భూముల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

ABN , First Publish Date - 2021-03-25T03:52:48+05:30 IST

నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన భూముల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అధికారులను ఆదేశించారు.

భూముల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
కర్వెనలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు

భూత్పూర్‌, మార్చి 24: నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన భూముల అభివృద్ధిపై  ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం మండ లంలోని కర్వెనలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములను ఆయన పరిశీలించారు.  భూ పంపిణీ పథకం కింద ప్రభుత్వం కర్వెన గ్రామానికి చెందిన 26 మంది రైతులకు 2014-15న 75 ఎకరాల భూమిని ఇచ్చిందన్నారు. అప్పటి నుంచి రైతులు  వివిధ రకాల పంటలను సాగు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. మహిళా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఏయే పంటలు సాగు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. బోరు బావులు తవ్వించి, పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎంపీడీవో మున్నిని ఆదేశించారు. అనంతరం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కర్వెన రిజర్వా యర్‌ పనులను పరిశీలించారు. ఇంజనీరింగ్‌ అధికారులు, గుత్తేదారులతో మాట్లాడారు. 13, 14, 15 ప్యాకేజీల ద్వారా జరుగుతున్న పనులను వేగవంతం చేయాలన్నారు. తర్వాత మండలం లోని అన్నాసాగర్‌లో రూ.25 లక్షలతో నిర్మించిన మండల పరిషత్‌ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలకు టాయిలెట్‌ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ను మహిళా ఉపాధ్యాయులు కోరారు. చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్‌ చెన్నకిష్టన్న, ఎంపీడీవో మున్ని, డీఆర్‌డీవో వెంకట్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ యాదయ్య, ఇంజనీర్లు ఉన్నారు.


టీబీపై అవగాహన కల్పించాలి

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం): టీబీపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. బుధవారం టీబీ దినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఆవరణలోని టీబీ సెంటర్‌లో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీబీ జిల్లాలో చాపకింద నీరులా వ్యాపిస్తోందన్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వలన కేసులు పెరుగుతున్నాయన్నారు. వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఎవరికైనా టీబీ లక్షణాలు ఉంటే వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించాలన్నారు. వ్యాధి నియంత్రణ కోసం అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం ర్యాలీని, జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ జనరల్‌ ఆస్పత్రి నుంచి బస్టాండు వరకు కొనసాగింది. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ పుట్టా శ్రీనివాసులు, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌, ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ శశికాంత్‌, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్‌ రఫీక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T03:52:48+05:30 IST