దేనికీ గర్జనలు..?

ABN , First Publish Date - 2022-10-11T09:27:12+05:30 IST

‘దేనికి గర్జనలు’ పేరుతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా వైసీపీపై వరుస ప్రశ్నలు సంధించారు. సోమవారం ఆయన వరుసగా 18 వరుస ట్వీట్లతో హోరెత్తించారు. రాష్ట్ర పాలకుల తప్పిదాలను ఒక్కొక్కటిగా..

దేనికీ గర్జనలు..?

ప్రభుత్వ వైఫల్యాలపై జనసేనాని ట్వీట్ల హోరు

15 నుంచి 3 రోజుల ఉత్తరాంధ్ర పర్యటన

విశాఖలో 16న ‘జనవాణి’


అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ‘దేనికి గర్జనలు’ పేరుతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా వైసీపీపై వరుస ప్రశ్నలు సంధించారు. సోమవారం ఆయన వరుసగా 18 వరుస ట్వీట్లతో హోరెత్తించారు. రాష్ట్ర పాలకుల తప్పిదాలను ఒక్కొక్కటిగా ఎత్తి చూపారు. ప్రభుత్వ వైఫల్యాలను, విస్మరించిన హామీలను నిగ్గదీశారు. పాలకుల పోకడలను ప్రజల ముందు ఉంచారు. ఆయన ట్వీట్లలో కొన్ని... ‘‘ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా..? విశాఖలో రుషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసినందుకా? మూడు రాజధానులతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసినందుకా? మత్య్సకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్‌, చెన్నై వెళ్లిపోతున్నందుకా..? రోడ్డు వేయనందుకా..? చెత్త మీద పన్ను వసూలు చేస్తున్నందుకా..? సీపీఎస్‌ మీద మాట మార్చినందుకా..? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందుకా..? పోలీసులకు టీఏ, డీఏలు ఇవ్వనందుకా..? భర్తీ చేస్తామన్న 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకా..? పోలీస్‌ రిక్రూట్మెంట్‌ చేయనందుకా..? హైకోర్టుతో చీవాట్లు తిన్నందుకా..? ప్రజాస్వామ్యాన్ని కులస్వామ్యంగా మార్చేసినందుకా..? కౌలు రైతులకు మొండి చేయి చూపినందుకా..? మద్యం ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పలు తెచ్చింనందుకా..?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు పవన్‌ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. 16న విశాఖపట్నంలో జనవాణి నిర్వహిస్తారు. 

Updated Date - 2022-10-11T09:27:12+05:30 IST