రిప్డ్‌ జీన్స్‌ వేస్తే తప్పేంటి?

ABN , First Publish Date - 2021-03-21T05:30:17+05:30 IST

కొన్నిసార్లు వివాదాలు పాతబడిన ఫ్యాషన్లను తిరిగి ట్రెండ్‌లోకి తెస్తుంటాయి. తాజాగా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి చేసిన ఓ కామెంట్‌తో పాతదైపోయిన రిప్డ్‌ జీన్స్‌ ఫ్యాషన్‌...

రిప్డ్‌ జీన్స్‌ వేస్తే తప్పేంటి?

కొన్నిసార్లు వివాదాలు పాతబడిన ఫ్యాషన్లను తిరిగి ట్రెండ్‌లోకి తెస్తుంటాయి. తాజాగా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి చేసిన ఓ కామెంట్‌తో పాతదైపోయిన రిప్డ్‌ జీన్స్‌ ఫ్యాషన్‌... కొత్త సంచలనం సృష్టించడం మొదలుపెట్టింది. ఈ ఫ్యాషన్‌కు ఊపు తెచ్చిన వాళ్లలో అమితాబ్‌ మనవరాలు కూడా ఉండడం విశేషం!


ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రినాథ్‌ సింగ్‌ రావత్‌, డెహ్రాడూన్‌లో ఓ వర్క్‌షాప్‌కు హాజరైన సందర్భంలో రిప్డ్‌ జీన్స్‌ ధరించే మహిళల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాంటి దుస్తుల సంస్కృతి కలిగిన ఇంటి వాతావరణం పిల్లల పెరుగుదలకు అనువుగా ఉండదని ఆయన అంటూ... ‘‘అలాంటి మహిళలు సమాజంలోకి వెళ్లి, నలుగురినీ కలుస్తూ, సమస్యలను పరిష్కరించాలని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకూ, సమాజానికీ మనం ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాం? ఇదంతా ఇంటి నుంచే మొదలవుతుంది. మనం చేసేదే మన పిల్లలూ అనుసరిస్తారు. ఇంట్లో సరైన సంస్కృతిని పిల్లలకు నేర్పిస్తే, పెరిగి పెద్దయ్యాక వాళ్లెంత ఆధునికంగా మారినా జీవితంలో మాత్రం ఓడిపోరు. మోకాళ్లు కనిపించేలా, చిరిగిపోయిన జీన్స్‌ వేయించి, ధనవంతుల పిల్లల్లా కనిపించాలనుకోవడం... ఈ విలువలేనా ఇళ్లలో నేర్పించవలసినవి? ఇంట్లో నేర్పించనప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?’’ అంటూ రిప్డ్‌ జీన్స్‌ ట్రెండ్‌ పట్ల త్రినాథ్‌ అసహనం వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కొందరు బాలీవుడ్‌ ప్రముఖులకు చిరాకు తెప్పించాయి. 


అమితాబ్‌ మనవరాలి ఘాటు వ్యాఖ్య!

ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది. స్త్రీపురుష సమానత్వం, మహిళల సామాజిక అంశాలకు సంబంధించి ప్రాజెక్ట్‌ నవేలీని స్థాపించిన నవ్య ఉత్తరాఖండ్‌ సీఎమ్‌ను ఉద్దేశిస్తూ ‘‘మా దుస్తులను మార్చమని చెప్పే ముందు మీ మెంటాలిటీ మార్చుకోండి. ఇలాంటి మాటలతో సమాజానికి మీరిస్తున్న సందేశం ఏంటో గ్రహించండి’’ అంటూ ఘాటుగా పోస్ట్‌ పెట్టింది. అంతటితో ఆగకుండా రిప్డ్‌ జీన్స్‌తో ఉన్న తన ఫోటోలను ‘నేను నా రిప్డ్‌ జీన్స్‌ను ధరిస్తాను. థ్యాంక్యూ! వాటిని ధరించడానికి నేను గర్వపడుతున్నాను’ అనే కామెంట్‌తో స్టేటస్‌ పోస్ట్‌ చేసింది.


గుల్‌ పనాగ్‌ కూడా...

సీఎమ్‌ త్రినాథ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బాలీవుడ్‌ నటి గుల్‌ పనాగ్‌ రిప్డ్‌ జీన్స్‌ ధరించి, తీసుకున్న సెల్ఫీని ‘రిప్డ్‌ జీన్స్‌ ధరించాను’ అనే ట్వీట్‌తో పోస్ట్‌ చేసింది. తర్వాత తన అభిమాని కామెంట్‌కు సమాధానంగా.... ‘ఇది 11 ఏళ్ల పాత జీన్స్‌. పాతబడిపోయింది. అంతే తప్ప, రిప్డ్‌ జీన్స్‌గా కొనలేదు!’ అంటూ ట్వీట్‌ చేసి, ‘నచ్చిన దుస్తులు ధరించడంలో తప్పేముంది?’ అనే తన అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేసింది. ఇలా ప్రముఖుల స్పందనలతో ‘రిప్డ్‌ జీన్స్‌ ట్విటర్‌’ టాప్‌ ట్రెండ్స్‌లో ఒకటిగా మారిపోయింది.

Read more