రైతు బీమా స్వాహాపై విచారణ

ABN , First Publish Date - 2021-07-24T08:01:49+05:30 IST

మహిళా రైతు బతికుండగానే చనిపోయినట్లు నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో రూ. 5 లక్షలు రైతు బీమా స్వాహా చేసిన ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. శుక్రవారం గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు

రైతు బీమా స్వాహాపై విచారణ

పుట్టపహాడ్‌ ఏఈవో సస్పెన్షన్‌ 

టీఆర్‌ఎస్‌ నేత రాఘవేందర్‌రెడ్డిపై కేసు నమోదు

ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన టీఆర్‌ఎస్‌ 

కులకచర్ల/పరిగి, జూలై 23: మహిళా రైతు బతికుండగానే చనిపోయినట్లు నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో రూ. 5 లక్షలు రైతు బీమా స్వాహా చేసిన ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. శుక్రవారం గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ ఘటనలో ఏఈవోను సస్పెండ్‌ చేశారు. వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం పుట్టపహాడ్‌ గ్రామానికి చెందిన చంద్రమ్మ చనిపోయినట్లుగా టీఆర్‌ఎస్‌ నేత బి.రాఘవేందర్‌రెడ్డి ఫోర్జరీ పత్రాలు సృష్టించడంపై ‘బతికుండగానే చంపేశారు!’.. శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌.. సంబంధీకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌కు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. డీఏవో.. కొడంగల్‌ ఏడీఏ వినయ్‌కుమార్‌తో కలిసి పుట్టపహాడ్‌లో విచారణ జరిపారు. రాఘవేందర్‌రెడ్డి.. రైతు బీమా డబ్బు స్వాహా చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. 


ఈ మేరకు కులకచర్ల ఏఈవో ఎంఏ సత్తార్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఏవో శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఏవో వీరస్వామి ఫిర్యాదు మేరకు.. బి.రాఘవేందర్‌రెడ్డి, చంద్రమ్మ కుమారుడు బాలయ్యపై కేసు నమోదు చేసినట్లు కులకచర్ల ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు. గ్రామ కార్యదర్శి, మరో వ్యవసాయాధికారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా, తన ఇంట్లో పనిచేసే దళిత మహిళ చంద్రమ్మ పేరిట డబ్బు కాజేసిన రాఘవేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌తో కులకచర్లలో కాంగ్రెస్‌ నేతలు ధర్నా చేశారు. చంద్రమ్మతో కలిసి బీజేపీ నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు రాఘవేందర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు.  రైతు సమన్వయ సమితి గ్రామ కో-ఆర్డినేటర్‌ పదవి నుంచి కూడా తొలగించారు.

Updated Date - 2021-07-24T08:01:49+05:30 IST