కొండంత పోరాటం!

ABN , First Publish Date - 2022-10-12T09:07:25+05:30 IST

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎర్రగుడి, యనకండ్ల, హుసేనాపురం పరిధిలోని దాదాపు 132 హెక్టార్ల కొండ అది. ఈ మూడు గ్రామాలకు చెందిన పశువులు మేత కోసం అక్కడికే వెళతాయి. అందువల్లే మహా

కొండంత పోరాటం!

సిమెంట్‌ ఫ్యాక్టరీకి 132 హెక్టార్ల కొండ

లీజుకిచ్చేలా వైసీపీ నేతల పావులు

ఎదురుతిరుగుతున్న మూడు గ్రామాలు

నేడు బనగానపల్లెలో ప్రజాభిప్రాయసేకరణ


(నంద్యాల, ఆంధ్రజ్యోతి) 

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎర్రగుడి, యనకండ్ల, హుసేనాపురం పరిధిలోని దాదాపు 132 హెక్టార్ల కొండ అది. ఈ మూడు గ్రామాలకు చెందిన పశువులు మేత కోసం అక్కడికే వెళతాయి. అందువల్లే మహా సిమెంటు ఫ్యాక్టరీకి ఆ కొండను లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు అంగీకరించడంలేదు. వైసీపీ నాయకులు కొండను లాగేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మూడేళ్లుగా ఎదురుతిరుగుతున్నారు. ఈక్రమంలో గత జూలైలో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా, మూడు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో తిరస్కరించారు. తెగించి వైసీపీ నేతలతో ఘర్షణకు దిగగా, అప్పట్లో 25మందిపై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం బనగానపల్లెలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధమైంది. ఈసారి ఎలాగైనా కొండను ఫ్యాక్టరీకి అప్పగించాలన్న పట్టుదలతో వైసీపీ నేతలు పావులు కదుపుతున్నట్టు సమాచారం.


ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రాంతానికి ఇప్పటికే పోలీసులు భారీగా చేరుకున్నారు. గొడవలు చేయడానికి వీల్లేదంటూ ప్రతి ఇంటికీ నోటీసులిచ్చారు. అయితే.. ప్రాణాలైనా ఇస్తాం... కొండను కాపాడుకుంటామని స్థానికులు అంతేగట్టిగా చెబుతున్నారు. దీంతో బనగానపల్లె ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. వివరాల్లోకి వెళితే.. బనగానపల్లె మండలంలోని ఇతర పంచాయతీలతో పోల్చుకుంటే ఎర్రగుడి, యనకండ్ల, హుసేనాపురం గ్రామాలకు నీటి వసతి తక్కువ. వర్షాధార పంటలతో గిట్టుబాటు కాకపోవడంతో ప్రతి కుటుంబమూ పాడి పశువులు, జీవాలను నమ్ముకుని జీవనం సాగిస్తోంది. ఈ మూడు గ్రామాల్లో పశువులు ఆరు వేలు, జీవాలు 20వేలు.. వెరసి 26 వేలకు పైగా ఉన్నాయి. వీటన్నింటికీ కొండే ఆధారం. అందుకే వైసీపీ నేతల సహకారంతో కొండను దక్కించుకోవాలని చూస్తున్న స్థానిక మహా సిమెంటు ఫ్యాక్టరీ ప్రయత్నాలకు ఎదురు తిరుగుతున్నారు. తొలుత ‘జయజ్యోతి’ పేరిట యనకండ్లలో సిమెంటు ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ఆ తర్వాత దీనిని మహా సిమెంటు యాజమాన్యం సొంతం చేసుకుంది. ఈ ఫ్యాక్టరీకి దాదాపు 2,500 ఎకరాల్లో మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ప్రాంతంలో నుంచి తవ్వుకునే సున్నపురాయి ద్వారా వచ్చే 70, 80 ఏళ్ల వరకు ఫ్యాక్టరీకి అవసరమైన ముడి సరుకు లభిస్తుంది. ఈ మూడు గ్రామాల్లోని 132 హెక్టార్ల కొండ దక్కించుకోకపోతే ఫ్యాక్టరీకి ఇప్పటికిపుడు వచ్చే నష్టం ఏమీ లేదు.


అయినా ఫ్యాక్టరీ యాజమాన్యం కొండను దక్కించుకునేందుకు ఇంతలా పట్టు పడుతుండటం వెనుక ఏమైనా మతలబు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కొండను సిమెంట్‌ ఫ్యాక్టరీకి లీజ్‌కు ఇస్తే ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని యనకండ్ల సర్పంచ్‌ వరలక్ష్మి స్పష్టం చేశారు. ‘‘గత ప్రజాభిప్రాయ సేకరణలో ఇదే విషయం చెప్పాం. బుధవారం నాటి సమావేశంలో కూడా ఇదే చెబుతాం. కొండను మానుంచి లాగేసుకోవాలని చూస్తే పోరాటాలకు సిద్ధమవుతాం’’ అని హెచ్చరించారు. 

Updated Date - 2022-10-12T09:07:25+05:30 IST