చివరి దశకు యూజీడీ పనులు

ABN , First Publish Date - 2021-12-20T04:44:35+05:30 IST

అమృత్‌ పథకంలో భాగంగా మంజూరైన కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో సిద్దిపేట పట్టణంలో చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ(యూజీడీ) నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

చివరి దశకు యూజీడీ పనులు
సిద్దిపేట పట్టణంలోని యూజీడీలో భాగంగా నిర్మించిన మ్యాన్‌హోల్‌ నుంచి బయటకు వస్తున్న మురుగు నీరు

 నాలుగేళ్లలో 85 శాతం పూర్తి

 ఇంటింటికీ అనుసంధానంతో కొంత ఆలస్యం

 అస్తవ్యస్తంగా మారిన కాలనీ సీసీ రోడ్లు

సిద్దిపేట టౌన్‌, డిసెంబరు 19: అమృత్‌ పథకంలో భాగంగా మంజూరైన కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో సిద్దిపేట పట్టణంలో చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ(యూజీడీ) నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పనులను ప్రారంభించి నాలుగేళ్లవుతుండగా ఎట్టకేలకు పూర్తవుతున్నాయి. అయితే ఇప్పటికే పూర్తయిన యూజీడీ పనులతో ఆయా వీధుల్లో రోడ్లన్నీ పాడవడంతో కాలనీవాసులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

324 కిలోమీటర్ల మేర నిర్మాణం

సిద్దిపేట పట్టణానికి నలువైపులా నుంచి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.278 కోట్ల వ్యయంతో 324 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 85శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. మిగతా 15 శాతం పనుల్లో కొంత ఆలస్యం నెలకొన్నది. పట్టణంలోని 43 వార్డులకు 39 వార్డుల్లో పనులు పూర్తవ్వగా మిగతా వార్డుల్లో వివిధ కారణాలతో నెమ్మదిగా కొనసాగుతున్నాయి. పూర్తయిన చోట ప్రతీ ఇంటికి యూజీడీని అనుసంధానం చేస్తున్నారు. ఈ పనుల్లోనూ కొంత ఆలస్యం నెలకొన్నది. పట్టణంలోని 43 వార్డుల్లో 22,400 ఇళ్లకు కనెక్షన్లకు గాను 19,400 ఇళ్లను యూజీడీకి అనుసంధానం చేశారు. ఇంకా 3 వేల ఇళ్లకు అనుసంధానం చేయాల్సి ఉంది. యూజీడీ పనుల్లో భాగంగా రెండు సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు (ఎస్‌టీపీ)లను అధికారులు నిర్మించారు. వీటిలో చింతల్‌చెరువు వద్ద రూ.8 కోట్లతో 7.25 ఎంఎల్‌డీ, నర్సాపూర్‌ చెరువు వద్ద రూ.12.54 కోట్లతో, 11 ఎంఎల్‌డీ సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నిర్మించారు. 16 వార్డులకు చెందిన మురుగు నీరు చింతల్‌చెరువు ఎస్‌టీపీ వైపు, 21 వార్డులకు చెందిన మురుగు నీరు నర్సాపూర్‌ ఎస్‌టీపీకి వెళ్లేలా చేస్తున్నారు. ఈ మురుగు నీటిని ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేసి ఈ చెరువుల్లోకి విడుదల చేస్తారు. అయితే యూజీడీ పనులతో పట్టణంలోని కాలనీల్లో సీసీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పైపులైన్‌ వేసిన చోట సిమెంట్‌తో ప్యాచ్‌వర్క్‌ చేసినా, ఇటీవల కురిసిన వర్షానికి అది కూడా దెబ్బతిన్నది. అధికారులు పనులు వేగవంతంగా పూర్తి చేసి, కాలనీల్లో కొత్త సీసీ రోడ్లు వేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.



మరో 3 నెలల్లో పూర్తి చేస్తాం

-రమణాచారి, మున్సిపల్‌ కమిషనర్‌, సిద్దిపేట

సిద్దిపేట పట్టణంలో నిర్మిస్తున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు మరో 3 నెలల్లో వందశాతం పూర్తి చేస్తాం. ఇప్పటికే పట్టణంలోని పలు వార్డుల్లో ట్రయల్‌ రన్‌ చేశాం. చింతల్‌ చెరువు వద్ద నిర్మించిన ఎస్‌టీపీ ప్లాంట్‌ వద్ద మురుగు నీటిని శుద్ధి చేశాక చెరువులోకి నీటిని విడుదల చేస్తున్నాం. అక్కడక్కడా మ్యాన్‌హోల్‌ నుంచి మురుగు నీరు బయటకు వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఆ సమస్యలను పరిష్కరిస్తాం. యూజీడీ పూర్తయ్యాక రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణం మరింత అందంగా, శోభామమానంగా రూపుదిద్దుకుంటుంది.


పట్టణ ప్రజల సహకారంతోనే...

సిద్దిపేట పట్టణ ప్రజల కోసం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాం. నాలుగేళ్ల నుంచి ప్రజలు ఎంతో సహకరించారు. రాబోయే రోజుల్లో పట్టణం ఆరోగ్య సిద్దిపేటగా మారనుంది. ఇప్పటికే చింతల్‌ చెరువు వద్ద ఎస్‌టీపీ ప్లాంట్‌ను నిర్మించుకున్నాం. మరొక ఎస్‌టీపీ ప్లాంటును నర్సాపూర్‌ చెరువు వద్ద నిర్మించుకుంటున్నాం. వచ్చే ఏడాది జనవరిలో ఆ ప్లాంటును ప్రారంభించుకునేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాను. త్వరలోనే మిగతా వార్డుల్లో యూజీడీ పనులు పూర్తవుతాయి. దోమలు, ఈగలు రాకుండా, వర్షపు నీరు రోడ్లపై చేరకుండా మ్యాన్‌హోల్స్‌ ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకున్నాం.

-హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి




Updated Date - 2021-12-20T04:44:35+05:30 IST