15 రోజుల్లో కల్లాలు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-01-21T04:47:02+05:30 IST

రైతులు తమ పంట ఉత్పత్తులను అరబెట్టుకోవడానికి ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న రైతుల కల్లాల నిర్మాణాల్లో వేగం పెంచి 15 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు.

15 రోజుల్లో కల్లాలు పూర్తి చేయాలి
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

- కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

సిరిసిల్ల, జనవరి 20 (ఆంఽధ్రజ్యోతి): రైతులు తమ పంట ఉత్పత్తులను అరబెట్టుకోవడానికి ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న రైతుల కల్లాల నిర్మాణాల్లో వేగం పెంచి 15 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. బుధవారం సిరిసిల్లలోని పొదుపు భవన్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి ఎంపీడీవోలు, వ్యవసాయ, ఉపాధి హామీ పనుల పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న 1092 వ్యవసాయ కల్లాల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో ప్రతి రోజు 15 వేల మంది కూలీలకు ఉపాధిని కల్పించాలని గురువారం సాయంత్రంలోగా అన్నీ గ్రామాల్లోని నర్సరీల్లో బ్యాగ్‌ పిల్లింగ్‌ పూర్తి చేయాలని అన్నారు. రెండు విడతల్లో నిర్వహించిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని చాలావరకు అభివృద్ధి జరిగిందని అదే స్ఫూర్తి నిరంతరం కొనసాగాలని ఆన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడిచెత్తను సేకరించి గ్రామంలో సేంద్రీయ ఎరువులు తయారీ చేసేలా చూడాలని అన్నారు. పారిశుధ్యం అస్థవ్యస్థంగా ఉన్న గ్రామాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను వంద శాతం సంరక్షించాలని అన్నారు. ప్రగతిలో ఉన్న వైకుంఠధామాల నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ వ్యవసాయ కల్లాల నిర్మాణాలు ఉపాధి హామీ పనులు పారిశుద్ధ్యంపై మండల అధికారులు గ్రామాలను సందర్శించి కార్యదర్శులకు అవగాహన కల్పించాలని అన్నారు. అధికారులందరూ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనుల పురోగతిపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, డీపీవో రవీందర్‌, పీఆర్‌ ఈఈ శ్రీనివాస్‌, వ్యవసాయ అధికారి రణధీర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

 

పరిశ్రమల స్థాపనకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి 

జిల్లాలో  పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో  బుధవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో మాట్లాడారు. నూతనంగా స్థాపించే రైస్‌మిల్లులు, స్టోన్‌ క్రషర్‌, సిమెంట్‌ ఇటుక, వెల్డింగ్‌ దుకాణాలు తదితర వాటికి సకాలంలో అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. పారిశ్రామిక రాయితీ పథకం ద్వారా రవాణా వాహనాల కొనుగోలుకు 57 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1.48 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.   సమావేశంలో జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ ఉపేందర్‌రావు, లీడ్‌ బ్యాంక్‌ అఽధికారి రంగారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఏడీ వినోద్‌కుమార్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి అన్సారీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T04:47:02+05:30 IST