పేరుపై పగ

ABN , First Publish Date - 2022-10-08T09:36:06+05:30 IST

పేరుపై పగ

పేరుపై పగ

మొన్న ‘ఎన్టీఆర్‌’ వర్సిటీ.. తాజాగా ‘మహారాజా’ ఆసుపత్రి

ఆస్పత్రికి 17 ఎకరాలు ఇచ్చిన అశోక్‌ గజపతి తండ్రి

1983లో ‘మహారాజా ఆస్పత్రి’గా నామకరణం

మహారాజా పేరు తొలగించిన జగన్‌ ప్రభుత్వం

రాత్రికి రాత్రి ‘ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి’గా మార్పు  

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. టీడీపీ శ్రేణుల ఆందోళన

ఆ తర్వాత ‘సర్వజన’ పేరు కనిపించకుండా పరదా

విపక్షాల కుటుంబీకుల పేర్లతో ఉన్న సంస్థలే టార్గెట్‌ 

పేరు మార్చడం కక్షపూరిత చర్య: అశోక్‌ గజపతిరాజు


విజయనగరం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రముఖుల ‘పేర్ల’పై పగబట్టినట్టుగా వైసీపీ సర్కారు వ్యవహరిస్తోంది. ఎప్పటి నుంచో ప్రభుత్వ సంస్థలకు ఉన్న ప్రముఖుల పేర్లను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది. ముఖ్యంగా టీడీపీ నేతల కుటుంబీకుల పేర్లతో ఉన్న సంస్థలను టార్గెట్‌ చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చేసిన సంగతి తెలిసిందే. వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించి వైఎ్‌సఆర్‌ పేరు పెట్టింది. తాజాగా విజయనగరం జిల్లా కేంద్రంలో టీడీపీ నేత పి.అశోక్‌గజపతిరాజు వంశీయుల పేరుతో ఉన్న మహారాజా జిల్లా కేంద్ర ఆసుపత్రి పేరును రాత్రికి రాత్రే మార్చేశారు. మహారాజా పేరు తొలగించి శుక్రవారం తెల్లవారేసరికి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్చారు. ఈ ఆసుపత్రి ఏర్పాటుకు 1983లో విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందిన అశోక్‌ గజపతి రాజు తండ్రి పీవీజీ రాజు భూములు ఇచ్చారు. దీంతో మహారాజా జిల్లా ఆసుపత్రిగా అప్పట్లో నామకరణం చేశారు. వైద్య విధాన పరిషత్‌లోకి వచ్చిన తర్వాత కూడా మహారాజా జిల్లా ఆసుపత్రిగానే పేరు కొనసాగించారు. విజయనగరంలోని ఆసుపత్రి మొదట తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఉండేది. ఇరుకుగా ఉండటంతో అభివృద్ధి చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతమున్న ఆసుపత్రి స్థలాన్ని 1983లో పూసపాటి రాజవంశానికి చెందిన పీవీజీ రాజు ఇచ్చారు. ఆసుపత్రి కోసం మొత్తం 17 ఎకరాలు ఇచ్చారు. ఇందులోనే ప్రస్తుత జిల్లా కేంద్ర ఆసుపత్రి, భోదనాసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయం, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌, ఇంజనీరింగ్‌ విభాగం, క్షయ వ్యాధి నివారణ కార్యాలయం, వాక్సినేషన్లు భద్రపర్చే భవనం, ఆయుర్వేద ఆసుపత్రి ఉన్నాయి. ఇలా అనేక విభాగాల సముదాయాలు మహారాజా ఆసుపత్రి ప్రాంగణంలో నడుస్తున్నాయి. కాగా, వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతల కుటుంబీకుల పేర్లను తొలగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడంపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగింది. అధికార వైసీపీలో కూడా అభ్యంతరం వ్యక్తమైంది. అయినా పేర్ల మార్పు ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తోంది. విజయనగరంలోని ఆసుపత్రికి మహారాజా పేరు తొలగించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 


టీడీపీ శ్రేణుల నిరసన: ఆసుపత్రి పేరు మార్పు విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మహారాజా పేరును కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు విజయనగరం రాజులు చేసిన సేవలను మర్చిపోరాదన్నారు. రాజ వంశీయులను కించేపరిచే చర్యలకు పూనుకోవటం సరికాదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల సలహాలతో పేర్లు మారుస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. మహారాజా జిల్లా ఆసుపత్రి పేరును మార్చడంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో శుక్రవారం సాయంత్రానికి ఆసుపత్రి పేరు కన్పించకుండా పరదా కప్పేశారు. 


మహారాజా పేరు కొనసాగించాలి

ప్రజలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించేందుకు వీలుగా అత్యంత విలువైన భూములను మా పూర్వీకులు ఉచితంగా అందించారు. భవిష్యత్‌ అవసరాలకు వినియోగపడేలా, పట్టణానికి ఆనుకుని ఉన్న భూములను వైద్యశాలకు ఇస్తే రోగులకు సౌకర్యంగా ఉంటుందని భావించారు. అప్పటి నుంచి మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిగానే కొనసాగుతోంది. వైసీపీ పెద్దలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. స్థల దాతల పేర్లు కొనసాగించడం ఆనవాయితీ. ఏ ప్రభుత్వమైనా ఇదేవిధంగా ఆలోచిస్తుంది. గుర్తింపు తెచ్చిన నాయకుల పేర్లు ప్రభుత్వ భవనాలకు పెట్టడం వారికిచ్చే గౌరవం. ప్రముఖులను గౌరవించే పద్ధతి వైసీపీ ప్రభుత్వానికి లేదు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్థలాన్ని దానం చేసిన మహారాజా పేరును కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నాం.

- పి.అశోక్‌ గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి 



Updated Date - 2022-10-08T09:36:06+05:30 IST