విశాఖలో స్కూబా డైవింగ్!

ABN , First Publish Date - 2021-08-01T18:31:08+05:30 IST

పర్యాటకుల స్వర్గధామంగా విలసిల్లుతున్న ఉత్తరాంధ్ర త్వరలో మరింత ఆకర్షణీయ ప్రాంతంగా మారబోతోంది. తూర్పు కనుమల్లో తొణికిసలాడుతున్న అందాలకు సుదీర్ఘ తీర ప్రాంతం కూడా తోడైంది. సరికొత్త జలక్రీడ...

విశాఖలో స్కూబా డైవింగ్!

పర్యాటకుల స్వర్గధామంగా విలసిల్లుతున్న ఉత్తరాంధ్ర త్వరలో మరింత ఆకర్షణీయ ప్రాంతంగా మారబోతోంది. తూర్పు కనుమల్లో తొణికిసలాడుతున్న అందాలకు సుదీర్ఘ తీర ప్రాంతం కూడా తోడైంది. సరికొత్త జలక్రీడ... స్కూబా డైవింగ్‌ శిక్షణ కేంద్రం ఇక్కడ ఏర్పాటవుతోంది. కొద్దిమందికే పరిమితమైన ఈ క్రీడను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ‘లివిన్‌ అడ్వెంచర్స్‌’ నడుం కట్టింది. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ రుషికొండ, మంగమారిపేట ప్రాంతంలోని సముద్ర తీరంలో గత ఐదేళ్లుగా స్కూబా డైవింగ్‌ నిర్వహిస్తోంది.


ఆసక్తి కలిగిన వారిని అప్పుడప్పుడు సముద్రం లోపలకు తీసుకెళ్లి.. సరికొత్త అనుభూతులు అందిస్తోంది. సంస్థ నిర్వాహకుడైన బలరాం నాయుడు... విజయనగరం జిల్లా పూసపాటిరేగ సమీపాన చింతపల్లి బీచ్‌లో ‘ఏపీ స్కూబా డైవింగ్‌ అకాడమీ అండ్‌ బీచ్‌ రిసార్ట్‌’ ఏర్పాటుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి స్కూబా అకాడమీ ఇదే అవుతుంది...  


విశాఖపట్నం, భీమిలి బీచ్‌లు వదిలేసి.. చింతపల్లిలో స్కూబా డైవింగ్‌ అకాడమీ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. మాల్దీవుల్లో సముద్రం ఎంత తేటగా, పారదర్శకంగా, తక్కువ లోతులో ఉంటుందో... చింతపల్లిలోను అలాగే ఉంటుంది. తీరం నుంచి పది కిలోమీటర్ల వరకు సముద్రంలోకి వెళ్లినా అక్కడ లోతు కేవలం ఐదు నుంచి పది మీటర్లు మాత్రమే ఉండటం విశేషం. తొంగి చూస్తే... సముద్రం అడుగున ఏమి ఉన్నాయో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఆ ప్రాంతాన్ని స్కూబా డైవింగ్‌ శిక్షణకు ఎంచుకున్నారు.


పైగా ఇక్కడ సముద్రగర్భాన గతంలో మునిగిపోయిన ఓడ కూడా ఉంది. దానిని ఓ సందర్శనీయ ప్రాంతంగా మార్చాలనేది నిర్వాహకుల ఆలోచన. ఈ పరిసరాల్లో అరుదైన సముద్ర జీవరాశులు, రకరకాల మొక్కలు కూడా ఉన్నాయి. స్కూబా డైవింగ్‌ ద్వారా సముద్రం అంతర్భాగానికి వెళ్లి... అవన్నీ చూడటం ఒక కొత్త అనుభూతి. మలేషియా వంటి దేశాల్లో పర్యాటకులకు ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి. మనకు లేవు. స్విమ్మింగ్‌ రాని వారికి సైతం మాస్క్‌, ఆక్సిజన్‌ సిలిండర్‌లు అమర్చి, అనుభవజ్ఞులైన శిక్షకుల సాయంతో రోప్‌ ద్వారా సముద్రం లోపలకు తీసుకెళ్లి అన్నీ చూపిస్తారు. 15 నుంచి 30 నిమిషాలు సముద్రం అడుగున అలా షికారు చేసి రావొచ్చు. అలాంటి అనుభూతులే ఇక్కడి పర్యాటకులకు అందించేందుకు స్కూబా డైవింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటు స్కూబా డైవింగ్‌లో రెండు రోజుల నుంచి ఆరు నెలల వ్యవధి గల కోర్సులు కూడా నిర్వహిస్తారు. గ్లోబల్‌ ట్రైనర్స్‌, స్కూబా డైవర్లను ఇక్కడికి రప్పిస్తారు. ఈ శిక్షణ పట్ల యువత ఆసక్తి చూపుతోంది. కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. 

  


ఎలా వెళ్లాలంటే...

శ్రీకాకుళం వెళ్లే జాతీయ రహదారిపై విశాఖ నుంచి 75 కి.మీ. దూరాన విజయనగరం జిల్లా పూసపాటిరేగ సమీపాన చింతపల్లి ఉంది. ఈ గ్రామంలో బీచ్‌ ప్రత్యేకమైనది కావడంతో ఏపీటీడీసీ ఏడేళ్ల క్రితమే అభివృద్ధి పనులు చేపట్టింది. సుమారుగా రూ.3 కోట్లు వెచ్చించి, పర్యాటకుల కోసం ఆరు గదులు, ఒక రెస్టారెంట్‌ నిర్మించింది. సరైన నిర్వహణ లేక అవన్నీ పాడైపోయాయి. ఇపుడు వాటన్నింటిని ఆధునీకరించి, స్విమ్మింగ్‌ పూల్‌ కూడా నిర్మించి, మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి లివిన్‌ అడ్వెంచర్స్‌ ముందుకు వచ్చింది.


ఆ నిర్మాణాలతో పాటు సుమారుగా నాలుగు ఎకరాలున్న ఆ ప్రాంతాన్ని రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకుంది. ఈ అక్టోబరులోనే స్కూబా డైవింగ్‌ అకాడమీ ప్రారంభించనుంది. ఒక్క స్కూబా డైవింగే కాకుండా కయాకింగ్‌, బోటు రైడింగ్‌ వంటికి కూడా ఏర్పాటు చేస్తామని బలరాం నాయుడు తెలిపారు. ఇప్పటికే స్కూబా అనుభవాన్ని విశాఖ వాసులకు అందించిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీరంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి ఆహ్లాదకర జల క్రీడలు మరిన్ని వస్తే విశాఖ పర్యాటక అందం రెట్టింపు అవుతుంది.


- యర్రా శ్రీనివాసరావు, విశాఖపట్టణంRead more