ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో గ్యాస్‌ లీకేజీపై సీరియస్‌

ABN , First Publish Date - 2021-05-21T05:53:11+05:30 IST

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో అమ్మోనియా గ్యాస్‌ లీకేజీపై ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సీరియస్‌గా స్పందించారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో గ్యాస్‌ లీకేజీపై సీరియస్‌
ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులతో చర్చిస్తున్న సీపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే చందర్‌

- పరిశీలన జరిపిన పోలీస్‌ కమిషనర్‌, ఎమ్మెల్యే     

- ఉత్పత్తి దశలోనే సమస్యలు ఉంటాయన్న యాజమాన్యం

కోల్‌సిటీ, మే 20: రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో అమ్మోనియా గ్యాస్‌ లీకేజీపై ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సీరియస్‌గా స్పందించారు. గురువారం రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మేయర్‌ అనీల్‌కుమార్‌, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవిదాస్‌ పరిశ్రమను పరిశీలించారు. అమ్మోనియా యూనిట్‌, ఇతర లొకేషన్లను యాజమాన్యం చూపించింది. పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీలపై ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పరిశ్రమ ఈడీ విజయ్‌కుమార్‌ బంగర్‌ను నిలదీశారు. ప్రజల క్షేమమే ముఖ్యమని, పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టిన తరువాతే ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించాలన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలకు పరిశ్రమలో ఉత్పత్తి, లీకేజీలపై పూర్తి స్థాయి అవగాహన, చైతన్యం కల్పించాలని కమిషనర్‌ సత్యనారాయణ సూచించారు. 

లీకేజీలు అయితే ప్లాంట్‌ ఆగిపోతుంది : ఈడీ

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పరిశ్రమ ప్రపంచంలోనే విజయవంతమై న టెక్నాలజీతో నిర్వహిస్తున్నామని, ఇది పూర్తిస్థాయి ఆటో మేటెడ్‌ ప్లాంట్‌ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఈడీ విజయ్‌కుమార్‌ బంగర్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో 20యూనిట్లు ఇలాంటి టెక్నాలజీతో విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. రక్షణ పరంగా పూర్తిస్థాయి ఇన్‌బిల్ట్‌ టెక్నాలజీ కలిగి ఉందన్నారు. పరిశ్రమల చట్టం, రక్షణ చట్టాలను పూర్తిస్థాయిలో అమలుపరుస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాయన్నారు. మార్చిలో ట్రయల్‌ రన్‌ విజయవంతం అయ్యిందని, రోజుకు 200 నుంచి 300టన్నుల యూరియా ఉత్పత్తి జరిగిందని, ఈ నెల 16న చిన్న సాంకేతిక సమస్యలతో కొంత అమ్మోనియా లీకైందని, ఇది ప్రమాదకరమైంది కాదని తెలిపారు. పరిశ్రమను ఉత్ప త్తి దశలోకి ప్రవేశపెట్టేటప్పుడు చిన్నచిన్న సమస్యలు ఎదు రవుతాయని, ఇవి ప్రజలకు హాని కలిగించేవి కాదన్నారు.త్వరలోనే సమీప, పరిసర ప్రాంతాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

సీఎం దృష్టికి తీసుకెళతా : ఎమ్మెల్యే

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పే ర్కొన్నారు. తమకు ప్రజ ల శ్రేయస్సే ముఖ్యమని, పూర్తిస్థాయి రక్షణ చర్య లు చేపట్టాకే పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అమ్మోనియా, ఇతర గ్యాస్‌ లీకేజీలు పునరావృతం కావద్దని యాజమాన్యానికి సూచించా రు. ప్రజలకు అన్నీ విషయాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు.

ప్రజలకు అవగాహన కల్పించాలి : సీపీ

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ అని, ఉత్పత్తి దశలోకి వచ్చేటప్పుడే చిన్నచిన్న సమస్యలు ఉంటాయని యాజమాన్యం చెబుతోందని, దీనిపై సమీప ప్రాంతాలు, కాలనీ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. వారిలో భయాందోళనలు తొలగించాలి సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు ఉన్నారు. 

Updated Date - 2021-05-21T05:53:11+05:30 IST