నగరంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’

ABN , First Publish Date - 2021-12-15T05:38:02+05:30 IST

నగరంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’

నగరంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’

 సందడి చేసిన నాని, సాయిపల్లవి, కృతిశెట్టి

 చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన మంత్రి ఎర్రబెల్లి

హనుమకొండ కల్చరల్‌, డిసెంబరు 14 : హీరో నాని నటించిన తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం మంగళవారం సుబేదారిలోని ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌లో ఘనంగా జరిగింది. హీరో నాని,  హీరోయిన్లు సాయిపల్లవి, కృతిశెట్టి హాజరైన ఈ  వేడుకను తిలకించేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చారు.  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిర్మాత దిల్‌ రాజు ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. యాంకర్‌ సుమ వ్యాఖ్యానంతో కార్యక్రమం ఆద్యంత్యం ఆకట్టుకుంది. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే వరంగల్‌లో సినిమా పరిశ్రమ విస్తరిస్తోందని, రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.  శ్యాం సంగరాయ్‌ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.  అనంతరం హీరోయిన్లు సాయిపల్లవి, కృతిశెట్టి ‘హాయ్‌ వరంగల్‌ ..’ అంటూ ప్రేక్షకులను పలకరించారు. హీరో నాని మాట్లాడుతూ.. వరంగల్‌ ప్రేక్షకులంటే తనకు ఎంతో ఇష్టమని,  ఇక్కడికి రావడం ఇది నాలుగో సారి అని అన్నారు. కాగా, కార్యక్రమానికి ముందు డ్యాన్సర్లు పలు సినిమా పాటలకు డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.  హీరో నాని, హీరోయిన్‌ సాయి పల్లవి మాట్లాడుతున్నంత సేపు ప్రేక్షకులు ఈలలు వేసి వారిని ఉత్సాహపరిచారు.

 నాని నుంచి వస్తున్న తొలి పాన్‌ ఇండియా స్థాయి చిత్రం ఇది. టాక్సీవాలా ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయినపల్లి నిర్మించారు. హీరోయిన్స్‌గా సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ ఇందులో నటించారు. సత్యదేవ్‌ కథ అందించిన  ఈ చిత్రంలో రాహుల్‌ రవీంద్రన్‌, మురళీ శర్మ, జిషా సేన్‌ గుప్తా, బాబీ షామ్సన్‌, మనీష్‌ వాద్వా, బారున్‌ చందా, అభినవ్‌ గోమారం కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఈనెల 24న విడుదల కాబోతోంది.   

Updated Date - 2021-12-15T05:38:02+05:30 IST