ఆత్మీయ స్వాగతం

ABN , First Publish Date - 2022-09-19T09:04:10+05:30 IST

ఆత్మీయ స్వాగతం

ఆత్మీయ స్వాగతం

మహాపాదయాత్రకు నీరాజనాలు  

అడుగడుగునా తరగని ఆదరణ 

అండగా ఉంటామన్న పల్లె జనం 

7వ రోజు 18 కి.మీ. యాత్ర 

నేడు పాదయాత్రకు విరామం 

బాపట్ల జిల్లా రేపల్లె మండలం గుడ్డికాయలంక వద్ద పాదయాత్ర


రేపల్లె/బాపట్ల, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు అన్యాయం జరిగింది. వారికి అండగా ఉండి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుంటాం. ఈ పోరాటంలో విజయం మీదే. లక్ష్యం చేరేవరకు మీకు అండగా ఉంటాం’’.... అంటూ అమరావతి రైతులు మహాపాదయాత్ర చేస్తున్న గ్రామాల్లో స్థానికులు భరోసా ఇస్తున్నారు. ఆదివారం ఉదయం బాపట్ల జిల్లా నగరంలోని ఎస్‌వీఆర్‌ఎం కళాశాల నుంచి ప్రారంభమైన పాదయాత్ర గాలివారిపాలెం, బెల్లంవారిపాలెం, ఏలేటిపాలెం, వెలమవారిపాలెం, చిలకావారిపాలెం, సజ్జావారిపాలెం మీదుగా రేపల్లె చేరుకుంది. ఆదివారం 7వ రోజు 18 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. నగరం నుంచి పెనుమూడి రోడ్డు వరకు రైతులు నడకను కొనసాగించారు. పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించి ఆదివారానికి నాలుగు రోజులవుతోంది. సామాన్య ప్రజానీకం నుంచి తరగని ఆదరణ, సాదర స్వాగతాలు రాజధాని రైతులకు దక్కుతున్నాయి. వయసు మళ్లిన పెద్దలు సైతం వారితో కలిసి రెండడుగులు వేయాలని ఉత్సాహం చూపుతున్నారు. సజ్జావారిపాలెం గ్రామస్థులు చూపిన ఆదరణకు రాజధాని రైతులు చలించిపోయారు. రేపల్లె పట్టణంలోకి పాదయాత్ర ప్రవేశించే సమయంలో అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాన రహదారి జనసంద్రమైంది. రైతులకు మద్దతుగా తరలివచ్చిన జనసందోహాన్ని చూసి పాదయాత్రలో పాల్గొన్న నన్నపనేని రాజకుమారి కన్నీటిపర్యంతమయ్యారు. మాజీ మంరత్రులు కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాలవీరాంజనేయస్వామి పాదయాత్రలో పాల్గొని రైతులకు మద్దతు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, బాపట్ల టీడీపీ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ తదితరులు రైతులతో అడుగు కలిపారు. గుంటూరు, విజయవాడ నుంచి వచ్చిన వందలాది మంది ముస్లింలు పాదయాత్రకు సంఘీభావం తెలిపి పండ్లు పంచిపెట్టారు. జైభీమ్‌ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన బహుజనులు రైతులకు అండగా ఉంటామన్నారు. సీపీఐ, బీజేపీ, జనసేన పక్షాలు వెంటరాగా వివిధ ప్రజా సంఘాల మద్దతు మధ్య పాదయాత్ర సాగింది. 


అమరావతి ఏడికీ పోదు: జేసీ 

ఏడోరోజు మహాపాదయాత్రలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘మూడు లేదు, నాలుగు లేదు. రాజధాని అమరావతి ఏడికీ పోదు. ఆ పొద్దేమో అనుకూలం అన్నాడు.. ఇప్పుడేమో ఇలా అంటున్నాడు. ముఖ్యమంత్రి మైండ్‌గేమ్‌ ఆడుతున్నాడు. డబ్బుల్లేవు ఆడ... ఏడ తెచ్చి కడతాడు ఆయన మూడు రాజధానులు... మాకేమి చేయబడలే... ఆయన హార్టికల్చర్‌ను డెవలప్‌ చేస్తే మాకదే పది వేలు’ అంటూ రాయలసీమ యాసలో మాట్లాడుతూ రైతులను ఉత్సాహపరిచారు. గడ్డంతో ఉన్న ఆయన్ను గుర్తుపట్టలేదని రాజధాని రైతు ఒకరు అనడంతో... అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాకే  తీసేద్దామనుకుంటున్నా అని జేసీ చమత్కరించారు. 


రేపు కృష్ణా జిల్లాలోకి ప్రవేశం 

మహాపాదయాత్ర ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నందున సోమవారం నడకకు విరామం ప్రకటించారు. మంగళవారం ఉదయం పెనుమూడి రోడ్డు నుంచి యాత్ర ప్రారంభమై పులిగడ్డ వారధి వద్ద కృష్ణాజిల్లాలోకి ప్రవేశిస్తుంది. 

Updated Date - 2022-09-19T09:04:10+05:30 IST