ముంచుకొస్తున్నవరద ముప్పు

ABN , First Publish Date - 2022-09-13T08:10:28+05:30 IST

గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది.

ముంచుకొస్తున్నవరద ముప్పు

  • పెరుగుతున్న గోదావరి
  • వరదలపై తెలుగు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
  • కృష్ణా పరీవాహకంలో అప్రమత్తతపై సూచన
  • భద్రాచలం వద్ద 45 అడుగులకు చేరిక
  • మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • ఆందోళనలో విలీన మండలాల రైతాంగం
  • గ్రామాలను వీడి సురక్షిత ప్రాంతాలకు ప్రజలు


అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి), కుక్కునూరు/వేలేరుపాడు/శ్రీశైలం: గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 45 అడుగులకు చేరుకుంది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, గోదావరి పెరుగుతుండడంతో విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు నెలల కిందట గోదావరి వరద వచ్చిన సమయంలో స్థానిక రైతాంగం పత్తి పంటను నష్టపోయింది. ఇప్పుడు మిర్చి సాగు చేస్తున్న సమయంలో గోదావరి వరద ముంచెత్తడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గోదావరి వచ్చిన ప్రతిసారీ వేలాది రూపాయల నష్టం చవిచూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కుక్కునూరు మండలంలో దాదాపు 500 ఎకరాల్లో మిర్చి పంట మునిగిపోయినట్టు రైతులు చెబుతున్నారు. సోమవారం ఉదయానికే వేలేరుపాడు, రుద్రమకోట, వేలేరుపాడు-కొయిదా ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న అతిభారీ వర్షాల కారణంగా నదికి వరద నీరు పోటెత్తుతోంది. బెంబేలెత్తిన తీర గ్రామాల ప్రజలు ఆదివారం రాత్రి నుంచే గ్రామాలను ఖాళీ చేశారు. గత వరదల్లో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన రేపాకగొమ్ము గ్రామ ప్రజలు వారం కిందటే ఇళ్లకు చేరుకున్నారు. ఇంతలోనే మళ్లీ వరద పెరగడంతో ఈసారి ముందుగానే అప్రమత్తమై గ్రామాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 


కృష్ణకు వరద ముప్పు : సీడబ్ల్యూసీ 

ఎగువన ఆల్మట్టి జలాశయంలో వరద పెరుగుతోందని, కృష్ణా పరీవాహక ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణలకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉదయం 77,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, సాయంత్రానికి 1,25,000 క్యూసెక్కులకు పెరిగిందని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. నారాయణపూర్‌ నుంచి కూడా వరద ప్రవాహం  లక్షా ముప్పయి వేల క్యూసెక్కులకు పెరిగిందని తెలిపింది. శ్రీశైల జలాశయం గరిష్ఠ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొంది. శ్రీశైలానికి 2,88,361 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 324135 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉందని తెలిపింది. నాగార్జునసాగర్‌ గరిష్ఠ సామర్థ్యం 312.05 టీఎంసీలకుగాను 308.17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 3,01,469 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 2,19,358 క్యూసెక్కులు ఉంది. పులిచింతల గరిష్ఠ సామర్థ్యం 45.77 టీఎంసీలకుగాను 38.31 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 1,26,183 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,01,100 క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజీలోనూ పూర్తి సామర్థ్యం(3.07 టీఎంసీలు)లో నీరుంది. బ్యారేజీకి వస్తున్న 3,68,538 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

Read more