మందు కొడుతూ డ్రైవింగ్‌..!

ABN , First Publish Date - 2022-09-26T07:56:35+05:30 IST

మద్యం సేవిస్తూ అతివేగంగా కారు నడిపిన ఓ ప్రబుద్ధుడు.. రెండు బైక్‌లు, ఒక కారుని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. వారి తల్లిదండ్రులను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాడు

మందు కొడుతూ డ్రైవింగ్‌..!

రోడ్డుపై బీభత్సం సృష్టించిన కారు

రెండు బైక్‌లు, మరో కారును ఢీ 

ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి

ప్రాణాలతో పోరాడుతున్న తల్లిదండ్రులు

రోడ్డుమీదే దగ్ధమైన బైక్‌


జంగారెడ్డిగూడెం/కామవరపుకోట, సెప్టెంబరు 25: మద్యం సేవిస్తూ అతివేగంగా కారు నడిపిన ఓ ప్రబుద్ధుడు.. రెండు బైక్‌లు, ఒక కారుని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. వారి తల్లిదండ్రులను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాడు.  ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం బొర్రంపాలెం అడ్డరోడ్డు (జంగారెడ్డిగూడెం-ఏలూరు ప్రధాన రహదారి)పై ఆదివారం జరిగిన ఈ పమాదం వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని మీర్జాపురానికి చెందిన నూకా ఉమామహేశ్వరరావు, భార్య రేవతి, కుమారుడు దుర్గాప్రసాద్‌(8), కుమార్తె షర్మిల(9) ద్విచక్రవాహనంపై ఆదివారం ఉదయం బుట్టాయిగూడెం మండలం గుబ్బల మం గమ్మ తల్లి ఆలయానికి వచ్చారు. ఉమామహేశ్వరరావు తల్లిదండ్రులు నూకా గణపతి, లక్ష్మి కూడా  మరొక బైక్‌పై వచ్చారు. వెనుదిరిగి వస్తుండగా కామవరపుకోట మండలం బొర్రంపాలెం అడ్డరోడ్డు సమీపంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు ఉమామహేశ్వరరావు బైక్‌ను బలంగా ఢీకొట్టింది.


దీంతో ఉమామహేశ్వరరావు, రేవతి, దుర్గాప్రసాద్‌, షర్మిల గాల్లోకి ఎగిరి, చెట్టు కొమ్మలకు తగిలి తలో దిక్కుకి పడిపోయారు. తీవ్రగాయాలైన దుర్గాప్రసాద్‌, షర్మిల అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉమా మహేశ్వరరావు కుడి చెయ్యి తెగిపోయింది. రేవతి తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారకస్థితిలో ఉంది. ప్రమాదం ధాటికి బైక్‌ నుంచి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. వాళ్ల వెనుకే వస్తున్న గణపతి, లక్ష్మి బైక్‌ను కూడా కారు ఢీకొట్టడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ నలుగురిని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉమామహేశ్వరరావు, రేవతి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు బైక్‌లను ఢీకొట్టిన తర్వాత కూడా డ్రైవర్‌ ఆగకుండా దూసుకెళ్లి మరో కారుని బలంగా ఢీకొట్టాడు. దీంతో అతని కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ మద్యం సేవిస్తూ వాహనాన్ని నడిపాడని స్థానికులు తెలిపారు. ప్రమా దం అనంతరం కారులో ఉన్న ఇద్దరూ పరార య్యారు. తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-09-26T07:56:35+05:30 IST