అనుభవించు..రాజా!

ABN , First Publish Date - 2022-08-17T09:07:03+05:30 IST

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అభివృద్ధి శూన్యం. దారుణంగా దెబ్బతిన్న రోడ్లపై మట్టితో గుంతలు పూడ్చడానికి డబ్బులు కూడా లేవు.

అనుభవించు..రాజా!

  • సర్కారు జేబు నుంచి 
  • అధికారుల జల్సాలు
  • స్టార్‌ హోటళ్ల నుంచి కాఫీ, టీ, భోజనాలు
  • ముగ్గురు అధికారుల బిల్లు రూ.32 వేలు
  • ఒక్క కాఫీ రూ.860.. భోజనం రూ.5 వేలు
  • 2 ఇడ్లీ, వడ, దోసెకు రూ.1500 ఖర్చు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అభివృద్ధి శూన్యం. దారుణంగా దెబ్బతిన్న రోడ్లపై మట్టితో గుంతలు పూడ్చడానికి డబ్బులు కూడా లేవు. అంతెందుకు....ఉద్యోగులు శుభకార్యాలు, ఇతర అవసరాల కోసం దాచుకున్న పీఎఫ్‌ నిధులకు కూడా దిక్కూదివానం లేదు. ఎప్పుడు ఎటునుంచి ఎలా బాదేస్తారో తెలియక నిత్యం జనం గుండెలు గుభేల్‌. కానీ ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు చూస్తే అంతా జిగేల్‌. అనుభవించు రాజా అంటూ కొందరు అధికారులు జల్సా జీవితాలను గడుపుతున్నారు. కేవలం ఒక్క రోజులో మూడు వేల రూపాయల కాఫీలు, ఐదు వేల రూపాయల భోజనాలు, రెండు వేల రూపాయల స్నాక్స్‌, ఇలా ఒకటేమిటి ఏ చిన్న అవసరమయినా సర్కారీ నిధులను సాంతం నాకేస్తున్నారు. ప్రభుత్వం ఐఏఎ్‌సలకు, వారి కింద పనిచేస్తోన్న గ్రూప్‌-1 అధికారులకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బుతోనే జీతాలు చెల్లిస్తోంది. తిరగడం కోసం ఖరీదైన వాహనాలు సమకూరుస్తోంది. వారిస్థాయికి తగినట్లుగా హెచ్‌ఆర్‌ఏ (ఇంటిఅద్దె) చెల్లిస్తోంది. ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు, సమావేశాలు జరిగే సమయంలో టీ, కాఫీ, స్నాక్స్‌, భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. 


ఆఫీసు నిర్వహణ పేరిట ప్రతీ శాఖకు సర్కారు బడ్జెట్‌ కేటాయిస్తుంది. అధికారులు కూడా అవసరాన్ని బట్టి నాణ్యత, శుచి,శుభ్రతను పాటించే మంచిపేరున్న హోటల్స్‌ నుంచి ఆహారం, స్నాక్స్‌ తెప్పించుకుంటారు. లేదా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. సచివాలయం అయితే, స్థానికంగా ఉన్న క్యాంటిన్‌ నుంచే తెప్పించుకుంటారు. ఇక కొందరయితే భోజనాలు, టీలు, కాఫీలు కూడా ఇంటినుంచే ప్రత్యేకంగా తెప్పించుకుంటారు. కానీ కొందరు అధికారులు ఉన్నారు. వారు తాము పైనుంచి దిగొచ్చినట్లుగా భావిస్తూ స్టార్‌ హోటళ్ల నుంచే కాఫీ, టీ, స్నాక్స్‌, టిఫిన్స్‌, భోజనాలు తెప్పించుకుంటున్నారు. విజయవాడలోని నోవాటెల్‌, తాజ్‌ వివాంత, డీవీమానర్‌ వంటి స్టార్‌ హోటళ్లే వారికి ప్రియమైనవి. సందర్భం ఏదైనా సరే అక్కడి నుంచి ఖరీదైనపార్సిల్స్‌ రావాల్సిందే. గత రెండున్నరేళ్లకాలంలో ఈ విధానం మరీ శ్రుతి మించిపోయింది. అయితే ఎక్కడా అధికారికంగా తమ పేరిట లేక శాఖ తరపున  బిల్లులు పెట్టరు. తెలివిగా తమ కింద పనిచేసే జేడీ లేదా వారి కింద పనిచేసే సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, క్లర్క్‌ల పేరిట చెక్‌లు ఇస్తారు. ఆ చెక్‌లను డ్రా చేసి ఇలాంటి రాజపోషణకు వాడుకుంటున్నారు. 


‘మీ సేవ’ నిధుల వినియోగాన్ని పరిశీలిస్తే సర్కారు సొమ్మును పాకెట్‌మనీ కింద ఎలా వాడుకోవచ్చో ఓ అధికారి నిరూపించారు. ఇటీవల ఓ అధికారి కార్యాలయంలో రీ సర్వేపై సమావేశం జరిగింది. ఓ సీనియర్‌ ఐఏఎస్‌, మరో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆ భేటీకి హాజరయ్యారు. నోవాటెల్‌ నుంచి  ముగ్గురు అధికారులకు స్నాక్‌లు, కాఫీ, భోజనాలు, పండ్లరసాలు తెప్పించారు. ఇందుకు అయిన ఖర్చు రూ.32వేలు. ఒక్క భోజనం ఖరీదు 5వేల రూపాయలు. కాఫీ 860 రూపాయలు. 4 కాఫీలకు కలిపి 3,440. రెండు ఇడ్లీలు, రెండు వడలు, ఒక దోశతో కూడిన టిఫిన్‌ ఖర్చు రూ.1500. ఈ ఖర్చును ఓ చిరుద్యోగితో పెట్టించారు. త ర్వాత రూ.37వేలకు చెక్‌ ఇప్పించారు. అది కూడా ‘మీ సేవ’ నిధులనుంచే! ఇందులో రూ. 5వేలు మరో అధికారి కమీషన్‌ కింద వెళ్లిపోయింది. గత నెలలో విజయవాడలోని ఓ అతిధిగృహంలో నలుగురు అధికారులు సమావేశమయ్యారు. పిచ్చాపాటిగా మాట్లాడుకునేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు వారు అక్కడే ఉన్నారు. టిఫిన్‌లు, కాఫీలు, భోజనాలు, ఇతర ఏర్పాట్లు చేశారు. ఓ సర్వే అధికారి వారికి తాజ్‌ వివంతా నుంచి ఫుడ్‌ తెప్పించారు. ఆ రోజయిన ఖర్చు 45వేలు. ఇక్కడా సేమ్‌. రెండ్రోజుల ముందే ఓ ఉద్యోగి పేరిట చెక్‌ ఇచ్చి డ్రా చేసి వాడేసినట్లు తెలిసింది. సీఎం ఆగ్రహానికి గురయి ముఖ్యమైన పోస్టింగ్‌ను కోల్పోయిన ఓ అధికారి అమరావతిలో ఉన్నప్పుడు విజయవాడలోని గెస్ట్‌హౌ్‌సలో మకాంవేసేవారు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు రాత్రి డిన్నర్‌, ఉదయం బ్రేక్‌ఫా్‌స్టలు తాజ్‌ వివాంత (ఇంతకు ముందు గేట్‌వేగా ఉండేది) నుంచి పంపించేవారు. ఓ సర్వే అధికారి కూడా అక్కడే ఉండటం పరిపాటిగా కొనసాగింది. ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ పేరిట చెక్‌లు ఇచ్చి ‘మీ సేవ’ నిధులనుంచి సొమ్ము డ్రా చేసి బిల్లులు చెల్లించారని తెలిసింది. 


చాంబర్‌లోకి మద్యం

చివరకు ఓ అధికారి మందు సరఫరా చేసే స్థాయికి దిగజారిపోయాడన్న చర్చ సాగుతోంది. ఓ సీనియర్‌ అధికారికి మద్యం అలవాటు ఉందని తెలిసి, ఆయన ఇష్టపడే బ్రాండ్‌ను అందించి ప్రసన్నం చేసుకోవాలనుకున్నారట. ఈ మేరకు అత్యంత ఖరీదైన మద్యం తెలంగాణ నుంచి తెప్పించి ప్రత్యేకమైన గిఫ్ట్‌ప్యాక్‌చేయించి తన డ్రైవర్‌ ద్వారా పంపించారు. అది చూసిన అధికారి ఫైర్‌ అయ్యారు. ఇలాంటి చెత్తపనులు చేస్తారా అని బాగా తిట్టిపంపించారని తెలిసింది. ఇంతేనా...దసరా, సంక్రాంతి, ఉగాది, రంజాన్‌, ఆగస్టు 15, జనవరి 26 వంటి ప్రత్యేక పర్వదినాలు వస్తే గిఫ్ట్‌లు, ఖర్చులకు కొదవే ఉండదు. ఏ అధికారికి ఏం ఇష్టమో ముందుగానే తెలుసుకొని వాటిని కొనుగోలు చేసి గిఫ్ట్‌లుగా అందిస్తారు. ఇదంతా కూడా వారి జీతం నుంచో, సొంత సొమ్మునుంచే ఖర్చుపెట్టడం లేదు. ప్రభుత్వ సొమ్మునే వాడుకుంటున్నారు. వీటిలో ఏ ఒక్కటీ బిల్లుల రూపంలో రికార్డుల్లో కనిపించదు. రికార్డుల్లో కనిపించేదల్లా... ఫలానా ఉద్యోగి పేరిట చెక్‌ జారీ చేయడమే. 

Read more