పతనావస్థలో భవిష్యత్‌

ABN , First Publish Date - 2022-08-16T07:47:24+05:30 IST

రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థల (ఏపీఈపీడీసీఎల్‌, ఏపీఎస్పీడీసీఎల్‌) భవిత ఆందోళనకరంగా ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

పతనావస్థలో భవిష్యత్‌

  • డిస్కమ్‌ల పరిస్థితి ఏపీలో ఆందోళనకరం
  • చార్జీల వసూలు బాగానే ఉన్నా నష్టాల్లోనే..
  • సబ్సిడీలను రాష్ట్ర సర్కారు చెల్లించని ఫలితం
  • నష్టాలు తగ్గించుకోకపోతే పరిస్థితి విషమం
  • హెచ్చరించిన కేంద్రం..నివేదిక విడుదల 
  • కేంద్ర ర్యాంకుల్లో డిస్కమ్‌లు అట్టడుగున...
  • సీ గ్రేడ్‌లో ఏపీఈపీడీసీఎల్‌, బీ గ్రేడ్‌లో ఏపీఎస్పీడీసీఎల్‌


విద్యుత్తురంగంలో ముందంజలో ఉన్నామని, రాష్ట్ర డిస్కమ్‌లవైపు ఇతర రాష్ట్రాల డిస్కమ్‌లు చూస్తున్నాయంటూ సీఎం జగన్‌ ఊదరగొడుతుంటారు. కానీ.. కేంద్రం వెల్లడించిన ర్యాంకుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున నిలిచింది. పైగా.. డిస్కమ్‌ల భవిష్యత్తు పతనావస్థలో ఉన్నదని హెచ్చరించింది కూడా. ఇదేదో ప్రైవేటు సంస్థ విడుదలచేసిన నివేదిక అయితే దులిపేసుకుపోవచ్చు. కానీ ఇది కేంద్రమే ఇచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్టు! దీంతో జగన్‌ సర్కారుకు తొలిసారి గట్టి షాక్‌ తగిలింది. 


అమరావతి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థల (ఏపీఈపీడీసీఎల్‌, ఏపీఎస్పీడీసీఎల్‌) భవిత ఆందోళనకరంగా ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ డిస్కమ్‌లకు సంబంధించిన తొమ్మిదో నివేదికను వెలువరించింది. 2020-21కు గాను రాష్ట్రంలోని ప్రధానమైన ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏపీసీపీడీసీఎల్‌) సీ- గ్రేడ్‌లోనూ .. సదరన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏపీఎస్పీడీసీఎల్‌) బీ - గ్రేడ్‌లోనూ ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. విద్యుత్తు వినియోగదారులు నెలవారీ కరెంటు బిల్లులు 93.36 శాతం మేర సకాలంలోనే చెల్లిస్తున్నారు. ప్రభుత్వమే నిర్ణీత సమయంలో సబ్సిడీలను డిస్కమ్‌లకు చెల్లించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలూ.. ప్రభుత్వరంగ సంస్థలు .. స్థానిక సంస్థలు బిల్లులను దీర్ఘకాలంగా పెండింగ్‌లో పెడుతున్నాయని కేంద్ర నివేదిక ఆక్షేపించింది. ప్రైవేటు సంస్థలు వెల్లడించే నివేదికలను డిస్కమ్‌లు తప్పుబట్టే వీలుంది. కానీ, కేంద్రమే సమీకృత అధ్యయన నివేదికను ప్రకటించడంలో డిస్కమ్‌లు మౌనం దాల్చాల్సివచ్చింది. 


ఎటీఅండ్‌సీ నష్టాలు 6.64 శాతంగా తక్కువగానే ఉన్నాయి. డిస్కమ్‌ పరిధిలో వినియోగదారులు 93.36 శాతం మేర నెలవారీ బిల్లులు చెల్లిస్తున్నారు. యేటా క్రమం తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలికి (ఏపీఈఆర్‌సీ) వార్షిక ఆదాయ నివేదికలు డిస్కమ్‌ సమర్పిస్తూనే ఉంది. ఏటా పెంచిన .. సవరించిన రాబడిని సాధిస్తోంది. కానీ .. ఆర్థిక క్రమశిక్షణ మాత్రం లోపిస్తోంది. కేంద్రానికి ఆడిట్‌ చేసిన ఆదాయ వ్యయ నివేదికను పంపలేదు. కేవలం .. ఆడిట్‌ కోసం పంపిన .. ధ్రువీకరించని అకౌంట్‌ వివరాలను మాత్రమే పంపింది. సంస్థకు ఏ యేటికాయేడు పెరుగుతున్న నష్టాల గురించిన సమాచారం కేంద్రానికి సమర్పించలేదు. అంతే కాకుండా .. ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీని డిస్కమ్‌లకు సకాలంలో అందించడం లేదని కేంద్ర సమీకృత అధ్యయనంలో తేలింది. విద్యుత్తు ఉత్పత్తి కోసం బొగ్గుతోసహా ఇతర ముడిసరుకులు పంపిణీ చేస్తున్న సంస్థలకు వెనువెంటనే చెల్లింపులు నిర్వహించే వ్యవస్థను అమలు చేయడం లేదని ఈ అధ్యయనం గుర్తించింది. అంతేకాకుండా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న విద్యుత్తుకు కూడా ప్రణాళికాబద్ధంగా చెల్లింపులు నిర్వహించడం లేదని కూడా గుర్తించింది. బొగ్గు సరఫరా .. విద్యుత్తు కొనుగోళ్లు చేశాక .. సంబంధిత సంస్థలకు చెల్లింపులు జరిపేందుకు ఏకంగా 206 రోజుల సమయం తీసుకుంటుందని కేంద్రం గుర్తించింది.  దీనిని తీవ్రంగా పరిగణించింది. ఈ వైఖరిని ఏపీఈసీడీసీఎల్‌ తక్షణమే మార్చుకోవాలని హెచ్చరించింది. నష్టాలను తగ్గించుకోవాలని సూచించింది. మరీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ మొత్తాన్ని సకాలంలో వసూలు చేసుకోవాలని స్పష్టం చేసింది.


కేంద్రం ఒత్తిడితో ‘ఎల్‌పీఎస్‌’లోకి జెన్కో

వివిధ ఆర్థిక సంస్థలకు బకాయిపడ్డ రూ.17,060 కోట్లను 12 వాయిదాల్లో చెల్లించేలా ఏపీజెన్కోపై కేంద్రప్రభుత్వం తెచ్చిన ఒత్తిడి ఫలించింది. ఈ మేరకు కేంద్రం ప్రవేశపెట్టిన లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జీ స్కీమ్‌(ఎల్‌పీఎ్‌స)లో జెన్కో చేరింది.  విజయవాడ విద్యుత్తు సౌధలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌  దీనిపై స్పందించారు. ఈ స్కీమ్‌లో చేరిన ఏపీజెన్కో తొలి వాయిదా రూ.1,422 కోట్లను ఈ నెల ఆరో తేదీన చెల్లిస్తుందని విజయానంద్‌ తెలిపారు. డిస్కమ్‌లు సకాలంలో బకాయిలు జెన్కోకు చెల్లించేలా చర్యలు చేపడతామన్నారు. 


డిస్కమ్‌లు డీలా..

తిరుపతి ప్రధాన కార్యాలయంగా కలిగిన ‘ఏపీఎస్పీడీసీఎల్‌’కు కేంద్రం బీ-గ్రేడ్‌ను ఇస్తూ ఒక హెచ్చరిక చేసింది. తక్షణమే నష్ట నివారణ చర్యలు తీసుకోకుంటే తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని హెచ్చరించింది. ప్రవాహ నష్టాలు 13 శాతం మేర ఉన్నయని, వాటిని మరింత తగ్గించుకోవాలని సూచించింది.  వినియోగదారుల నుంచి 95 శాతం మేర బిల్లులు వసూలు చేస్తోన్న ఎస్పీడీసీఎల్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ మొత్తాన్ని మాత్రం సకాలంలో వసూలు చేసుకోలేపోతోందని కేంద్రం గుర్తించింది. ఇదే సమయంలో బొగ్గు, కరెంటు పంపిణీదారులకు చెల్లింపులు 140 నుంచి 155 రోజులు తీసుకుంటోందని .. ఇది తీవ్ర జాప్యమని స్పష్టం చేసింది. బొగు, కరెంటు సరఫరా సంస్థలకు ఆటోమెటిక్‌గా చెల్లింపులు జరిగే విధానం అమలు కావడం లేదని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ సబ్సిడీ సకాలంలో అందడంలేదని పేర్కొంది. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రవాహ నష్టాలను తగ్గించుకోవాలని ఎస్పీడీసీఎల్‌కు కేంద్రం సూచించింది. కరెంటు సరఫరా సంస్థలకు సకాలంలో బిల్లులు చెల్లించే విధానం అమలు చేయాలని స్పష్టం చేసింది. 

Updated Date - 2022-08-16T07:47:24+05:30 IST