అనుమతి లేని రూ.27లక్షల మిర్చి విత్తనాలు సీజ్‌

ABN , First Publish Date - 2021-06-12T04:43:52+05:30 IST

ఓ దుకాణంలో అనుమతి లేని విత్తనాలు విక్రయుస్తున్నారన్న సమాచారంతో అధికారులు

అనుమతి లేని రూ.27లక్షల మిర్చి విత్తనాలు సీజ్‌
వివరాలు వెల్లడిస్తున్న కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్‌ రాజ్‌, చిత్రంలో సీజ్‌ చేసిన విత్తన ప్యాకెట్లు

  • భద్రాద్రి టాస్క్‌ఫోర్స్‌, పోలీస్‌, వ్యవసాయ అధికారుల సోదాలు 
  • సుజాతనగర్‌లో ఓ షాపు యజమానిపై కేసు నమోదు
  • విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఏఎస్పీ రోహిత్‌ రాజ్‌


సుజాతనగర్‌, జూన్‌ 11: ఓ దుకాణంలో అనుమతి లేని విత్తనాలు విక్రయుస్తున్నారన్న సమాచారంతో అధికారులు సోదాలు జరపగా.. రూ.27లక్షల మిర్చి విత్తనాలు లభ్యమైన సంఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో జరిగింది. కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్‌ రాజ్‌ శుక్రవారం సుజాతనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేఽశంలో వివరాలు వెల్లడించారు. సుజాతనగర్‌ మండలంలోని శ్రీనివాస్‌ ట్రేడర్స్‌ షాపుులో ఎలాంటి అనుమతి పత్రాలు లేని మిరప విత్తనాలను అమ్ముతున్నారని సమాచారం రావడంతో ఈనెల 9న జిల్లా టాస్క్‌ఫోర్స్‌, పోలీస్‌, వ్యవసాయశాఖ అధికారులతో సోదాలు నిర్వహించామన్నారు.


ఈ క్రమంలో ప్రభాకర్‌ హైబ్రిడ్‌ సీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన సుమ మిర్చి రకం 6350 ప్యాకెట్లు, రిష మిర్చి రకం 1602 ప్యాకెట్లు, 961 అనే మిర్చిరకం 600 ప్యాకెట్లు, గోల్డెన్‌వ్యాలీ సీడ్స్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించిన అవంతిక రకం 300 ప్యాకెట్లు, జీహెచ్‌ఎస్‌(1004) అనే రకం 1045 ప్యాకెట్లు లభ్యమయ్యాయన్నారు. వాటి విలువ రూ. 27,18,700 ఉంటుందని, వాటిని సీజ్‌ చేసి, అనుమతి లేని విత్తనాలు అమ్ముతున్న శ్రీనివాస ట్రేడర్స్‌ యజమానిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో కొత్తగూడెం ఎస్డీపీవో  జి వెంకటేశ్వరబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ ఎల్‌ ఆదినారాయణ, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ పుల్లయ్య, చుంచుపల్లి సీఐ గురుస్వామి, ఏవో జి నర్మద, ఎస్‌ఐ ఎం శ్రీనివాస్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Read more