విదేశీ విద్యకు కొత్త ఫిటింగ్‌

ABN , First Publish Date - 2022-08-07T09:02:26+05:30 IST

విదేశీ విద్యా దీవెన పథకంలో వైసీపీ సర్కారు కొత్త ఫిటింగ్‌ పెట్టింది. లబ్ధిదారుల సంఖ్య తగ్గించుకునేందుకు నిబంధనలను ఎక్కుపెట్టింది.

విదేశీ విద్యకు కొత్త ఫిటింగ్‌

  • ఈ నెలలో విదేశాలకు వెళ్లేవారికి సాయం కష్టమే 
  • మళ్లీ స్వదేశం రావాలంటే ఆర్థిక భారం
  • ఇప్పటికే వర్సిటీల్లో చేరిన వారూ అనర్హులు 
  • ఇదివరకే 200 క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ నిబంధనలు
  • సాయానికి దరఖాస్తుల గడువు సెప్టెంబరు 30

(అమరావతి-ఆంధ్రజ్యోతి): విదేశీ విద్యా దీవెన పథకంలో వైసీపీ సర్కారు కొత్త ఫిటింగ్‌ పెట్టింది. లబ్ధిదారుల సంఖ్య తగ్గించుకునేందుకు నిబంధనలను ఎక్కుపెట్టింది. విదేశాల్లో చదువుకోవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల కోసం అమల్లోకి తెచ్చిన ఈ పథకానికి ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. 200 క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకే ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ఆ యూనివర్సిటీల జాబితా కూడా విడుదల చేసింది. తాజాగా మరికొన్ని నిబంధనలు పెట్టింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎంపిక కమిటీ ముందు హాజరు కావాలని, హాజరైన వారికే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. 200 క్యూఎస్‌ ర్యాంకి ంగ్స్‌ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి మాత్రమే సాయం చేస్తామని నిబంధన పెట్టడంతో చాలామంది విద్యార్థులు ఈ పథకానికి అనర్హులయ్యారు. తాజా నిబంధనలతో మరింత మందికి ఈ పథకం అందని పరిస్థితి ఏర్పడింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు శరాఘాతంగా మారింది. ఇప్పటికే కొన్ని ప్రముఖ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెలాఖరులోపు జాయిన్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు మళ్లీ స్వదేశానికి వచ్చి ప్రభుత్వ ఎంపిక కమిటీ ముందు హాజరుకావడం ఆర్థికభారం అవుతుంది. అంతేకాకుండా వారు మళ్లీ స్వదేశం రావడానికి సాధ్యం కాకపోవచ్చు. పైగా ఇప్పటికే విదేశాల్లో చదువుతున్న వారు ఈ పథకానికి అర్హులు కాదని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో ఈ విద్యార్థులకు ఈ పథకం ఏ మాత్రం ఉపయోగపడదు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది ప్రచారం కోసమే తప్ప విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు కాదని పలువురు విమర్శిస్తున్నారు. 


వచ్చే నెల 30లోపు దరఖాస్తులు 

సెప్టెంబరు 30లోపు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తులను ఆయా కులాలకు సంబంధించిన కార్పొరేషన్‌ జిల్లా అధికారులు పరిశీలించి రాష్ట్ర సంక్షేమ అధికారులకు పంపిస్తారు. రాష్ట్ర అధికారులు పరిశీలించి ఎంపిక కమిటీకి పంపిస్తారు. ఆయా శాఖల ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, సాంకేతిక విద్య కమిషనర్‌, ఆయా సంక్షేమ శాఖల కమిషనర్‌/డైరెక్టర్‌లు దరఖాస్తుల సంఖ్యను బట్టి సమావేశమై ఎంపిక ప్రక్రియ చేపడతారు. 


గత ప్రభుత్వంలో వెసులుబాట్లు 

విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం చేసే విషయంలో గత ప్రభుత్వం వెసులుబాట్లు కల్పించింది. విద్యార్థులు ఎవరైనా అప్పటికే విదేశాలకు వెళ్లి యూనివర్సిటీల్లో చేరినట్టయితే.. ఆన్‌లైన్‌ ద్వారా వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేది. ఎంపిక కమిటీ ముందు విద్యార్థులకు బదులుగా వారి తల్లిదండ్రులు హాజరయ్యే అవకాశం ఉండేది. విదేశాల్లో ఉన్న విద్యార్థులతో ఇక్కడి అధికారులు వీడియో కాల్స్‌ ద్వారా ముఖాముఖి ఇంటర్వ్యూలు చేసేవారు. దీంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్య సాయంలో రకరకాల నిబంధనలు పెట్టింది. ఏ ప్రభుత్వ పథకమైనా అర్హులైన వారందరికీ లబ్ధిచేకూర్చేలా ఉండాలి కానీ... లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలే నిబంధనలను కఠినతరం చేయడమేంటని విమర్శిస్తున్నారు. విదేశాల్లో ఏ యూనివర్సిటీలో సీట్లు పొందినా ఆర్థిక సాయం అందిస్తామని గత ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా.. ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి లక్ష్యం మేరకు దరఖాస్తులు అందలేదు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి దరఖాస్తులు మరింత తగ్గే అవకాశముంది.

Updated Date - 2022-08-07T09:02:26+05:30 IST