భారతీయ వంటకాలపై విమర్శలు చేసిన అమెరికన్ సెలబ్రిటీకి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన NRI మహిళ

ABN , First Publish Date - 2021-08-25T11:02:33+05:30 IST

ప్రపంచానికి మసాలాలు పరిచయం చేసిన భారత వంటకాలపై విమర్శలు చేశాడా అమెరికన్ సెలబ్రిటీ. భారతీయుల

భారతీయ వంటకాలపై విమర్శలు చేసిన అమెరికన్ సెలబ్రిటీకి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన NRI మహిళ

ప్రపంచానికి మసాలాలు పరిచయం చేసిన భారత వంటకాలపై విమర్శలు చేశాడా అమెరికన్ సెలబ్రిటీ. భారతీయుల వంటలన్నీ ఒకే ఒక స్పైస్ (మసాలా దినుసు)తోనే చేస్తారని అజ్ఞానపు మాటలు మాట్లాడాడు. ఇలా ఏదో కామెడీ షోలో మాట్లాడితేనే వినలేం. అలాంటిది ప్రపంచ ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్ట్‌ పత్రికలో ఈ రాతలు వస్తే? దుమారం రేగదూ? ఇప్పుడు అదే జరిగింది. జీన్ వైన్‌గార్టెన్ అనే ఒక కాలమిస్ట్.. వాషింగ్టన్ పోస్ట్‌కు ఒక వ్యాసం రాశాడు. ‘యూ కాన్ట్ మేక్ మి ఈట్ దీస్ ఫుడ్స్’ (మీరు నన్ను ఈ ఆహారం తినేలా చేయలేరు) అనే పేరుతో పబ్లిష్ అయిన ఈ వ్యాసంలో.. అతను భారతీయ వంటకాలపై విమర్శలు చేశారు. ఈ వంటకాలన్నీ ఒకే ఒక మసాలా దినుసుపై ఆధారపడి ఉంటాయని ఎద్దేవా చేశారు. ఈ వ్యాసం కామెడీగా రాసిందే అయినా.. దీనిలో ఆయన రాసిన మాటలు చాలా మందికి కోపం తెప్పించాయి.


ఈ క్రమంలోనే ప్రముఖ టెలివిజన్ పర్సనాలిటీ, ఇండియన్ అమెరికన్ రచయిత పద్మ లక్ష్మి స్పందించారు. జీన్ రాసిన వ్యాసం మొత్తం జాత్యహంకారం, బద్ధకంతో నిండిపోయుందని ఆమె మండిపడ్డారు. అసలు ఇలాంటి వ్యాసాలను పబ్లిష్ చేయాల్సిన అవసరం వాషింగ్టన్‌ పోస్ట్‌కు ఏం వచ్చిందని ఆమె అడిగారు. ‘130 కోట్ల మంది ప్రజలుండే దేశాన్ని, దాని సంప్రదాయాల్ని కించపరచడం తప్పితే దీనిలో ఏం లేదు’ అని ఆమె విమర్శించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మండిపడిన ఆమె.. ట్విటర్‌లో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘1.3 బిలియన్ ప్రజల తరఫున, దయచేసి ఇక తప్పుకో’’ అంటూ ధ్వజమెత్తారు. ఇలా ఆమె ఒక్కతే కాదు.. వేలాది మంది ట్విటర్ యూజర్లు కూడా ఇదే విషయంలో జీన్‌ను తప్పుబట్టారు. భారతీయ వంటకాల్లో వాడినన్ని మసాలా దినుసులు ప్రపంచంలో మరెక్కడా వాడరని, అలాంటిది భారతీయ వంటకాలన్నీ ఒకే దినుసుపై ఎలా ఆధారపడి ఉంటాయని ప్రశ్నించారు.


ఇంత గొడవ జరగడంతో వాషింగ్టన్ పోస్టు.. తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. సదరు ఆర్టికల్‌లో తప్పులున్నాయని, వాటిని సరిచేశామని తెలిపింది. అయితే జీన్ మాత్రం తన పొరపాటును సరిచేసుకోకుండా మరింత మొండి పట్టు పట్టాడు. తన ఆర్టికల్‌పై వివాదం రేగడంతో వాషింగ్టన్‌లో ఉన్న ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌కు వెళ్లానని చెప్పిన జీన్.. తను ఆర్డర్ ఇచ్చిన ఆహారం చాలా అందంగా ఉందని, కానీ దానిలో తనకు నచ్చని ఆకులు, దినుసులు నిండుగా ఉన్నాయని అన్నాడు. అందుకే తాను రాసిన మాటల్లో ఒక్క దాన్ని కూడా తాను వెనక్కు తీసుకోబోనని స్పష్టం చేశాడు. అయితే ‘‘భారతీయ వంటకాలు నీకు నచ్చుతాయా? లేదా? అనేది సమస్య కాదు జీన్. అవన్నీ ఒకే మసాలా దినుసుపై ఆధారపడి ఉంటాయనడం సమస్య’’ అని కొందరు ట్వీట్లు చేశారు.

Updated Date - 2021-08-25T11:02:33+05:30 IST