తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2021-11-21T05:47:27+05:30 IST

తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ

తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ

చేవెళ్ల: ఇంటికి తాళంవేసి బంధువుల ఇంటికి విందుకు వెళ్లి వచ్చే సరికి ఇళ్లుగుల్లయింది. పక్కఇళ్ల వారు బయటకు రాకుండా వారి ఇళ్లకు గడియపెట్టి తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన చేవెళ్లలోని వీరభధ్రకాలనీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ విజయ్‌భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని వీరభద్ర కాలనీలో ఉరేళ్లకు చెందిన రాములుకు ఐదు ఫ్లోర్ల సొంత ఇల్లు ఉంది. అతడు కింది ఫ్లోర్‌లో నివసిస్తుండగా పైవాటిని అద్దెకు ఇచ్చాడు. శుక్రవారం రాత్రి బంధువుల ఇంట్లో పూజ(నోములు) ఉంటే రాత్రి 8గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులంతా వెళ్లారు. అద్దెకు ఉన్న వారు ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలో తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు అద్దెకు ఇచ్చిన ఫోర్లలోని ఇళ్లకు బయటి నుంచి గడియపెట్టి తాళం వేశారు. అనంతరం రాములు ఇంటి తాళం పగులగొట్టి  ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లో ఉన్న డ్రెసింగ్‌ టేబుల్‌డ్రాలో ఉన్న 24తులాల బంగారు ఆభరణాలు, అల్మారాలో ఉన్న 15తులాల వెండి, రూ.2లక్షల నగదును దోచుకెళ్లారు. శనివారం తెల్లవారు జామున 5గంటలకు రాముల ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓవ్యక్తి ఫోన్‌ చేసి బయట గడియపెట్టారు తీయమని చెప్పాడు. ఇలా మిగతా ఫ్లోర్లలోని వారూ తమ ఇంటికీ గడియ పెట్టారని చెప్పారు. దీంతో వెంటనే రాములు బంధువుల ఇంటి నుంచి హుటాహుటిన చేవెళ్లకు వచ్చాడు. తన ఇంటికి వేసిన తాళం పగిలి ఉండగా లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడిఉన్నాయి. దీంతో రాములు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు క్లూస్‌టీంతో చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-11-21T05:47:27+05:30 IST