పని చేసినా ర్యాంకు రాలేదు!

ABN , First Publish Date - 2021-11-22T04:52:11+05:30 IST

మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ, శాఖల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి స్వచ్ఛసర్వేక్షణ్‌ పోటీకి శ్రీకారం చుట్టింది. ప్రతీ ఏడాది ఆయా విభాగాల్లో అధికారుల పనితీరును బట్టి ర్యాంకులు ప్రకటిస్తుంటారు. పారిశుధ్యం, తడిపొడిచెత్త సేకరణ, నీటి సరఫరా తదితర విభాగాలను క్షేత్రస్థాయిలో నిపుణుల కమిటీ తనిఖీ చేస్తుంటారు. 2021 సవంత్సరానికిగాను దక్షిణ భారతదేశంలో 319 మున్సిపాలిటీల పనితీరును పరిశీలించారు.

పని చేసినా ర్యాంకు రాలేదు!

స్వచ్ఛసర్వేక్షణ్‌లో దిగజారిన మెదక్‌ మున్సిపాలిటీ స్థానం

గతేడాది ర్యాంకు 24.. ఈసారి 27వ స్థానం!

మెరుగుపడిన పారిశుధ్య నిర్వహణ

చేసిన పని నమోదు చేయడంలో నిర్లక్ష్యం

మూడు స్థానాలు దిగజారిన ర్యాంకు


మెదక్‌ మున్సిపాలిటీ, నవంబరు 21: మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ, శాఖల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి స్వచ్ఛసర్వేక్షణ్‌ పోటీకి శ్రీకారం చుట్టింది. ప్రతీ ఏడాది ఆయా విభాగాల్లో అధికారుల పనితీరును బట్టి ర్యాంకులు ప్రకటిస్తుంటారు. పారిశుధ్యం, తడిపొడిచెత్త సేకరణ, నీటి సరఫరా తదితర విభాగాలను క్షేత్రస్థాయిలో నిపుణుల కమిటీ తనిఖీ చేస్తుంటారు. 2021 సవంత్సరానికిగాను దక్షిణ భారతదేశంలో 319 మున్సిపాలిటీల పనితీరును పరిశీలించారు. జిల్లాకేంద్రమైన మెదక్‌ మున్సిపాలిటీలోనూ రెండు నెలల క్రితం కేంద్ర బృందం సర్వే చేపట్టింది. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో మెదక్‌ మున్సిపాలిటీకి 27వ ర్యాంకును ప్రకటించారు. 


గత సంవత్సరం కంటే తక్కువ

ఈ సంవత్సరం స్వచ్ఛసర్వేక్షణ్‌ ర్యాంకుల్లో మెదక్‌ మున్సిపాలిటీ ఈ ఏడాది మూడు స్థానాలు దిగజారింది. గతేడాది దేశవ్యాప్తంగా 24వ ర్యాంకు, రాష్ట్రంలో 6వ ర్యాంకు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి దేశస్థాయిలో మూడు స్థానాలు దిగజారి 27వ ర్యాంకు సాధించగా.. రాష్ట్ర స్థాయిలోనూ 10వ స్థానానికి దిగజారింది. గత సంవత్సరందో పోల్చితే ఆయా విభాగాల పనితీరుపై నిపుణుల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. జిల్లాకేంద్రంలో 32 వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చేందుకు ఈ సంవత్సరం కొత్తగా ట్రాక్టర్లు, ఆటోలు కొనుగోలు చేశారు. అదనపు సిబ్బందిని నియమించారు. కానీ లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోయారు. చెత్త శుద్ధీకరణ, మురుగు, మానవ వ్యర్థాల శుద్ధీకరణలో బల్దియా వెనుకంజలో ఉంది. ఇంత కష్టపడినా ర్యాంకు దిగజారడంపై పాలకవర్గం అసంతృప్తిగా ఉన్నది.


చేసిన పనులనూ ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు

: శ్రీహరి, మున్సిపల్‌ కమిషనర్‌, మెదక్‌

మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య సేవలు మెరుగుపడ్డాయి. కానీ క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులను స్వచ్ఛసర్వేక్షణ్‌ యాప్‌లో నమోదు చేయడంలో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చేసిన పనులను కూడా నమోదు చేయకపోవడంతో యాప్‌లో మార్కులు తక్కువ వచ్చాయి. అందుకే ర్యాంకు తక్కువగా వచ్చింది.

Updated Date - 2021-11-22T04:52:11+05:30 IST