పాదయాత్రను ఆపాలంటే 5 నిమిషాల పని!

ABN , First Publish Date - 2022-09-26T07:58:30+05:30 IST

అమరావతి రైతుల పాదయాత్రను ఆపాలనుకుంటే తమకు ఐదు నిమిషాలు చాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అది ప్రజాస్వామ్య పద్ధతి కాదన్న ఉద్దేశంతో ఆ పనిచేయడం లేదని చెప్పారు.

పాదయాత్రను ఆపాలంటే 5 నిమిషాల పని!

ప్రజాస్వామ్య పద్ధతి కాదనే చేయడం లేదు: బొత్స

దోచుకోవాలనుకుంటే ఇప్పటికే సగం విశాఖ మా జేబులో: బొత్స

అక్కడే రాజధాని కడతామని రైతులతో ఒప్పందాల్లో లేదు

కొన్ని మీడియా సంస్థలు ప్రాంతీయ విభేదాలు 

సృష్టిస్తున్నాయి.. తేడా వస్తే ఆ పత్రికలు, చానళ్లు ఉండవు

రౌండ్‌ టేబుల్‌ భేటీలో విద్యామంత్రి హెచ్చరిక


విశాఖపట్నం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతుల పాదయాత్రను ఆపాలనుకుంటే తమకు ఐదు నిమిషాలు చాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అది ప్రజాస్వామ్య పద్ధతి కాదన్న ఉద్దేశంతో ఆ పనిచేయడం లేదని చెప్పారు. ఆదివారమిక్కడ ఒక హోటల్లో ‘వికేంద్రీకరణకు మద్దతుగా..’ అన్న అంశంపై అంబేడ్కర్‌ యూనివర్సిటీ మాజీ వీసీ హనుమంతు లజపతిరాయ్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరావతి రైతులు చేస్తున్నది పాదయాత్రా.. రియల్‌ ఎస్టేట్‌ యాత్రా, రాజకీయ యాత్రా అన్నది అర్థం కావడం లేదని ఆయనీ సందర్భంగా అన్నారు. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తే చంద్రబాబుకు లేదా అమరావతి రైతులకు కలిగే నష్టమేమిటని ప్రశ్నించారు.


‘రాజధాని కోసం భూములిచ్చి రైతులు త్యాగం చేశారని చెబుతున్నారు. చట్టప్రకారమే అక్కడ భూసమీకరణ జరిగింది. భూములిచ్చిన రైతులతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని మా ప్రభుత్వం కూడా అమలుచేస్తోంది. అంతేకాకుండా కౌలు చెల్లింపు సమయాన్ని సీఎం జగన్‌ ఇంకా పెంచారు. రైతులతో చేసుకున్న ఒప్పందాల్లో అక్కడే రాజధాని నిర్మిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదు. ఉంటే చూపించాలి’ అని డిమాండ్‌ చేశారు. కొన్ని మీడియా సంస్థలు ప్రాంతీయ, రాజకీయ విభేదాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ‘ఈ ప్రాంతంలో మనుగడ ప్రారంభించి ఎదిగిన మీడియా సంస్థలు ఆ కృతజ్ఞత మరచి పనిచేస్తున్నాయి. తేడావస్తే ఈ ప్రాంతంలో మీ పత్రికలు, టీవీ చానళ్లు ఏవీ ఉండవు’ అని బొత్స హెచ్చరించారు.


న్యాయమూర్తి వ్యాఖ్యలు బాధ కలిగించాయి..

ఇటీవల ఒక న్యాయమూర్తి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని బొత్స చెప్పారు. రాజ్యాంగబద్ధంగా మాట్లాడే హక్కు అందరికీ ఉంటుందని, కానీ ఉన్నత పదవులు, స్థానాల్లో ఉన్నప్పుడు సంయమనం పాటించాలని సూచించారు. ఉన్నత పదవుల్లో ఉన్నామని నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదన్నారు. వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికే సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని.. మరెవరినో ఇబ్బంది పెట్టడానికి కాదని ప్రజలు గుర్తించాలని కోరారు. విశాఖలో రూ.5 వేల కోట్లు ఖర్చుపెడితే ముంబైని తలదన్నే రాజధాని తయారవుతుందని తెలిపారు. 25ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, చాలాకాలం పదవుల్లో ఉన్నానని, తాను దోచుకోవాలనుకుంటే ఇప్పటికే సగం విశాఖ తమ జేబులో ఉండేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.


ఉత్తరాంధ్రలో కొంతమంది నాయకులు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారని.. విశాఖలో పరిపాలనా రాజధాని వద్దంటున్నారని.. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దుతారా అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఎకరమో... రెండెకరాలో కొంటే.. దానివల్ల వచ్చే ఎంగిలి మెతుకుల కోసం విశాఖలో పాలనా రాజధానిని వ్యతిరేకించడం సబబు కాదన్నారు. వికేంద్రీకరణ కోసం పోరాటం సాగించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని.. దీనిలో చేరేందుకు అన్ని సంఘాలు, మేధావులకు, సంస్థలకు ఆహ్వానం పలకాలని మంత్రి గుడివాడ అమర్నాథ్‌, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు బొత్స సూచించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించడానికి వీధి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను తరిమికొడతామని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కొందరు వక్తలు పరుషంగా మాట్లాడడాన్ని బొత్స తప్పుబట్టారు. ‘దయచేసి పరుష పదాలు, ఉద్వేగపూరిత ఉపన్యాసాలు వద్దు. సంయమనం పాటించాలి. సమాజానికి, వ్యవస్థలకు నష్టం వచ్చే పదాలు వాడద్దు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే పదాలు వాడడం నష్టం. మీకు కమిట్‌మెంట్‌, ఉద్వేగం ఉండొచ్చు. దానిని కాదనడం లేదు. తరిమికొట్టడాలు, కొట్టుకోవడాలు వంటి పదాలు వాడొద్దు’ అని కోరారు.


నాలుగు దశాబ్దాల క్రితం తెలుగుదేశం అధికారంలోకి వచ్చి, ఎన్టీ రామారావు సీఎం అయిన తర్వాతే ఉత్తరాంధ్ర వాసులు వరి అన్నం తిన్నారని.. అంతవరకు చోళ్లు (రాగులు) తినేవారని, ఇది వాస్తవమని బొత్స అన్నారు. గతంలో ఉత్తరాంధ్ర వాసుల వలస కారణంగా రైల్వేస్టేషన్లు రద్దీగా ఉండేవని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అమలుచేసిన పథకాలతో వలసలు ఆగాయని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని విమర్శించారు. 

Updated Date - 2022-09-26T07:58:30+05:30 IST