మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహేష్ బిగాల

ABN , First Publish Date - 2021-05-05T20:48:58+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఉద్దేశిస్తూ రాష్ట్రంలో జరగుతు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహేష్ బిగాల

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఉద్దేశిస్తూ రాష్ట్రంలో జరగుతున్న పరిణామాల్ని సూక్ష్మంగా గమనిస్తున్నట్టు చెప్పారు. ఈటల రాజేందర్ వ్యవహారం గురించి యూఎస్‌ఏలోని ఎన్నారైల కోర్ కమిటీ సభ్యులతో సమీక్షించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రిపై మహేష్ బిగాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఈటల రాజేందర్ ఎన్నారైలతో వర్చువల్ సమావేశం అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఈటల రాజేందర్‌తో ప్రతిపక్షాలకు చెందిన ఎన్నారై సభ్యులు మాత్రమే సమావేశమైనట్టు తాము గుర్తించినట్టు పేర్కొన్నారు. ప్రజా స్వామ్యములో ఎవరితోనైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందన్నారు. అయితే ఆ మీటింగ్ ద్వారా ఈటల రాజేందర్ ఎప్పటినుంచో టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేస్తున్నరన్న విషయం రుజువైందన్నారు. తెరాసలో ఉంటూ ఆ పార్టీనే కూల్చేందుకు ఈటల రాజేందర్ విఫల ప్రయత్నం చేశారని మహేష్ బిగాల ఆరోపించారు. తెలంగాణ బాగుకోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈటల రాజేందర్ విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా బంగారు తెలంగాణ సాధనలో ఎవ్వరైనా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకే ముప్పు అన్నారు. తెలంగాణకి నష్టం చేసే వారిని క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారై మిత్రులతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం విషయాన్ని చర్చించినట్టు చెప్పారు. అందరూ తమ నాయకుడు కేసీఆరే అని స్పష్టం చేసినట్టు వెల్లడించారు. సంక్షేమ పాలన కేసీఆర్‌తోనే సాధ్యమని, వ్యక్తులు కాదు.. వ్యవస్థ ముఖ్యమనే భావనను వారు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. సబ్బండ వర్గాలకు కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం పై సంపూర్ణ విశ్వాసం వ్యక్తపరిచినట్టు చెప్పారు. ఈ సమావేశంలో మహేష్ బిగాలతో టీఆర్ఎస్ యూఎస్ఏ కోర్ కమిటి సభ్యులు మహేష్ తన్నీరు, చందు తాళ్ల, పూర్ణ బైరి, శ్రీనివాస్ గనుగొని, వెంగల్ జలగం, భాస్కర్ పిన్న, మహేష్ పొగాకు, రిషికేష్ రెడ్డి, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-05T20:48:58+05:30 IST