం కోర్టు సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ (సీఈసీ)ని నియమించింది. ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి... ఇనుప ఖనిజం తవ్వకాలకోసం సరిహద్దును చెరిపివేశారని, భారీగా అక్రమాలు జరిగాయని 2009లో  కోర్టుకు తెలిపింది. అంతర్రాష్ట్ర సరిహద్దు తేల్చేవరకు మైనింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలని నివేదించింది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకొని ఓబుళాపురంలో మైనింగ్‌ను పూర్తిగా నిలిపివేస్తూ 2009 నవంబరు 24న రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య ఉన్నారు. సీఈసీ నివేదికలో పేర్కొన్న అనేక మైనింగ్‌ ఉల్లంఘనలు, అక్రమాల గుట్టు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది.


‘సరిహద్దు’ తేలక ముందే...

ఓఎంసీ మైనింగ్‌కు సంబంధించి... కర్ణాటక, ఏపీ మధ్య ఏర్పడిన ‘సరిహద్దు’ వివాదం ఇప్పటిదాకా పూర్తిగా తేలలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు... ఇటీవలే సర్వేయర్‌ జనరల్‌ సంస్థ ఆ ప్రాంతంలో సర్వే పూర్తి చేసింది. ఈ సంస్థ రూపొందించిన మ్యాపుపై ఏపీ సర్కారు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండానే సంతకం చేసింది. కానీ... కర్ణాటకకు ఆ మ్యాపుపై కొన్ని అభ్యంతరాలున్నాయి. దీంతో ఇప్పటి వరకు దానిపై సంతకమే చేయలేదు. అయినా సరే... ఓఎంసీ మైనింగ్‌కు జగన్‌ సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.


కేసులన్నీ ‘గాలి’కేనా?

ఓబుళాపురం మైనింగ్‌ అక్రమాలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీలుఉ విచారణ చేపట్టాయి. ఓఎంసీ అధినేత  గాలి జనార్దన రెడ్డి, డైరెక్టర్లతోపాటు పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్‌ చేసి వారిపై తీవ్ర అభియోగాలు మోపింది. సీబీఐ కోర్టుల్లో ఆ కేసులు నడుస్తున్నాయి. చివరకు గాలి జనార్దన రెడ్డికి బెయిల్‌ ఇప్పించేందుకు న్యాయమూర్తులను కూడా ‘కొనేందుకు’ ప్రయత్నించారు. ఈ కేసులోనూ ఆయనపై  అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. పార్లమెంటు సమావేశాల్లో రోజుల తరబడి ప్రస్తావనకు వచ్చింది. ఓబుళాపురం మైనింగ్‌ అక్రమాలపై సీబీఐ, ఈడీలు కోర్టుల్లో చార్జిషీట్‌లు దాఖలు చేశాయి. అక్రమ తవ్వకాలు, అమ్మకాల ద్వారా ఓఎంసీ 4300 కోట్ల మేర వెనకేసుకుందని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. 


ఎందుకంత తొందర?

ఓబుళాపురంలో జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు అక్రమాలను నిగ్గు తేల్చాయి. రాష్ట్ర సరిహద్దులను చెరిపేసి, సుంకలమ్మ ఆలయం కూల్చివేసి అడ్డగోలుగా ఐరన్‌ఓర్‌  తవ్వేశారని కేసులున్నాయి. సీబీఐ, ఈడీ కోర్టుల్లో కేసుల విచారణ జరుగుతోంది. అయినప్పటికీ... ఓబుళాపురంలో ఓఎంసీ కంపెనీ ఖనిజాన్ని తవ్వుకోవచ్చునని జగన్‌ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజానికి... కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. గాలి జనార్దన రెడ్డి బీజేపీ నాయకుడే. అయినా సరే... ఆయనకు మేలు చేసేలా ఉన్న ‘సరిహద్దు మ్యా ప్‌’పై కర్ణాటక ప్రభుత్వం సంతకం చేయలేదు. జగన్‌ ప్రభుత్వం మాత్రం... ఎక్కడలేని ఆత్రం ప్రదర్శిస్తూ ఏకంగా ఓబుళాపురంలో తవ్వకాలకు ‘ఓకే’ చెప్పేసింది. సీబీఐ కోర్టులో కేసుల విచారణ కొలిక్కిరాకముందే సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న మర్మం ఏమై ఉంటుందనే కోణంలో చర్చ జరుగుతోంది. 


విచారణలో ఏం చెప్పాలి?

గనులు, అటవీ, కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులకు తెలియకుండానే... సుప్రీంకోర్టులో గాలి జనార్దన రెడ్డి కంపెనీకి అనుకూలంగా ప్రభుత్వం అఫిడవిట్‌ వేసినట్లు సమాచారం. నిజానికి... మైనింగ్‌కు అభ్యంతరం లేదని గనుల శాఖ చెప్పినా సరిపోదు. అటవీ పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణమండలి కూడా ఓకే చెప్పాలి. ఇది జరగాలంటే సర్కారు ఆయా శాఖలను సమావేశపరచి నిర్ణయం తీసుకోవాలి. కానీ... ఇవేవీ జరగలేదు. ‘‘ఓఎంసీపై దాఖలైన సీబీఐ కేసుల్లో గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అటవీ, పర్యావరణ శాఖలు పార్టీలుగా ఉన్నాయి. ఆ సంస్థ పర్యావరణ ఉల్లంఘనతోపాటు అడ్డగోలు అక్రమాలు చేసిందని అనేక అఫిడవిట్ల ద్వారా తెలియజేశాయి. ఇప్పుడు అదే సంస్థ ఓబుళాపురంలో మైనింగ్‌ చేసుకోవచ్చని, ఇందుకు తమకేం అభ్యంతరం లేదని సర్కారు చెప్పడం గమనార్హం. అంటే... గతంలో తాము లేవనెత్తిన అభ్యంతరాలు, గుర్తించిన ఉల్లంఘనలపై మౌనం వహించాలని ఆయా శాఖలను శాసించడమే. ఇదే అంశం సీబీఐ కోర్టులో విచారణకు వస్తే ఆ శాఖలు ఏమని బదులిస్తాయి?’’ అని ఓ సీనియర్‌ అధికారి ప్రశ్నించారు.

Updated Date - 2022-08-10T07:56:32+05:30 IST