రాష్ట్రంలో 61% మందిలో యాంటీబాడీలు

ABN , First Publish Date - 2021-07-24T07:41:08+05:30 IST

రాష్ట్రంలోని జనగామ, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన నాలుగో విడత సీరో సర్వేలో 61 శాతం ప్రజల్లో కరోనా యాంటీబాడీలున్నట్లు తేలింది. గత నెలలో చేసి

రాష్ట్రంలో 61% మందిలో యాంటీబాడీలు

వ్యాక్సిన్‌ 2 డోసులు తీసుకున్నవారిలో 94%

6-9 ఏళ్ల పిల్లలు 55% మందిలో ప్రతినిరోధకాలు

జాతీయ పోషకాహార సంస్థ నాల్గో సీరో సర్వే

జనగామ, నల్లగొండ, కామారెడ్డిలో నిర్వహణ

హైదరాబాద్‌ సిటీ, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జనగామ, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన నాలుగో విడత సీరో సర్వేలో 61 శాతం ప్రజల్లో కరోనా యాంటీబాడీలున్నట్లు తేలింది. గత నెలలో చేసిన సర్వే వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఈసారి 6 నుంచి 9 ఏళ్ల మధ్య వయసు పిల్లలపైనా అధ్యయనం సాగించారు. ఈ విభాగంలో 55 శాతంమందిలో ప్రతినిరోధకాలు గుర్తించారు. పెద్దల్లో 61 శాతం, టీకా వేసుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో 82.4 శాతం యాంటీబాడీలున్నట్లు స్పష్టమైంది. గత మూడు విడతలతో పోల్చితే ప్రస్తుత సర్వేలో యాంటీబాడీలున్నవారి శాతం గణనీయంగా పెరిగింది. 2020 మేలో నిర్వహించిన తొలి సర్వేలో 0.33 శాతం, ఆగస్టులో చేసిన రెండో సర్వేలో 12.5 శాతం, డిసెంబరులో నిర్వహించిన మూడో సర్వేలో 24 శాతం మందిలో యాంటీబాడీలున్నట్లు గతంలో ప్రకటించారు. టీకా ఒక్క డోస్‌ వేయించుకున్నవారిలో 78.5 శాతం, రెండు డోసులు పొందినవారిలో 94 శాతం ప్రతినిరోధకాలున్నట్లు సర్వేలో స్పష్టమైంది. అసలు వ్యాక్సిన్‌ తీసుకోనివారిలో 51.3 శాతం ప్రతినిరోధకాలు గుర్తించారు. కాగా, డిసెంబరులో ఇదే జిల్లాల్లో చేసిన మూడో సర్వేలో 24 శాతం మందిలో యాంటీబాడీలున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అది 61 శాతానికి పెరిగింది.


 టీకా తీసుకున్నవారిలో యాంటీబాడీలు అభివృద్ది చెందాయని.. ఎలాంటి సంకోచం లేకుండా ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని ఐసీఎంఆర్‌ ఎన్‌ఐఎన్‌ పబ్లిక్‌ హెల్త్‌ డివిజన్‌ హెడ్‌ డాక్టర్‌ ఎ. లక్ష్మయ్య సూచించారు. 40 శాతం మందికి కొవిడ్‌ ముప్పు ఉన్నందున కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఐసీఎంఆర్‌- ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత తెలిపారు. జిల్లాలవారీగా చూస్తే జనగాంలో తొలి విడత సర్వేలో 0.49 శాతం, రెండోదాంట్లో 18.2 శాతం, మూడోదాంట్లో 24.8 శాతం, నాలుగో సర్వేలో 58.76 శాత మందిలో యాంటీబాడీలు గుర్తించారు. నల్లగొండలో తొలి సర్వేలో 0.24 శాతం, రెండో సర్వేలో 11.1 శాతం, మూడో సర్వేలో 22.9, ప్రస్తుతం 55..88 శాతంమందిలో ప్రతినిరోధకాలున్నట్లు తేలింది. కామారెడ్డిలో మొదటి విడత సర్వేలో 0.24 శాతం మందిలో, రెండో విడతలో 6.9 శాతం, మూడో సర్వేలో 24.7, నాలుగో సర్వేలో 65.61 శాతమందిలో యాంటీబాడీలున్నట్లు స్పష్టమైంది.

Updated Date - 2021-07-24T07:41:08+05:30 IST