కోల్‌కతా నవ్వింది!

ABN , First Publish Date - 2021-10-14T09:03:15+05:30 IST

నాటకీయ పరిణామాల మధ్య ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)ను అదృష్టం వరించింది. విజయానికి చివరి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి ఉండగా.. రాహుల్‌ త్రిపాఠి (12 నాటౌట్‌) సిక్స్‌తో..

కోల్‌కతా నవ్వింది!

  • చెన్నైతో ఫైనల్‌కు సై 
  • వెంకటేష్‌ అర్ధ శతకం 
  • ఆఖర్లో అదరగొట్టిన త్రిపాఠి 
  • హోరాహోరీ క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ ఓటమి 


షార్జా: నాటకీయ పరిణామాల మధ్య ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)ను అదృష్టం వరించింది. విజయానికి చివరి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి ఉండగా.. రాహుల్‌ త్రిపాఠి (12 నాటౌట్‌) సిక్స్‌తో.. నైట్‌రైడర్స్‌ను ఫైనల్‌ చేర్చాడు. బుధవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. శుక్రవారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో చెన్నైను ఢీకొననుంది. వరుణ్‌ చక్రవర్తి (2/26)తోపాటు మిగతా బౌలర్ల దెబ్బకు.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 135/5 పరుగులకే పరిమితమైంది. ధవన్‌ (36), శ్రేయాస్‌ (30 నాటౌట్‌) చెప్పుకోదగ్గ పరుగులు సాధించారు. ఛేదనలో కోల్‌కతా 19.5 ఓవర్లలో 136/7 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు వెంకటేశ్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), శుభ్‌మన్‌ గిల్‌ (46 బంతుల్లో 46) సత్తాచాటారు. రబాడ, నోకియా, అశ్విన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. వెంకటే్‌షకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.


ఓపెనర్లు అదరగొట్టినా: ఢిల్లీ ఆపసోపాలు పడిన పిచ్‌పై.. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, వెంకటేష్‌ తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించడంతో కోల్‌కతా అలవోకగా విజయం సాధిస్తుందనుకున్నారు. కానీ, 7 పరుగుల తేడాతో 6 వికెట్లు చేజార్చుకొని ఇబ్బందుల్లోపడినా.. త్రిపాఠి గెలిపించాడు. ధాటిగా ఆడిన వెంకటే్‌షకు శుభ్‌మన్‌ నుంచి మంచి సహకారం అందడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి నైట్‌రైడర్స్‌ 51/0తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అర్ధ శతకంతో జోరు మీదున్న వెంకటే్‌షను రబాడ క్యాచ్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత గిల్‌, రాణా (13)  టీమ్‌ను గెలుపు దిశగా నడిపించారు. అయితే, రాణా, గిల్‌, కార్తీక్‌ (0), మోర్గాన్‌ (0) వెంటవెంటనే అవుట్‌ కావడంతో ఉత్కంఠ రేగింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 7 పరుగులు కావాల్సి ఉండగా షకీబల్‌, నరైన్‌ను అశ్విన్‌ డకౌట్‌ చేసినా.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య త్రిపాఠి సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. 


తడబడుతూనే: మందకొడి పిచ్‌పై కోల్‌కతా బౌలర్లు చెలరేగడంతో.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ ఆసాంతం తడబడుతూనే సాగింది. ఓపెనర్లు పృథ్వీ షా (18), ధవన్‌ ధనాధన్‌ ఆరంభాన్నే ఇచ్చారు. మూడో ఓవర్‌లో షకీబల్‌ బౌలింగ్‌లో పృథ్వీ సిక్స్‌, ఫోర్‌తో బ్యాట్‌ను ఝుళిపించాడు. ఆ తర్వాతి ఓవర్‌లో నరైన్‌ బౌలింగ్‌లో ధవన్‌ ఏకంగా రెండు సిక్స్‌లు బాదాడు. కానీ, ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన చక్రవర్తి తొలి బంతికే షాను ఎల్బీ చేయడంతో.. క్యాపిటల్స్‌ జోరుకు బ్రేకులు పడ్డాయి. పృథ్వీ, ధవన్‌ తొలి వికెట్‌కు 32 పరుగులు జోడించారు. రన్‌రేట్‌ను పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో ధవన్‌కు జతగా వన్‌డౌన్‌లో స్టొయినిస్‌ (18)ను దించినా ఆశించిన ఫలితం దక్కలేదు. 10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 65/1 పరుగులు మాత్రమే చేసింది. స్టొయినిస్‌ను.. మావి అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో.. రెండో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ధవన్‌, పంత్‌ (6) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. అయితే, చివర్లో అయ్యర్‌, హెట్‌మయర్‌ (17) ఐదో వికెట్‌కు 27 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరును అందించారు. 


స్కోరుబోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా (ఎల్బీ) చక్రవర్తి 18, ధవన్‌ (సి) షకీబల్‌ (బి) చక్రవర్తి 36, స్టొయినిస్‌ (బి) మావి 18, శ్రేయాస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 30, రిషభ్‌ పంత్‌ (సి) త్రిపాఠి (బి) ఫెర్గూసన్‌ 6, హెట్‌మయర్‌ (రనౌట్‌/అయ్యర్‌) 17, అక్షర్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 135/5; వికెట్ల పతనం: 1-32, 2-71, 3-83, 4-90, 5-117; బౌలింగ్‌: షకీబల్‌ 4-0-28-0, ఫెర్గూసన్‌ 4-0-26-1, నరైన్‌ 4-0-27-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-26-2, శివమ్‌ మావి 4-0-27-1. 


కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ (సి) పంత్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 46; వెంకటేశ్‌ (సి సబ్‌) స్మిత్‌ (బి) రబాడ 55; నితీష్‌ రాణా (సి) హెట్‌మయర్‌ (బి) నోకియా 13; త్రిపాఠి (నాటౌట్‌) 12; దినేష్‌ కార్తీక్‌ (బి) రబాడ 0; మోర్గాన్‌ (బి) నోకియా 0; షకీబల్‌ (ఎల్బీ) అశ్విన్‌ 0; నరైన్‌ (సి) అక్షర్‌ (బి) అశ్విన్‌ 0; ఫెర్గూసన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 19.5 ఓవర్లలో 136/7; వికెట్ల పతనం: 1-96, 2-123, 3-125, 4-126, 5-129, 6-130, 7-130; బౌలింగ్‌: నోకియా 4-0-31-2; అశ్విన్‌ 3.5-0-27-2; అవేశ్‌ ఖాన్‌ 4-0-22-1; అక్షర్‌ పటేల్‌ 4-0-32-0; రబాడ 4-0-23-2. 

Read more