జట్టుగా చుట్టేశారు!

ABN , First Publish Date - 2022-10-11T08:46:25+05:30 IST

‘ఉత్తరాంధ్రలో పార్టీ నేనే... ప్రభుత్వమూ నేనే’ అని చెప్పుకొనే నాయకుడొకరు... పైనుంచి చక్రం తిప్పారు! ‘విశాఖే పరిపాలనా రాజధాని’... అంటూ తాజాగా మొదలుపెట్టిన మూడు రాజధానుల ఉద్యమంలో ఆవేశంగా మాట్లాడుతున్న చురుకైన మంత్రి ఒకరు స్థానికంగా అన్నీ చక్కబెట్టారు.

జట్టుగా చుట్టేశారు!

వైసీపీ ఉత్తరాంధ్ర కీలక నేతదే అసలు వ్యూహం

చక్కబెట్టే బాధ్యతలు మంత్రి, మరికొందరికి!

ఒకేచోట 600 ఎకరాల బంగారంలాంటి బిట్టు

సాంకేతిక, ఇతర సమస్యలతో వాటిపై వివాదం

స్థానికంగా ఉండని భూయజమానులే అధికం

నయానో భయానో మొత్తం భూములు స్వాధీనం

ఆకలి చావక... వాగులూ కొండలూ ఆక్రమణ

అక్రమంగా, అడ్డగోలుగా 600 ఎకరాలు చదును

తహసీల్దారు కార్యాలయానికి 6 కి.మీ. దూరంలోనే అరాచకం

కళ్లుమూసుకున్న యంత్రాంగం

‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో సంచలనం

బయ్యవరంలో భూదందాపై ప్రభుత్వం ఆరా

నివేదిక సమర్పించాల్సిందిగా విశాఖ, అనకాపల్లి కలెక్టర్లకు ఆదేశం


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

‘ఉత్తరాంధ్రలో పార్టీ నేనే... ప్రభుత్వమూ నేనే’ అని చెప్పుకొనే నాయకుడొకరు... పైనుంచి చక్రం తిప్పారు!

‘విశాఖే పరిపాలనా రాజధాని’... అంటూ తాజాగా మొదలుపెట్టిన మూడు రాజధానుల ఉద్యమంలో ఆవేశంగా మాట్లాడుతున్న చురుకైన మంత్రి ఒకరు స్థానికంగా అన్నీ చక్కబెట్టారు. 

ఉత్తరాంధ్రకే చెందిన ఒక కులం కార్పొరేషన్‌ సారథి ఒకరు... మరో జిల్లాకు చెందిన వైసీపీ నేత ఒకరు, మరికొందరు చోటా నేతలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి బెదిరింపులు, దందాలు, బేరాలతో మొత్తం భూములు దఖలుపడేలా చేశారు!

అంతా కలిసి సుమారు 600 ఎకరాల భూమిని శుభ్రంగా ‘చదును’ చేసేశారు.

 

ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో జరిగిన ‘భూయజ్ఞం’ వెనుక భారీ తతంగం సాగింది. కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట పరిసరాల్లో వందలాది ఎకరాలు చేతులు మార డం వెనుక వైసీపీ పెద్దలే కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అవే భూముల్లో ‘వింటేజ్‌’ పేరుతో భారీ రియల్‌ ప్రాజెక్టు మొ దలైంది. పట్టా భూములతోపాటు అసైన్డ్‌ భూములను, ప్రభు త్వ భూములనూ చెరపట్టి... వాగులూ, వంకలూ పూడ్చేసి... గుట్టలనూ పిండిచేసి ఈ భారీ వెంచర్‌ను సిద్ధం చేశారు. ఈ భూములకు సంబంధించిన రెవెన్యూ సమస్యలు తొలగిపోయే లా కీలక నేత చక్రం తిప్పారు. ఉన్నత స్థాయిలో ఆదేశాలు ఇప్పించారు. ఆ తర్వాత.. క్షేత్రస్థాయిలో భూములను సొంతం చేసుకునే బాధ్యతను ఉత్తరాంధ్రలో తనకు నమ్మినబంట్ల వం టి ఒక ప్రజా ప్రతినిధికి, మరొక నాయకుడికీ అప్పగించారు.


అసలు యజమానులకు సున్నం

‘వింటేజ్‌’ విల్లా భూముల వెనుక పెద్ద కథే  ఉంది. ఇవి ఉమ్మడి విశాఖలోని రాంబిల్లి, తంగేడు భూస్వాములతోపాటు తూర్పు గోదావరికి చెందిన మరో భూస్వామికి, కశింకోట మం డలం బయ్యవరం పరిసర గ్రామాల్లో కొందరికి చెందిన భూ ములు. వాటిలో కొన్ని జిరాయితీకాగా మరికొన్ని ఇనాం భూ ములు. ఇనాం భూములకు రైత్వారీ పట్టాలు పొందినా వాటికి సంబంధించి కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులున్నాయి. సర్వే నంబరు 195/2లో మొత్తం 600 ఎకరాలు సబ్‌ డివిజన్‌ చేయలేదు. ఎవరి భూమి ఎక్కడుందో కొందరికి తెలియదు. దీనికితోడు స్థానికంగా లేని భూయజమానులు వ్యవసాయం చేయడానికి ఇష్టపడలేదు. ఇలాంటి వాళ్లు భూములు విక్రయించాలనుకున్నప్పటికీ.. సాంకేతిక సమస్యలతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో రైతుల సమస్యపై గతంలో ఏడుగురు తహసీల్దార్లతో కమిటీ వేశారు. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది.


గద్దల్లా వాలిపోయి... 

ఉత్తరాంధ్రకు చెందిన ఓ విద్యాసంస్థల యజమాని బంధు వు... వైసీపీలో ఓ కీలక నేతను కలిశారు. మొత్తం 600 ఎకరా లు... అది కూడా విశాఖ సమీపంలో! దీంతో సదరు నేత చకచకా వ్యూహ రచన చేశారు. ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ విష         యం తీసుకువెళ్లి ‘క్షేత్రస్థాయిలో భూమిని చక్కబెట్టేందుకు’ అనుమతి తీసుకున్నారు. ‘‘భూ యజమానులందరితో నువ్వే మాట్లాడు. వాటిని విక్రయించేలా ఒప్పించు. అంతిమంగా ఆ మొత్తం భూమి మాకే అప్పగించాలి’’ అని విద్యాసంస్థల యజమానికి పురమాయించారు. ఈ డీల్‌ సవ్యంగా పూర్తి చేసే బాధ్యతను అనకాపల్లికి చెందిన ఇద్దరు అధికార పార్టీ ప్రముఖులకు అప్పగించారు. విజయనగరంలో అమాత్యుల నీడలో ఎదిగి, కీలక పదవి పొంది, జిల్లానే శాసిస్తున్న మరో నేతను జత చేశారు. ప్రభుత్వ, పార్టీ పెద్దల ఆశీస్సులు ఉండటంతో... వీరంతా రెచ్చి పోయారు. ‘ఎక్కడున్నాయో తెలియని భూములకు ఎంత వచ్చినా మేలే’ అనుకునే యజమానులు వీరి దారికి వచ్చారు. అక్కడికీ ఆకలి, ఆశ చావక... ఆ భూముల చుట్టూ ఉన్న కొండలు, గెడ్డలు, వాగులు ఆక్రమించేశారు.  ఇలా దాదాపు 600 ఎకరాల చుట్టూ గిరి గీశారు.


ఇందులో 403 ఎకరాల్లో లావాదేవీలు పూర్తి చేసుకుని... రియల్‌ దందా మొదలుపెట్టారు. బయ్యవరం భూముల్లో సాగుతున్న భూయజ్ఞాన్ని గత ఏడాది అక్టోబరు 13న ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై అప్పటి కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. అనకాపల్లి ఆర్డీవో విచారణ జరిపి నివేదిక ఇచ్చినా ఇంతవరకు దానిని బహిర్గతం చేయలేదు. ఇప్పుడు ఆ భూముల్లో ‘రియల్‌’ దందా మొదలుపెట్టారు. కశింకోట తహసీల్దార్‌ కార్యాలయాని కి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఈ దందా సాగుతోంది. ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతో... అధికారులెవరూ కిమ్మనడంలేదు. పైగా... ‘విస్సన్నపేటలో ఏమీ జరగడం లేదు. నాకేమీ తెలియదు’ అని తహసీల్దార్‌ తప్పించుకు తిరిగారు.


నివేదిక ఇవ్వాలని ఆదేశం...

బయ్యవరం పరిధిలో సాగుతున్న అడ్డగోలు భూయజ్ఞంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురిస్తున్న వరుస కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లోకాయుక్త కూడా దీనిపై దృష్టి సారించడం తో... ప్రభుత్వమూ స్పందించక తప్పలేదు. బయ్యవరం భూ ముల్లో ఉల్లంఘనలపై నివేదిక ఇవ్వాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టిని ప్రభుత్వం సోమవారం ఆదేశించింది. ఆ భూము ల్లో జరిగిన ఉల్లంఘనలను గత ఏడాది ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చినప్పుడు... నాడు ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున విచారణకు ఆదేశించారు. అప్పటి అనకాపల్లి ఆర్డీవో జె.సీతారామరావు నేతృత్వంలో అధికారులతో కూడిన కమిటీ పలు దఫాలు విస్సన్నపేట భూములను పరిశీలించి అక్కడ జరిగిన ఉల్లంఘనలు గుర్తించి కలెక్టర్‌ మల్లికార్జునకు నివేదిక సమర్పించింది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టడం, ప్రభుత్వ గెడ్డలు, బంజర్లు ఆక్రమించడం ఇంకా పలు ఉల్లంఘనలు జరిగినట్టు నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. కానీ... ఆ నివేదికను వెలుగులోకి తీసుకురాలేదు. ఈ నివేదిక గురించి కలెక్టర్‌ మల్లికార్జున వద్ద ప్రస్తావించగా.. సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిస్తామని మాత్రం తెలిపారు.

Read more