నిఘా పరికరాల కొనుగోలులో నాపై కేసు కొట్టేయండి

ABN , First Publish Date - 2022-07-05T08:10:39+05:30 IST

భద్రత, నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో గత ఏడాది మార్చి 18న ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నిఘా విభాగం మాజీ అధిపతి, డీజీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. పరికరాల కొనుగోలు..

నిఘా పరికరాల కొనుగోలులో నాపై కేసు కొట్టేయండి

రూపాయైునా ఖర్చు చేయలేదు

ఏసీబీ కేసు చెల్లుబాటు కాదు

ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా.. తదుపరి చర్యలు అడ్డుకోండి

మధ్యంతర ఉత్తర్వులివ్వండి హైకోర్టులో ఏబీవీ పిటిషన్‌


అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): భద్రత, నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో గత ఏడాది మార్చి 18న ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నిఘా విభాగం మాజీ అధిపతి, డీజీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. పరికరాల కొనుగోలు వ్యవహారంలో తనకు ఎలాంటి పాత్రా లేదన్నారు. వాటి కొనుగోలు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ఎలాంటి ఆర్థిక నష్టమూ జరగలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ డీజీగా ఉన్న తనను బదిలీ చేసి జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. విచారణ పెండింగ్‌ పేరుతో 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్‌ చేస్తూ జీవో ఇచ్చిందని.. జీవోలో పేర్కొన్న ఆరోపణలతో 2021 మార్చిలో ఏసీబీ తనపై కేసు నమోదు చేసిందని తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌ ఆమోదం పొందకుండా సాధారణ విచారణ జరిపి తనపై కేసు పెట్టారని.. దురుద్దేశంతో నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. వ్యాజ్యంలో తుది నిర్ణయం వెల్లడించే వరకు ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా తదుపరి చర్యలు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.


పిటిషన్‌లో ఏముందంటే..

‘ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న విధంగా నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నాకు ఎలాంటి పాత్రా లేదు. పరికరాలు సమకూర్చుకునే ప్రక్రియను 2017 మే 4న అప్పటి డీజీపీ ప్రారంభించారు. అందుకోసం కాంపిటెంట్‌ అథారిటీ హోదాలో  సాంకేతిక, కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేశారు. అందులో కొందరు అధికారులు బదిలీ కావడంతో కమిటీలను 2018 సెప్టెంబరు 9న పునర్వ్యవస్థీకరించారు. ఈ వ్యవహారాల్లో నా ప్రమేయం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సటీసీఐఎల్‌)కు పరికరాల కొనుగోలు టెండర్‌ ప్రక్రియను అప్పగించారు. కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో సేవలు అందించినందుకు గాను రూ.10 లక్షలు మినహాయించింది. ఆ సొమ్మును ఎస్‌టీసీఐఎల్‌ తర్వాత వెనక్కి ఇచ్చింది. హోదాను అడ్డంపెట్టుకుని కమిటీ నిర్ణయాలను ప్రభావితం చేశానని ఏసీబీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. తమను ప్రభావితం చేశారని విచారణ సందర్భంగా కమిటీలోని సభ్యులూ చెప్పలేదు.


ఆర్థికంగా ఎలాంటి నష్టం జరగనప్పుడు.. ఏసీబీ నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదు. నేను మోసం చేసినట్లుగానీ, నావల్ల ఎవరైనా మోసపోయినట్లు గానీ ఆరోపణలు లేనందున నాపై పెట్టిన ఐపీసీ సెక్షన్‌ 420 చెల్లుబాటు కాదు. నిందితుడిగా నన్ను ఒక్కడినే పేర్కొన్నందున ఇతరులతో కలిసి కుట్రకు పాల్పడ్డాననే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ నేపథ్యంలో సెక్షన్‌ 120 బీ కింద నమోదు చేసిన కేసు చెల్లదు. నా నిర్ణయాల కారణంగా ఎవరు లబ్ధి పొందారు.. నాకు ఏమి అనుచిత లబ్ధి చేకూరిందో ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదు. నాపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేకున్నా ఏసీబీ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసు నమోదు చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసును రద్దు చేయండి’ అని ఏబీవీ తన వ్యాజ్యంలో కోరారు.

Read more