విశాఖలో 22-ఏ మాయాజాలం

ABN , First Publish Date - 2022-09-10T08:51:25+05:30 IST

విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే దసపల్లా భూములను వైసీపీ నేతల భాగస్వాములకు కట్టబెడుతున్నారు.

విశాఖలో 22-ఏ మాయాజాలం

  • రూ.2 వేల కోట్ల దసపల్లా భూములు
  • అస్మదీయులకు ఇచ్చేందుకు పావులు
  • వైసీపీ నేతల భాగస్వాములకు మేలు
  • అమరావతికి చేరుకున్న కీలక ఫైళ్లు
  • ఇప్పటికే  డెవల్‌పమెంట్‌కు ఒప్పందం
  • డెపల్‌పమెంట్‌కు ఇప్పటికే ఒప్పందం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే దసపల్లా భూములను వైసీపీ నేతల భాగస్వాములకు కట్టబెడుతున్నారు. దశాబ్దాల నుంచి కోర్టు వివాదంలో ఉన్న ఈ భూములకు సంబంధించిన కీలక ఫైళ్లను విశాఖ రెవెన్యూ అధికారులు ఇటీవలే అమరావతి పంపించారు. వాటిని అస్మదీయులకు ఇచ్చేయాలని నిర్ణయించారు. ఈ వారంలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు వస్తాయని సమాచారం. విశాఖలో ప్రభుత్వ అతిథిగృహం (సర్క్యూట్‌ హౌస్‌) పక్కనున్న రూ.రెండు వేల కోట్ల విలువైన 16 ఎకరాలను ప్రభుత్వ భూముల జాబితా 22-ఏ నుంచి తప్పిస్తున్నారు. వీటి రిజిస్ట్రేషన్లపై నిషేధం ఎత్తివేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలో చక్రం తిప్పిన వైసీపీ నేతకు దగ్గరి మనుషులుగా గుర్తింపుపొందిన ఒక వ్యాపారి, మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి (రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి) మేలు చేసేందుకు అధికారుల మెడలు వంచి ఈ పనులు చేయిస్తున్నారు.


దశాబ్దాల నుంచి వివాదంలోనే...

విశాఖపట్నం టౌన్‌ సర్వే నంబరు 1027, 1028, 1196, 1197లలో 60.03 ఎకరాలు ప్రభుత్వ రికార్డుల్లో పోరంబోకు భూములుగా నమోదై ఉన్నాయి. చెముడు జమీందారు రాణీ చంద్రమతీదేవి తనకు అవి వారసత్వంగా వచ్చాయని క్లెయిమ్‌ చేసుకున్నారు. ఆ తరువాత సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ ఆమెకు గతంలో జారీచేసిన గ్రౌండ్‌ రెంట్‌ పట్టాను రద్దు చేశారు. దాంతో 2001లో కలెక్టర్‌గా పనిచేసిన ప్రవీణ్‌ప్రకాశ్‌ ఆ భూములను  ప్రభుత్వ భూముల జాబితా 22-ఏలో చేర్చారు. అప్పటినుంచి ఆ భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. వివిధ ప్రభుత్వ సంస్థలకు అవసరాలరీత్యా 44 ఎకరాలు కేటాయించగా, అందులో ఇంకా 16 ఎకరాలు మిగిలాయి. వాటిపై చంద్రమతీదేవి హైకోర్టును ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఆమెకే ఆ భూములు దక్కుతాయని తీర్పు ఇచ్చారు. ఈలోగా కొందరు దళారులు రంగ ప్రవేశం చేసి, ఆ భూములను 300 గజాల నుంచి వేయి గజాల చొప్పున పలువురి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించేశారు.


 అయితే తప్పుడు పత్రాలు సమర్పించి ఆ భూములపై హక్కులు తెచ్చుకున్నారని, అలాంటి వాటిని ఎప్పుడైనా సవాల్‌ చేయవచ్చునని, అవి ప్రభుత్వానికే చెందుతాయంటూ 2015లో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన యువరాజ్‌ మళ్లీ ఆ భూములను 22-ఏలో చేర్చారు. దాంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం 2017లో విశాఖ భూ ఆక్రమణలపై వేసిన సిట్‌లో వీటిని కూడా చేర్చారు. దానిపై సిట్‌ సమగ్ర నివేదిక సమర్పించింది. ఆ నివేదిక సరిగ్గా లేదని, అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ మరో సిట్‌ వేసింది. ఆ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. దానిపైనా చర్యలు లేవు. సిట్‌ విచారణ జరిగినప్పుడు గుడివాడ అమర్నాథ్‌ (ప్రస్తుత ఐటీ మంత్రి) కమిటీ ముందు హాజరయ్యారు. తెలుగుదేశం నాయకుడు నారా లోకేశ్‌ దసపల్లా భూములపై లాలూచీ పడ్డారని, వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో దసపల్లా భూములను తాము కాపాడతామంటూ వైసీపీ నేతలు హామీలు గుప్పించారు. ఇప్పుడు వారే దగ్గరుండి ఆ భూములను అన్యాక్రాంతం చేయడానికి కీలక పాత్ర వహిస్తున్నారు.


డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌

వివాదంలో ఉన్న 16 ఎకరాల భూములు సుమారుగా 70 మంది చేతుల్లో ఉన్నాయి. వైసీపీ నేతల ముఖ్య అనుచరులైన ఒక వ్యాపారి, రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి వారందరినీ ఒకచోట చేర్చి, ఆ భూములపై తమకు జీపీఏ ఇస్తే...ప్రభుత్వ వివాదాలన్నీ పరిష్కరించి, అక్కడ హైరైజ్డ్‌ టవర్స్‌ నిర్మిస్తామని, అందులో వాటా ఇస్తామని ఆశ చూపించారు. ఈ వివాదాలు ఎప్పటినుంచో ఉండడంతో వారంతా ఆ ఒప్పందానికి తల వంచారు. దాంతో కొత్తగా ఎస్యూర్డ్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ పేరుతో కొత్త కంపెనీ తెరిచి, డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ చేశారు. దీనిని రిజిస్టర్‌ చేయాల్సిందిగా ఏడాది క్రితం అధికారులపై ఒత్తిడి పెట్టారు. సబ్‌ రిజిస్ట్రార్లు ముందు పెండింగ్‌లో పెట్టి, ఆ తరువాత తిరస్కరించారు. దాంతో ఆ ఇద్దరు పెద్దలు జిల్లా రిజిస్ట్రార్‌కు అప్పీల్‌ చేశారు. ప్రస్తుతం ఫైల్‌ అక్కడే ఉంది. మరోవైపు 22-ఏ జాబితా నుంచి ఆ సర్వే నంబర్లను తప్పించడానికి అమరావతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ వాటిని తప్పించగానే, ఇక్కడ డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు జిల్లా రిజిస్ట్రార్‌ సిఫారసు చేసేలా ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. 

 

సీబీఐ విచారణ చేయించాలి: ఈఏఎస్‌ శర్మ

దసపల్లా భూములు పూర్తిగా ప్రభుత్వానికే చెందుతాయని, వాటిలో ప్రజలకు వాటా ఉందని, వాటిని అన్యాక్రాంతం చేయడం తగదంటూ ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ గతంలో చాలాసార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు. భూముల బాగోతంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, అప్పుడే వాస్తవాలన్నీ బయట పడతాయంటూ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీకి గురువారం లేఖ రాశారు. 

Updated Date - 2022-09-10T08:51:25+05:30 IST