లక్ష్యానికి చేరువ

ABN , First Publish Date - 2021-11-28T05:52:53+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు లక్ష్యానికి జిల్లా చేరువైంది. ఇప్పటివరకు 96శాతం మందికి మొదటి డోసు, 61శాతం మందికి రెండో డోసు పూర్తయింది.

లక్ష్యానికి చేరువ

 పూర్తి కావొస్తున్న వ్యాక్సినేషన్‌ 

 జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ 8లక్షల డోసులు 

 మొదటిడోసు 5.1లక్షలు, రెండో డోసు 2.99లక్షలు

 జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన వారు 5,23,068 మంది 


భువనగిరిటౌన్‌, నవంబరు 27: కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు లక్ష్యానికి జిల్లా చేరువైంది. ఇప్పటివరకు 96శాతం మందికి మొదటి డోసు, 61శాతం మందికి రెండో డోసు పూర్తయింది. జిల్లాలో 18 ఏళ్లు పైబడిన వారు 5,23,068 మంది ఉన్నారు. ఈ నెల 23వ తేదీ నాటికి మొదటి డోసు 5.1లక్షల మార్కు దాటగా, రెండో డోసు 2.99లక్షల మందికి పూర్తయింది. స్థూలం గా 8.1లక్షల మంది పైచిలుకు వ్యాక్సినేషన్‌ పూర్తయింది. కనీసం 95శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలనే లక్ష్యాన్ని జిల్లా అధికారులకు నిర్దేశించారు. కాగా త్వరలో 2-18 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభంకానుండగా, ఈ కేటగిరిలో 2,66,600 మందిని అధికారులు గుర్తించారు.


25 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్‌

జిల్లాలో ఈ ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. తొలుగ హెల్త్‌కేర్‌ వర్కర్స్‌, ఫ్రెంట్‌లైన్‌ వారియర్స్‌కు మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు. అనంతరం 45 ఏళ్లుపైబడిన వారికి వ్యాక్సిన్‌ ప్రారంభించినా, అవగాహనారాహిత్యంతో అర్హులు చాలా మంది దూరంగా ఉన్నారు. అనంతరం వ్యాక్సిన్‌పై అవగాహన పెరగడంతో డోసుల కొరత ఏర్పడింది. ఆ తరువాత పరిస్థితి చక్కబడగా, ప్రస్తుతం జిల్లాలో మొత్తం 25 కేంద్రాల ద్వారా నిరంతరాయంగా వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లావ్యాప్తంగా వ్యాక్సిన్‌ శిబిరాలు నిర్వహిస్తున్నారు. కిందిస్థాయి సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ అర్హులను గుర్తించి శిబిరాలకు రప్పించి టీకాలు ఇస్తున్నారు. దీంతో వ్యాక్సినేషన్‌ శాతం పెరగ్గా, ఇటీవల కరోనా కేసులు సైతం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో 421 గ్రామపంచాయతీలకు 360 గ్రామాల్లో 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. కాగా, 102 మునిసిపల్‌ వార్డులకు కేవలం 27వార్డులు మాత్రమే నూరు శాతం వ్యాక్సిన్‌ లక్ష్యాన్ని సాధించాయి. జిల్లాలో ఇప్పటివరకు 6,32,531 కరోనా నిర్ధారణ నిర్వహించగా, 32,982 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 32,777 మంది డిచార్జి కాగా, ప్రస్తుతం 39 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా కారణంగా ఇప్పటివరకు 169 మంది మృతి చెందారు.


సమష్టి కృషితోనే సాధ్యమైంది :  డాక్టర్‌ జి.సాంబశివరావు, డీఎంహెచ్‌వో 

సమష్టి కృషితోనే జిల్లాలో మొదటి డోసు 96శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేశాం. ఉన్నతాధికారుల ప్రోత్సాహం, సహకారంతోపాటు వైద్యఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, అన్ని స్థాయిల సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించడంతోనే లక్ష్యాని కి చేరువయ్యాం. అలాగే వ్యాక్సినేషన్‌ శిబిరాల నిర్వహణకు స్థానిక  సంస్థల ప్రజాప్రతినిధులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. ఇప్పటివరకు రెండో డోసుకు తీసుకొని అర్హులు వెంటనే సమీప కేంద్రాల్లో వ్యాక్సిన్‌ తీసుకోవాలి. కరోనా తగ్గుముఖం పట్టినా జాగ్రత్తలను మాత్రం ప్రజలు విస్మరించవద్దు.

Updated Date - 2021-11-28T05:52:53+05:30 IST