23 కోట్లు హుష్‌కాకి

ABN , First Publish Date - 2022-06-07T09:10:53+05:30 IST

గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని మార్గాలనూ అవలంబించింది.

23 కోట్లు హుష్‌కాకి

  • ఎస్సీల నిధులు ప్రైవేటు డీలర్‌ పాలు.. 
  • ఈ-ఆటో కొనుగోళ్లలో ఎస్సీ కార్పొరేషన్‌కు టోపీ
  • ఆటోల సరఫరాకు రూ.30 కోట్లు అడ్వాన్స్‌ 
  • 12.93 కోట్ల విలువైన వాహనాలు అందజేత 
  • ఆ తర్వాత మొహం చాటేసిన డీలర్‌ 
  • అసలు, వడ్డీ కలిపి 23.56 కోట్ల బకాయి
  • మూడేళ్లుగా పట్టించుకోని వైసీపీ సర్కార్‌ 
  • నకిలీ బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చినా చర్యల్లేవ్‌  
  • డీలర్‌కు ఓ ఉన్నతాధికారి అండదండలు


ఉమ్మడి రాష్ట్రంలో ఫోక్స్‌వ్యాగన్‌ కంపెనీ నెలకొల్పేందుకని ఆ కంపెనీ బ్రోకర్‌కు ప్రభుత్వ సొమ్ము రూ.11 కోట్లు ఇచ్చి పోగొట్టుకున్న సంఘటన వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. అంతకు రెండింతలు అడ్వాన్స్‌ ఇచ్చి పోగొట్టుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ-ఆటోల సరఫరా కోసం ఓ డీలర్‌కు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.23 కోట్ల ఎస్సీ నిధుల గురించి జగన్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని మార్గాలనూ అవలంబించింది.  వారికి పూర్తిగా బిల్లులు చెల్లించనే లేదు. అప్పటి ప్రభుత్వ హయాం చివర్లో ఓ డీలర్‌ అడ్వాన్స్‌ తీసుకుని, ప్రభుత్వం మారాక రూ.23 కోట్లు ఎగ్గొట్టినా వైసీపీ సర్కార్‌ పట్టించుకోవడం లేదు. ఆ డీలర్‌పై ఈ ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కోసం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఈ-ఆటోలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచింది. ఈ-ఆటోలను సరఫరా చేసేందుకు పుణెకు చెందిన కెనటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఆథరైజేషన్‌తో తాడేపల్లికి చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్‌ ఒప్పందం చేసుకుంది. 2018 డిసెంబరులో ఎస్సీ కార్పొరేషన్‌ వీసీ, ఎండీ తరఫున ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌, సరఫరా దారుల తరఫున ఆథరైజ్డ్‌ డీలర్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. 


ఒక్కో ఈ-ఆటో రూ.2.60 లక్షల చొప్పున మొత్తం 7500 సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు కొనుగోలు ఆర్డర్‌ను ఎస్సీ కార్పొరేషన్‌ వీసీ, ఎండీ ఇచ్చారు. వెంకటేశ్వర ట్రేడర్స్‌కు ఎస్సీ కార్పొరేషన్‌ ఐదు విడతలుగా రూ.33.11 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చింది. ఒప్పందం ప్రకారం 2019 ఫిబ్రవరిలో, వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత కూడా అదే ఏడాది జూన్‌లో రూ.12.93 కోట్ల విలువైన ఈ-ఆటోలను వెంకటేశ్వర ట్రేడర్స్‌ సరఫరా చేసింది. ఆ తర్వాత మిగిలిన ఈ-ఆటోలను సరఫరా చేయలేదు. వైసీపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఒప్పందం ప్రకారం ఈ-ఆటోలను సరఫరా చేయనందున వెంకటేశ్వర ట్రేడర్స్‌ ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.20.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. అడ్వాన్స్‌ తమ దగ్గర ఉంచుకున్నందుకు అదనంగా రూ.3.49 కోట్లు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంది. అంటే.. మొత్తంగా ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.23.56 కోట్లు చెల్లించాల్సి ఉంది. డీలర్‌ మొహం చాటేయడంతో అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకొన్నారు. ఆ డీలర్‌కు ఓ ఉన్నతాధికారి అండదండలు ఉండటంతో ప్రభుత్వ సొమ్ము రూ.23 కోట్లు ఎగ్గొట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. 


నకిలీ బ్యాంక్‌ గ్యారెంటీ.. 

ఎస్సీ కార్పొరేషన్‌తో ఒప్పందం నేపఽథ్యంలో కెనటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ నుంచి రూ.7.72 కోట్లకు గాను ఐసీఐసీఐ బ్యాంక్‌ జారీ చేసిన ఈఎండీ (ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌)ని సమర్పించారు. 2022 జనవరి 24 వరకు ఈఎండీ బ్యాంక్‌ గ్యారెంటీ గడువు ఉండేట్లు తీసుకున్నారు. బ్యాంక్‌ గ్యారెంటీ సమర్పించిన తర్వాత మొత్తం సరఫరా చేసే ఈ-ఆటోల విలువలో 25 శాతంతో పాటు రూ.1.50 కోట్ల ఈఎండీ మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించాలని ఎస్సీ కార్పొరేషన్‌కు ఆ సంస్థ లేఖ రాసింది. సంస్థ ఆథరైజ్డ్‌ డీలర్‌ వెంకటేశ్వర ట్రేడర్స్‌కు చెల్లించాలని కోరింది.  అయితే కెనటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ సమర్పించిన బ్యాంక్‌ గ్యారెంటీ నకిలీదని ఆ తర్వాత తేలింది. ఎన్ని నోటీసులిచ్చినా వెంకటేశ్వర ట్రేడర్స్‌ లెక్కచేయలేదు. నకిలీ బ్యాంక్‌ గ్యారెంటీ ఇచ్చిన డీలర్‌పై కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ఓ ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆ డీలర్‌ మంత్రులను సైతం లెక్కచేయడం లేదని తెలుస్తోంది. 


ఒప్పందం ఎందుకంటే.. 

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో చెత్తను సేకరించి, సేంద్రీయ ఎరువులు తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎస్సీ యువత కోసం ఈ-ఆటోలను కొనుగోలు చేసి వాటిని చెత్తను తరలించేందుకు గ్రామాల్లో వినియోగించాలని నిర్ణయించారు. మొత్తం7500 ఈ-ఆటోల కొనుగోలుకు జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థిక అభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ) నిధులు వాడుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో (2018 నాటివి) 13 ఈ-ఆటో సర్వీసు కేంద్రాలను ప్రారంభించాలని, భవిష్యత్తులో 42 సర్వీసు కేంద్రాలుగా విస్తరించాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో కథ మారిపోయింది.

Updated Date - 2022-06-07T09:10:53+05:30 IST